గోడ నిర్మాణంలో క్వాలిటీ లేదు..అందువల్లే ప్రమాదం జరిగింది

దేవుడి దర్శనం కోసం క్యూలైన్‌లో ఎదురు చూస్తున్న ఏడుగురు భక్తులు మరణించారు.;

Update: 2025-05-01 15:37 GMT

సింహాచలం అప్పన్న స్వామి దేవాలయం ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోను, భారత దేశం యావత్తు కలకలం రేపింది. ప్రమాదం ఎందుకు జరిగింది? దానికి గల కారణాలు ఏంటి? తదితర అంశాల మీద నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీ కొన్ని కారణాలను గుర్తించింది. క్వాలిటీతో గోడను నిర్మించ లేదని, క్వాలిటీతో నిర్మాణం చేపట్టక వల్లే ప్రమాదం జరిగినట్లు కనిపించింది. కేవలం ఉత్సవాల కోసమే గోడ నిర్మాణాన్ని తాత్కాలిక పద్దతిలో పూర్తి చేశారు. గోడ నిర్మాణాన్ని ఏప్రిల్‌ 16న మొదలుపెట్టి అదే నెల 26 వరకు చేపట్టారు. తాము చేపట్టిన విచారణలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో పాటు, దేవాదాయ శాఖ అధికారులు ఈ విషయాలను వెల్లడించినట్లు కమిటీ గుర్తించింది. ఇదే అంశాల మీద జిల్లా అధికారులతో కూడా కమిటీ మాట్లాడింది.

గోడ నిర్మాణానికి సంబంధించి దేవాలయం మాస్టర్‌ ప్లాన్‌ నిబంధనలకు అనుగుణంగా జరిగిందా? లేదా? అనే దానిని నిర్థారించే పనిలో కమిటి నిమగ్నమైంది. దీంతో పాటుగా గోడ నిర్మాణాన్ని నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌ ఎవరు? దానికి అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు? వాళ్ల ప్రమేయం ఎంత మేరకు ఉంది? వంటి పలు అంశాలపైన కూడా కమిటీ విచారణ చేపట్టనుంది. గోడ నిర్మాణంపైన, ప్లాన్‌కు సంబంధించిన అంశాలను, లోపాలపైన ఓ సమగ్రమైన నివిదేకను రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నారు.
సింహాద్రి అప్పన్న స్వామి సన్నిధిలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి చోటు చేసుకున్న ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై కూటమి ప్రభుత్వం ఉన్నతాధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌ సురేష్‌కుమార్‌ను దీనికి హెడ్‌గా ఏర్పాటు చేశారు. గంజాయి, ఇతర నిషేధిత డ్రగ్స్‌ మీద ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్‌ వింగ్‌ అధికారి ఐజీ ఆర్కే రవికృష్ణ, ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం వెంకటేశ్వరరావులను కమిటీలో సభ్యులు ఏర్పాటు చేశారు. బుధవారం ఈ కమిటీని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. 72 గంటల్లో ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. దీంతో గురువారం ఈ కమిటీ రంగంలోకి దిగింది. క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టిన ఈ కమిటీ గోడ కూలిపోవడంతోనే ప్రమాదం జరిగిందని తేల్చింది.
Tags:    

Similar News