'విశాఖ ఉక్కు'లో రెండో 'పొయ్యి' వెలిగేదెన్నాళ్లు?
ఆరు నెలల తర్వాత తాజాగా రెండో బ్లాస్ట్ ఫర్నేస్కు లైటప్. ఇటీవల కేంద్రం ఇచ్చిన రూ.1,640 కోట్లు బ్యాంకు అప్పులకే చెల్లు. మరోవైపు రూ.122 కోట్ల విద్యుత్ బకాయిలు
విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం కుడిచేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాగేసుకుంటోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అయినా కేంద్రం తగ్గేదే లే! అంటోంది. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఈ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు నాలుగేళ్ల నుంచి పలు విధాలుగా ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన వీరి ఆందోళలు కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక కూడా కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి కూటమి నేతలు ఈ స్టీల్స్టాంట్ను ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. పైగా రాష్ట్రానికి ఉక్కు శాఖ సహాయమంత్రి పదవి కూడా
దక్కింది. కానీ ఆశించిన స్థాయిలో అడుగు ముందుకు పడలేదు. ఉక్కు శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసవర్మ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తానని గట్టి హామీ ఇవ్వలేక పోతున్నారు. రాష్ట్రానికి చెందిన విశాఖ, అనకాపల్లి ఎంపీలు, స్థానిక కూటిమి ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మంత్రులు మాత్రం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతూ వస్తున్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక, ఉక్కుశాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు ఢిల్లీలో చర్చలు, సమావేశాలు నిర్వహించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పలేదు. ఈ ప్లాంట్ను ఎలా ముందుకు నడిపించాలన్న దానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నామని చెప్పారు.
ఇన్నాళ్లూ ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్తోనే..
విశాఖ స్టీల్ ప్లాంట్లో మూడు (కృష్ణా, గోదావరి, అన్నపూర్ణ) బ్లాస్ట్ ఫర్నేస్లున్నాయి. ముడి సరకు కొరతతో వీటిలో ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ (కృష్ణా) మాత్రమే ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. మిగతా రెండూ ఇదివరకే మూతపడ్డాయి. దీంతో రోజుకు 22 వేల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాల్సి ఉండగా కొన్నాళ్లుగా కేవలం ఆరేడు వేల టన్నులకు మించి జరగడం లేదు. మరో రెండు బ్లాస్ ఫర్నేస్లు నడవాలంటే ముడిసరకు (బొగ్గు, ఐరన్ ఓర్) తప్పనిసరి. కానీ వీటి కొనుగోలుకు ప్లాంట్ యాజమాన్యం వద్ద నిధుల్లేవ్. ప్లాంట్ కార్మికులకే నెలనెలా జీతాలివ్వలేని పరిస్థితులకు చేరుకుంది.
అందుబాటులోకి రెండో బ్లాస్ట్ ఫర్నేస్..
ముడి సరుకు సరఫరా చేసే సంస్థలు తమకు బకాయిలు చెల్లించలేదంటూ గతంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై కోర్టుకెళ్లాయి. దీంతో ఈ స్టీల్ ప్లాంట్ కోసం వచ్చిన ముడి సరుకు విశాఖ పోర్టు, గంగవరం పోర్టుల్లోనే నెలల తరబడి ఉండిపోయింది. ఫలితంగా ఈ ప్లాంట్ మరింత సంక్షోభంలో చిక్కుకుంది. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో కొన్నాళ్ల క్రితం ఈ ముడిసరుకుకు విముక్తి లభించింది. దీంతో పాటు బ్యాంకు గ్యారంటీతో నెలన్నర నుంచి ఎన్ఎండీసీ కొంతమేర ముడి సరుకు సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరు నెలలుగా మూతపడ్డ మరో బ్లాస్ట్ ఫర్నేస్ (గోదావరి) నుంచి ఉత్పత్తికి వీలుగా సోమవారం లైటపు ప్రారంభించారు. దీని నుంచి పూర్తి స్థాయి హాట్ మెటల్ (ఉక్కు) తయారుకు కనీసం మరో 10-15 రోజులైనా సమయం పడుతుంది.
ఈ బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి రోజుకు ఏడు వేల టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతుంది. దీంతో ఇప్పటికే నడుస్తున్న దానితో పాటు తాజాగా రెండో బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి వెరసి రోజుకు 13-14 వేల టన్నుల ఉక్కు ఉత్పత్తికి వీలు కలగనుంది. అయితే ఈ రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు నడవడానికి పూర్తి స్థాయిలో ముడి సరుకు అవసరం. కానీ ప్రస్తుతం ఈ ప్లాంట్లో రెండు నెలలకు సరిపడిన నిల్వలే ఉన్నాయని కార్మికులు చెబుతున్నారు. అదే నిజమైతే ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వెలిగించిన రెండో ఫర్నేస్కు ముడి సరుకు కొరత రాకూడదు భగవంతుడా! అంటూ కార్మికులు వేడుకుంటున్నారు.
ఇచ్చిన నిధులు అప్పులకే సరి..
ఈ పరిస్థితుల్లో పలు ఒత్తిళ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ ఉక్కు కర్మాగారానికి నెల రోజుల క్రితం రూ.1,640 కోట్లను విడుదల చేసింది. ఇచ్చింది తక్కువే అయినప్పటికీ కార్మికులు గుడ్డిలో మెల్లలా సరిపెట్టుకున్నారు. ఈ నిధులతో కొంతైనా ముడి సరుకు కోసం వెచ్చించవచ్చని ఆశ పడ్డారు. అయితే వీరి ఆశలకు గండి కొడుతూ యాజమాన్యం.. జీఎస్టీ బకాయి రూ. 233 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పు కింద రూ.1,140 కోట్లు చెల్లించేసింది. దీంతో ముడి సరుకు కొనుగోలుకు మళ్లీ నిధుల కొరత సమస్య ఎప్పటిలానే కొనసాగుతుందన్న ఆందోళను ఉక్కు కార్మికులను వెంటాడుతోంది. 'కేంద్రం ఇచ్చిన రూ.1,640 కోట్లతో స్టీల్ ప్లాంట్ ముడి సరుకు కొనుగోలుకు
వెచ్చించాల్సింది బదులు జీఎస్టీ, బ్యాంకు అప్పులకు చెల్లించడం సరికాదు. దీనివల్ల ముడి సరకు కొరత సమస్య తీరదు. ప్యాకేజీ ఇచ్చినా ఈ స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకోలేకపోయిందన్న నెపాన్ని చూపి ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగమే ఇది' అని విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి రామస్వామి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
వెంటాడుతున్న విద్యుత్ బిల్లుల బకాయి..
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్కు విద్యుత్ బకాయిల బెడద వెంటాడుతోంది. ఆర్థిక సంక్షోభంతో కొన్నాళ్లుగా విద్యుత్ బిల్లులను సైతం సక్రమంగా చెల్లించలేక పోతోంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కు ఇప్పటివరకు ఈ ఉక్కు కర్మాగారం రూ.128 కోట్ల బకాయి పడిందని విశాఖపట్నం సూపరింటెండింగ్ ఇంజినీర్ శ్యాంబాబు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి తెలిపారు. ఇందులో ఆగస్టు నెలది రూ.44 కోట్లు, సెప్టెంబర్ నెల బిల్లు బకాయి రూ.84 కోట్ల వరకు ఉంది. ఇందులో ఆగస్టు నెల బిల్లు ఈనెల 27 లోగా చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామని ఇటీవల ప్లాంట్ యాజమాన్యానికి ఏపీఈపీడీసీఎల్ నోటీసు జారీ చేసింది. దీంతో కలవరపడ్డ యాజమాన్యం కొంత గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దీనిపై విద్యుత్ సరఫరా నిలిపివేత నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమించుకోవాలని డిస్కంకు సూచించడంతో ప్రస్తుతానికి ఆ ఆలోచనను ఉపసంహరించుకున్నారు.