త్వరలో చంద్రబాబును కలవనున్న లక్ష మంది ముస్లింలు

‘చంద్రబాబు నాయుడు తలచుకుంటే బిల్లు చట్టం కాకుండా ఆగిపోతుంది.’;

Update: 2025-04-04 10:24 GMT
AP Waqf Bord Office

వక్ఫ్ బిల్లు 2025 ఒక వైపు పారదర్శకత, సంస్కరణలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, మరోవైపు మత స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తిపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వక్ఫ్ ఆస్తుల ఆక్రమణల సమస్య చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ బిల్లు వాటిని పరిష్కరిస్తుందా లేక కొత్త వివాదాలకు దారితీస్తుందా? అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. వైఎస్సార్సీపీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించగా తెలుగుదేశం నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. జనసేన బిల్లును బలపరుస్తున్నట్లు ప్రకటించింది. రాజకీయంగా ఈ బిల్లు ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య విభజన రేఖగా మారింది. దీని ప్రభావం భవిష్యత్ ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉంది.

చంద్రబాబు నాయుడు కు లక్ష మందితో వినతిపత్రం
ఆంధ్రప్రదేశ్ మైనారిటీ హక్కుల యాక్టివిస్టు, అడ్వకేట్ బషీర్ అహ్మద్ వక్ఫ్ బిల్లు రాజ్యాంగా వ్యతిరేకమయినదని విమర్శించారు. ఈబిల్లు ఒక మతం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని చెబుతూ ఈ బిల్లుని ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరులో శుక్రవారం నాడు వివిధ ముస్లిం సంస్థల ప్రతినిధులు, మత పెద్దలు సమాశేమయి ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేశారని ఆయన చెప్పారు. తొందరలో లక్ష మంది ముస్లింలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలసి ఒక వినతిపత్రం సమర్పించాలని సమావేశం తీర్మానించిందని బషీర్ అహ్మద్ తెలిపారు. “ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బిల్లు అమలు చట్టం కాకుండా చేసే శక్తి ఉంది. ఆయన తలుచుకుంటే ఆపని పూర్తవుతుంది.. అందుకే లక్షమంది ముస్లిం ప్రతినిధులు చంద్రబాబునాయుడికి కలవాలని సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రిని కలిసే తేదీని తొందర్లోనే ప్రకటిస్తాము,” అని బషీర్ అహ్మద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో వక్ఫ్ ఆస్తులు
ఆంధ్రప్రదేశ్‌లో వక్ఫ్ బోర్డు ఆస్తులు  సుమారు 50 శాతం దాకా అక్రమణలో ఉన్నాయని వక్ఫ బోర్డు చెయిర్మన్ ఎస్ కె అజీజ్ చెప్పారు. "బోర్డు పరిధిలో 3,502 వక్ఫ్ సంస్థల ఆధ్వర్యంలో 65,783.88 ఎకరాల భూమి ఉంది. ఇందులో 31,594.20 ఎకరాలలను అక్రమణలో ఉంది. దీనిని వెనక్కి తీసుకునేందుకు చర్యలు చేపట్టాము," అని అజీజ్ చెప్పారు.  మసీదులు, దర్గాలు, విద్యా సంస్థలు వంటి భవనాలు సుమారు 15,000 వరకు వక్ఫ్ భూములో  ఉన్నట్లు ఆయన చెప్పారు.
ఆక్రమణలపై వక్ఫ్ బోర్డు చర్యలు
వక్ఫ్ బోర్డు ఆక్రమణలను గుర్తించడానికి సర్వేలు చేసింది, కానీ పూర్తిస్థాయిలో ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించలేదు. కొన్ని ప్రాంతాల్లో కోర్టు కేసులు దాఖలు చేసినప్పటికీ, వివాదాలు కొనసాగుతున్నాయి. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్న సందర్భాలు తక్కువ. న్యాయపరమైన సంక్లిష్టతలు, రాజకీయ ఒత్తిళ్లు ఇందుకు కారణంగా చెప్పవచ్చు. నిజానికి ఎన్ని ఆస్తులు అక్రమణలోఉన్నాయనే విషయం మీద కూడా స్పష్టమయిన సమాచారం లేదు.కొద్దిరోజుల కిందట రాష్ట్ర మైనారిటీస్ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూర్ మాట్లాడుతూ 14000 వేల ఎకరాల భూమి ఆక్రమణలో ఉన్నట్లు చెప్పారు.ఈ భూమిని రిక్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఆయన చెప్పారు. సుమారు 30 వేల ఎకరాల భూమి వేలంద్వారా లీజుకు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చెయిర్మన్ ఎస్ కె అబ్దుల్ అజీజ్ చెప్పారు.
ముస్లిమ్ లకు చంద్రబాబు తీరని ద్రోహం: మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
రాజ్యంగ విరుద్ద ముస్లిమ్ వ్యతిరేక సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వటం దారుణమని మాజీ ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ముస్లిమ్ లను వాడుకుని ఇప్పడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. లోక్ సభలో టీడీపీ, జనసేనలు ముస్లిమ్ సమాజానికి తీరని ద్రోహం చేశారన్నారు. 2014లో అవసరం కొద్దీ ముస్లిమ్ వ్యతిరేక బీజేపీతో జతకట్టి అధికారంలోకి వచ్చి ఒక్క మైనార్టీకి కూడి మంత్రిగా అవకాశం కల్పించలేదన్నారు. 2024లో బీజేపీతో జతకట్టి వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి ముస్లిమ్ లను మోసం చేశారన్నారు. ముస్లిమ్ మత పెద్దలు చంద్రబాబును కలిసినప్పుడు వారికి అండగా ఉంటానని, అన్యాయం జరగకుండా చూస్తానని నమ్మించి మోసం చేసినట్లు చెప్పారు.
వక్ఫ్ బిల్లుపై చంద్రబాబుకు స్పష్టత ఉంది: టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. రాష్ట్రంలో ముస్లింల రక్షణ, వారి అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంది అని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘దేశం లో టీడీపీ ఒక్కటే కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లులోని అభ్యంతరాలను నిర్మొహమాటంగా జాయింట్‌ పార్లమెంట్‌ యాక్షన్‌ కమిటీకి సిఫార్సు చేసిందన్నారు.
కీలకమైన వక్ఫ్‌ బిల్లుపై చర్చ జరుగుతుంటే వైఎస్సార్సీపీకి చెందిన ఒక్క ఎంపీ కూడా నోరు మెదపలేదన్నారు. నిజంగా జగన్‌కు ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ ఎంపీలు ఎందుకు మాట్లడలేదన్నారు. ‘వక్ఫ్‌ న్బోర్డులో ముస్లిమేతరులను నియమించ వద్దు, వక్ఫ్‌ బిల్లుకు సంబంధించిన అంశాలను పరిష్కరించే అధికారాన్ని కలెక్టర్‌ స్థాయి కన్నా ఉన్నత స్థాయి అధికారికి కట్టబెట్టాలి, వక్ఫ్‌కి సంబంధించిన ఆస్తులను పరిరక్షించేందుకు పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని’ ప్రతిపాదించింది టీడీపీ యే నన్నారు.
వక్ఫ్ బిల్లు అంటే ఏమిటి?
వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 అనేది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఒక చట్ట సవరణ బిల్లు. ఇది 1995లో ఆమోదం పొందిన వక్ఫ్ చట్టంలో సంస్కరణలు చేయడానికి ఉద్దేశించినది. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డుల పరిపాలన, ఆస్తుల నిర్వహణ, పారదర్శకతను మెరుగుపరచడం, అక్రమ ఆక్రమణలను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బిల్లు మొదట 2024లో ప్రవేశపెట్టబడినప్పటికీ, విపక్షాల తీవ్ర వ్యతిరేకత కారణంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపించారు. JPC సిఫారసులతో 2025 ఏప్రిల్ 2న లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది.
ప్రధాన సవరణలు
సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులు, మహిళలు, షియా, సున్నీ, బోహ్రా, వెనుకబడిన ముస్లిం వర్గాల ప్రతినిధులను చేర్చడం.
వక్ఫ్ ఆస్తులను జిల్లా కలెక్టర్ వద్ద రిజిస్టర్ చేయడం తప్పనిసరి.
ప్రభుత్వ నియమిత ఆడిటర్లచే వక్ఫ్ ఆస్తుల ఆడిట్.
వక్ఫ్ బోర్డులు ఏ ఆస్తినైనా స్వచ్ఛందంగా తమదిగా ప్రకటించే అపరిమిత అధికారాన్ని తొలగించడం.
వక్ఫ్ బోర్డుకు ఎదురయ్యే ఇబ్బందులు
ఈ బిల్లు వల్ల వక్ఫ్ బోర్డుల స్వతంత్ర నిర్ణయాధికారం కుంటుపడే అవకాశం ఉంది. ముస్లిమేతరుల చేరిక, ప్రభుత్వ జోక్యం వల్ల బోర్డు స్వతంత్రత నీరుగారిపోతుందని విమర్శలు ఉన్నాయి.
ఆస్తుల రిజిస్ట్రేషన్, ఆడిట్ వంటి కొత్త నిబంధనలు వక్ఫ్ బోర్డులపై అదనపు భారం మోపుతాయి.
ఆస్తుల యాజమాన్యంపై కొత్త నిబంధనల వల్ల వ్యక్తులు, సంస్థలతో వివాదాలు పెరిగే అవకాశం ఉంది.
ముస్లిముల వ్యతిరేకత
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని, మత స్వేచ్ఛను హరించేదిగా భావిస్తోంది.
ముస్లిమేతరుల చేరికను మతపరమైన విషయాల్లో జోక్యంగా చూస్తున్నారు.
వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం లేదా కార్పొరేట్ సంస్థలు స్వాధీనం చేసుకునే కుట్రగా ఆరోపిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీల వ్యతిరేకత
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఎంఐఎం వంటి పార్టీలు ఈ బిల్లును మైనారిటీ వ్యతిరేక చట్టంగా భావిస్తున్నాయి.
ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 (మత స్వేచ్ఛ)ను ఉల్లంఘిస్తుందని వాదిస్తున్నాయి.
బీజేపీ రాజకీయ లబ్ధి కోసం మత విభజన అజెండాను అమలు చేస్తోందని ఆరోపిస్తున్నాయి
Tags:    

Similar News