‘పెస’ ఎన్నికలను హైజాక్ చేయాలనుకుంటున్న రాజకీయ పార్టీలు
కారణం, పెస చట్టం ప్రకారం గిరిజనుల చేతుల్లో ఉన్న ఆర్థిక వనరుల మీద కన్నుపడటమే...;
By : Admin
Update: 2025-01-02 16:49 GMT
-జువ్వాల బాబ్జి
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనుల స్వయం పాలన అధికారాల కోసం ఉద్దేశించిన "పెస" చట్టం (Panchayats (Extension to the Scheduled Areas) Act) గురించి, పంచాయతీల స్థాయిలో అధికారులు గ్రామసభలు నిర్వహించి గిరిజనులకు అవగాహన కల్పించారు.
అవన్నీ తూతూ మంత్రంగా నిర్వహించారని, చట్టం మీద పూర్తి అవగాహన లేని క్రింది స్థాయి సిబ్బందితో జరిపించారని గిరిజన సంఘాలు విమర్శిస్తున్నాయి. అది అలా ఉండగా, గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడానికి, ప్రభుత్వ అధికారులు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
కొన్ని జిల్లాలలో ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తుంది .ఏలూరు జిల్లాలో మాత్రం ఈనెల 7వ తేదీ నుండి పదవ తేదీ వరకు "పెస "గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని జిల్లా అధికారులు ప్రకటించారు. అందులో భాగంగా గ్రామాలలో "పెస" గ్రామసభలు నిర్వహించి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు, పత్రికలలో అధికారులు ప్రకటనలు ఇచ్చారు .
ఇటీవల నాకు అల్లూరి సీతారామరాజు జిల్లా వర రామచంద్రపురానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఫోన్ చేసి మా మండలంలో "పెస" కమిటీల ఎన్నికలు జరుగుతున్నాయి .అందులో గిరిజనేతర్లు పాల్గొనవచ్చా ?అని అడిగారు. నేను ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాను. ఎందుకంటే ఆయన గత 30 సంవత్సరాలుగా గిరిజన చట్టాల మీద గిరిజనుల హక్కుల కోసం పనిచేస్తున్నారు. అటువంటి ఆయనే ఆ ప్రశ్న అడగటంతో అవగాహన లేని గిరిజనుల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అని ఆందోళన చెందాను.
అది జరిగిన రెండు రోజులకే కుక్కునూరు మండలానికి సంబంధించిన గిరిజన నాయకులు ఫోన్లు చేసి" పెస" కమిటీల కోసం జరిగే ఎన్నికలలో గిరిజనేతర్లు ఓటింగ్ లో పాల్గొనవచ్చా? అనే అనుమానాన్ని వ్యక్తపరిచారు.అలా నన్ను అడిగిన వారిలో, గిరిజనులు ఉన్నారు .గిరిజనేతర్లు ఉన్నారు. ఎందుకు చట్టం వచ్చిన ఇన్ని సంవత్సరాల తరువాత ఈ ప్రాంతంలో 'పెస' కమిటీల ఎన్నికలలో గిరిజనేతర్లు పాల్గొంటున్నారు !అనేది కూడా నాకు అనుమానం రేకెత్తించింది.
కొంచెం లోతుగా ఆలోచిస్తే అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, ఏలూరు జిల్లా మండలాలలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. దీనికోసం విస్తారమైన భూసేకరణ జరిగే క్రమంలో గ్రామసభల తీర్మానం ఆమోదం పొందాలి.
ఇది భూసేకరణ చట్టం 2013లో చాలా స్పష్టంగా పొందుపరిచారు . ఇలా తీర్మానాలు పొందే క్రమంలో భూసేకరణ అధికారులు, గిరిజనేతర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు .దళారీలుగా మారిన గిరిజన నాయకులు లక్షల రూపాయలు కమిషన్ల రూపంలో కొట్టేశారు.ఇంకా ఎటపాక, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలో, గోదావరిలో ఇసుక నిలువలు ఉన్నాయి .వీటిని తవ్వి అమ్ముకోవాలన్నా ,"పెస" గ్రామసభల తీర్మానం తప్పనిసరి .అందుకోసమే ఈసారి జరిగే "పెస "గ్రామ కమిటీల ఎన్నికలలో గిరిజనేతర్లు ఓట్లు వేసేలా రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయి అని స్పష్టమవుతుంది. అయితే షెడ్యూల్ ప్రాంతంలో నివసించే ప్రజలకు "పెస "చట్టం గురించి పూర్తి అవగాహన లేదని అటువంటి అవగాహన కల్పించడంలో ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అర్థమవుతుంది.
ఆ క్రమంలో నేను ప్రజల అవగాహన కోసం ఈ వ్యాసం వ్రాయవలసి వస్తుంది. అసలు ఈ చట్టం రావడానికి గల కారణాలు చారిత్రకంగా పరిశీలించినట్లయితే ,బ్రిటిష్ కాలం నుండి గిరిజన ప్రాంతాలవారి వ్యవహారాలు, ఆచారాలు ,సంస్కృతి సంప్రదాయాలు , అలవాట్లు మిగతా ప్రపంచానికి చాలా భిన్నంగా ఉండేవి.
అంతేకాకుండా బ్రిటిష్ వారి పాలన వచ్చాక, వారు తెచ్చిన రెవెన్యూ, పోలీస్, అటవీ చట్టాలు అమలు చేసి గిరిజన ప్రాంతాలను నియంత్రించాలని చూడగా, గిరిజనులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేశారు. వాటిలో ప్రముఖంగా సంతాల్ తిరుగుబాటు, బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, నాయకత్వంలో జరిగిన రంప పితూరి పోరాటం ,కొమరం భీం నాయకత్వంలో జరిగిన గోండ్వానా పోరాటం కొన్ని ఉదాహరణలు గా చెప్పుకోవచ్చు.
ఆ క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలలో జోక్యం చేసుకోకూడదని నిర్ణయానికి వచ్చి వ్యవహారాలన్నీ వారి వారి స్వయం పాలన అధికారాలుగా గుర్తిస్తూ షెడ్యూల్డ్ ప్రాంతం ప్రత్యేక చట్టాలను తెచ్చింది. అలా కొనసాగింపుగా తెచ్చినది 'పెస' చట్టం 1996. దీనిని 24 /12 /1996 న పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం" ది ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్ "(ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్ ఏరియాస్) యాక్ట్ 1996 (Panchayats (Extension to the Scheduled Areas) Act).
ఇది తెలుగులో "షెడ్యూల్డ్ ప్రాంతంలో పంచాయతీరాజ్ విస్తరణ చట్టం 1996 " గా పిలవబడుతుంది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 వ సంవత్సరంలో రూల్స్ తెచ్చారు. ఈ చట్టం వచ్చాక ఐటీడీఏ అధికారులు గిరిజన గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చట్టం యొక్క ఉద్దేశం, గ్రామ సభకు ఉన్న అధికారాలు, ఎన్నికల నిర్వహణ ,మొదలగు విషయాలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలి . కానీ ఆ దిశగా ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేసినట్లు కనిపించడం లేదు. దానికి ఉదాహరణగా పైన నేను ప్రస్తావించిన అనుభవాలు.
ఈ చట్టం ఉద్దేశం ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు స్వయం పాలన అధికారాలను కల్పించడం . ఇది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంలో పొందుపరచబడింది. దీనిని "రాజ్యాంగంలో రాజ్యాంగం "అని కూడా పిలుస్తారు. ఎందుకంటే గిరిజనులకు ఇది ఒక ప్రత్యేక రాజ్యాంగంగా వారికి స్వయంపాలన అధికారాలను కల్పించింది . దీని ద్వారా గిరిజనులు తమ తమ ప్రాంతాలతో పాటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని ప్రధాన లక్ష్యం.
షెడ్యూల్డ్ తెగల జనాభా కు స్వయంపాలన అవకాశాలు కల్పించడం. గిరిజనుల ప్రజాస్వామిక పద్ధతిన గ్రామ పరిపాలనలో భాగస్వామ్యం చేయడం . ముఖ్యంగా "పెస" గ్రామసభను అన్ని కార్యక్రమాలకు కేంద్రంగా చేశారు. గిరిజన సమాజం యొక్క సంస్కృతి ,సంప్రదాయాలను, ఆచారాలను పరిరక్షించడం.
అంతేకాకుండా రాజకీయంగా పై స్థాయి పంచాయతీరాజ్ వ్యవస్థలు క్రింది స్థాయిలో ఉన్న వ్యవస్థలను ముఖ్యంగా గ్రామసభల అధికారాలను చేజిక్కించుకోకుండా నిరోధించి గిరిజనుల స్వయంపాలన అధికారాలను కొనసాగించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ చట్టం తెచ్చారు. 'పెస' చట్టం స్ఫూర్తితోనే అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా గిరిజన గ్రామ సభకు అధికారాలు సంక్రమించాయి.
అంతేకాకుండా ,సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో తీర్పులిచ్చింది.అందులో ప్రముఖంగా సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కేసు చారిత్రాత్మకమైనది.
ఇంకా ఒరిస్సా రాష్ట్రంలో నియాంగిరి కొండల్లో బాక్సైట్ మైనింగ్ ని వ్యతిరేకిస్తూ అక్కడి డోంగ్రియా గిరిజన తెగ సుప్రీంకోర్టులో వేసిన కేసు "నియం గిరి వర్సెస్ వేదంత కంపెనీ "కేసుగా ప్రసిద్ధి చెందింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి
పెస కమిటీల ఎన్నిక విధానం
ప్రజాస్వామిక పద్ధతిన జరిగే ఎన్నికలలో పంచాయతీ, పరిధిలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన వయోజనులు అందరూ ఎన్నిక ప్రక్రియలో పాల్గొనవచ్చు . చాలామందికి ఈ ఎన్నికల ప్రక్రియలో గిరిజనేతరులు పాల్గొనకూడదు అని ఒక అపోహ ఉంది .కానీ అది వాస్తవం కాదు. గ్రామ సభలో 50% మంది గిరిజనులు పాల్గొనే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి . ఇందులో అనగా 2/3 వంతు ప్రజలు తమ చేతులు ఎత్తి గ్రామ కమిటీ సభ్యులను ఎన్నుకోవాలి. మెజారిటీ" కోరం" ఉండే విధంగా ఎన్నికల నిర్వహణ కమిటీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.అంతేకానీ గిరిజనేతరులు ఓటింగ్ లో పాల్గొనకుండా నియంత్రించే అంశాలను చట్టంలో పొందుపరచలేదు.
దీనితో ఇప్పుడు "పెస" గ్రామ కమిటీల ఎన్నికలలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుండి గిరిజనేతరులు జోక్యం చేసుకుంటూ ,వారికి అనుకూలంగా ఉండే గిరిజనులను, పిసా కమిటీ ఎన్నికలలో పోటీ చేయించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ,వైయస్సార్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఉమ్మడి కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన ,బిజెపి నుండి గిరిజనులను పోటీల్లో నిలబెట్టి గ్రామాలలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ప్రధాన రాజకీయ పార్టీలు ఆరాటపడుతున్నాయి.
ఈ ఎన్నికల వ్యవహారం చూస్తుంటే పంచాయతీ ఎన్నికలు అప్పుడే వచ్చాయా! అన్నట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రజాస్వామిక పద్ధతిన గిరిజనుల స్వయం పాలన అధికారాల కోసం ఉద్దేశించిన "పెస "గ్రామ కమిటీలు రాజకీయ పార్టీలను నియంత్రించే గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
ఇదంతా షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న విస్తారమైన సహజ వనరులపై కన్నేస్తున్న ఇసుక మాఫియా, ఆర్ అండ్ ఆర్ మాఫియా మైనింగ్ మాఫియా ,ఈసారి జరిగే పెస కమిటీ ఎన్నికలను నియంత్రించటానికి చేస్తున్న కుట్రగా అర్థమవుతుంది దీనిని గిరిజనులు, గిరిజనుల కోసం పనిచేసే ప్రజాస్వామిక వాదులు ఆలోచించాలి.
ఆ విధమైన కుట్రలను తిప్పికొట్టే విధంగా గిరిజనులను ఏకం చేసి వారి వారి స్వయం పాలన అధికారాలను, సహజ వనరులపై నియంత్రణ, యాజమాన్య హక్కులను కాపాడుకునే దిశగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
(జువ్వాల బాబ్జి, అడ్వకేట్, జంగారెడ్డి గూడెం, ఆంధ్ర ప్రదేశ్)