ఏపీలో లక్షన్నర పెన్షన్లు తీసేశారు : మాజీ సీఎం జగన్‌

ఐదు నెలల్లో 91 అత్యాచారాలు జరిగాయి. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తి స్థాయిలో క్షీణించి పోయిందని జగన్‌ విమర్శించారు.

Update: 2024-11-07 13:07 GMT

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు లక్షన్నర పెన్షన్లు తీసేశారని, కొత్త పెన్షన్ల నమోదు లేదని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిలైందన్నారు. గతంలో ఎప్పుడూ చూడని పరిస్థితిని ఈ సారి చూస్తున్నామని మండి పడ్డారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించిపోయింది. 5 నెలల్లో 91 అత్యాచారాలు. ఏడుగురు చనిపోయారని, సాక్షాత్తూ టీడీపీ కార్యకర్తలు ఆ పనులు చేస్తున్నా, కంట్రోల్‌ చేయకుండా, ప్రభుత్వం సపోర్ట్‌ చేస్తోందని ధ్వజమెత్తారు.

ఇలాంటి అన్యాయమైన పరిస్థితి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చూడలేదన్నారు. ఎన్నికల్లో ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు? రెండింటికీ సంబంధం లేకుండా పోయిందన్నారు. అందువల్లే రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ అన్నారు. 5 నెలలు గడిచాయి. సూపర్‌సిక్స్‌ లేదు. సూపర్‌ సెవెన్‌ లేదు. రెండూ లేవని, ప్రతి వర్గాన్ని కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఐదు నెలల్లోనే అన్ని వ్యవస్థలు నాశనం చేశారని మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రతి క్వార్టర్‌ ముగియగానే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి. కానీ మూడు క్వార్టర్లు వచ్చాయి. ఇంత వరకు పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన ఇవ్వలేదని దీంతో పిల్లలు రోడ్డెక్కుతున్నారని అన్నారు.
విద్యా వ్యవస్థను నాశనం చేశారు. సీబీఎస్‌ఈ క్లోజ్‌ చేశారు. గోరుముద్ద పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అమ్మ ఒడి గాలికి ఎగిరిపోయింది. విద్యా వ్యవస్థ నీరుగారిపోయిందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ కింద బకాయిలు రూ.2400 కోట్లు దాటాయని, 108, 104 సర్వీసులు నడవడం లేదని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ గాలికి ఎగిరిపోయిందని, మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చేశాయని ధ్వజమెత్తారు.
Tags:    

Similar News