వన్‌ నేషన్‌–వన్‌ ట్యాక్స్‌ దేశానికి ప్రయోజనం

ఈ నెక్స్‌ జెన్‌ రిఫారŠమ్స్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ సాధించే దేశంగా భారత్‌ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.

Update: 2025-09-18 13:09 GMT

వన్‌ నేషన్‌ – వన్‌ ట్యాక్స్‌ అనే విధానం సక్రమంగా అమలు కావటం వల్ల దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ, కేంద్ర నిర్ణయాన్ని అభినందిస్తూ దేశంలో తొలి సారి అసెంబ్లీలో గురువారం తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జీఎస్టీ ప్రయోజనాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. గతంలో సీఎస్టీ, వ్యాట్‌ లాంటి సంక్లిష్టమైన పన్నుల వ్యవస్థ ఉండేది. 17 రకాల పన్నులు , 13 రకాల సెస్సులు సర్చార్జిలు ఉండేవి. ఒక ఉత్పత్తికి అనుబంధ ఉత్పత్తులు వచ్చినా పన్నులు వేసే పరిస్థితి ఉండేది. 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగేలా జీఎస్టీలో రెండు స్లాబులతో సంస్కరణలు తీసుకువచ్చింది.  రెండు శ్లాబులతో పన్నుల వ్యవస్థను మరింత సరళతరం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది. నెక్స్‌ జెన్‌ జీఎస్టీ అమలు దేశంలో ఓ గేమ్‌ చేంజర్‌ అన్నారు. సంపద సృష్టించని వారికి సంక్షేమం చేసే అధికారం లేదు.

కేంద్రం తీసుకువచ్చిన ఈ సంస్కరణలతో ముందుగానే దీపావళి, దసరా పండుగల బోనస్‌ ఇచ్చారు. 99 శాతం మేర వస్తువులన్నీ 5 శాతం పన్ను పరిధిలోకే వచ్చాయి. పేద మధ్యతరగతి ఇలా అందరికీ లబ్ది కలుగుతుంది. ఈ రిఫామ్స్‌ వల్ల పన్ను చెల్లింపు దారుల సంఖ్య 1.51 కోట్లకు పెరిగింది. అలాగే జీఎస్టీ వసూల్లు 22 లక్షల కోట్లకు పెరిగాయన్నారు.

ఈ నెక్స్‌ జెన్‌ రిఫారŠమ్స్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ సాధించే దేశంగా భారత్‌ ఉంటుంది. జీఎస్టీ సంస్కరణలతో వచ్చిన ప్రయోజనాలను ప్రజలందరికీ చేరువ చేసే బాధ్యత అందరం తీసుకోవాలి. నిత్యావసర వస్తువులు సబ్బులు, టూత్‌ పేస్టు, షాంపూలు, నెయ్యి లాంటి వస్తువులన్నీ 5 శాతానికి వచ్చాయి. ఏసీలు, ఫ్రిడ్జ్‌ ల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయి. జీవిత భీమా, ఆరోగ్య భీమాలకు కూడా జీఎస్టీ సున్నా శాతానికి వెళ్లింది.
యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ ద్వారా రూ.750 కోట్ల వరకూ ఏపీకి ఆదా అవుతుంది. అగ్రిటెక్‌ యంత్రాలకు కూడా గణనీయంగా పన్ను తగ్గింది. రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఇళ్ల నిర్మాణానికి వినియోగించే వస్తువుల ధరలు కూడా 5 శాతం శ్లాబ్‌ లోకి వచ్చాయి. నిర్మాణ రంగం పుంజుకుంటుంది. సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునేలా ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై జీఎస్టీ తగ్గింది. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఈ జీఎస్టీ ప్రయోజనాలు దక్కాలి. చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ అంశాలు తెలియాలని సీఎం పేర్కొన్నారు.
జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను క్షేత్రస్థాయి వరకూ ప్రచారం చేసేలా మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సంస్కరణ ఓ ముందడుగు. దీని ద్వారా ప్రజలకు ప్రయోజనాలు కల్పించటంతో పాటు వ్యాపారులకూ ఉపశమనం కలిగిస్తుంది. పెట్టుబడులు ఆకర్షించటం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ను ప్రోత్సహించేలా ఉంది. చరిత్రలో జరిగే మంచి అంశాల్ని కొన్ని రాజకీయ పార్టీలు అర్ధం చేసుకోలేవు, సహకరించవు కూడా. ప్రతిపక్ష హోదా అడుగుతున్న పార్టీది అదే పరిస్థితి. ఈ సంస్కరణల్ని స్వాగతించలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉందని వైసీపీని ఎద్దేవా చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజల పక్షాన పనిచేయాలి. ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు సహకరించాలి.
ప్రజా సమస్యల్ని గుర్తించి భవిష్యత్తులో ప్రజలు ఎలా ఉండాలన్న దానిపై పాలసీలు రూపొందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది. ఈ తరహా సంస్కరణల్ని కనీసం స్వాగతించాలి. లేదా ఆర్ధం చేసుకోవడానికైనా ప్రయత్నించాలి. ఈ రెండూ కొందరు చేయలేకపోవటం బాధాకరం. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం అసెంబ్లీలో గడపాలి. మంత్రులు, అధికారులు బాధ్యతగా శాసనసభలో ఉండాలి. అసెంబ్లీ 175 మంది ఎమ్మెల్యేల కోసం మాత్రమే కాదు... 5 కోట్ల మంది ప్రజల కోసం... వారి భవిష్యత్‌ కోసం అసెంబ్లీ ఏర్పాటైంది. అసెంబ్లీ అనే దేవాలయంలో ప్రజాహితం కోసం చేసే నిర్ణయాలు జరుగుతాయి. ప్రజల జీవితాల్లో మార్పుల కోసం మనం అంతా కూర్చుని చర్చించాలి. దేశాన్ని, భవిష్యత్‌ తరాన్ని ముందుకు నడిపించగలిగిన సంస్కరణ ఇది అని సీఎం చంద్రబాబు మాట్లాడారు.
Tags:    

Similar News