Tirumala No Fly Zone | తిరుమల కొండలపై విమానాలు తిరక్క తప్పదేమో?
శ్రీవారి క్షేత్రంపై విమానాలు ప్రయాణిస్తున్నాయా? ఇందులో వాస్తవం ఎంత? మంత్రి ఏమి చెప్పారు? ఏటీసీ అధికారులు ఏమంటున్నారు?;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-03-04 05:47 GMT
తిరుమల అంతర్జాతీయ ఆధ్మాత్మిక కేంద్రం. దర్శనానికి సముద్రాలు దాటి వస్తుంటారు. గోవిందుడికి విమానాల బాధ తప్పడం లేదు. ఆలయంపై విమానాలు వెళుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం అవుతోంది. తిరుమలను నో ఫ్లైజోన్ చేయాలని టీటీడీ (TTD) వినతిని డీజీసీఏ (Directorate General of Civil Aviation DGCA) ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎందుకీ రాద్దాంతం. అసలు ఇంటకీ ఏమి జరుగుతోంది. ఈ నెలలో రెండుసార్లు తిరుమల గగనతలంపై విమానాలు ఎగిరాయనే విషయం కలకలం చెలరేగింది.
తిరుమల గగనతలాన్ని నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్ దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉంది. తాజాగా తిరుమల కొండపై శుక్రవారం ఉదయం ఓ విమానం ఆకాశంలో కనిపించింది. శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టిందనే వార్త కలకలం రేపింది. దీంతో ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధం. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అని ప్రస్తావిస్తూ టిటిడి చైర్మన్ బిఆర్. నాయుడు స్పందించారు.
"ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధం. తిరుమలను నిషిద్ధ గగనతలంగా ప్రకటించండి" అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కి లేఖ రాశారు. ఆయన రాసిన లేఖ మొదటిది కాదు. చివరిది కాకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో తిరుమల నిషిద్ధ గగనతలంగా ప్రకటించే విషయంలో సాధ్యాసాధ్యాలు, సాంకేతిక అంశాలను పరిశీలిద్దాం.
విమాన ప్రయాణం దిశ, గమనం అనేవి పూర్తిగా పైలెట్ తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో నడిచే ఏరో స్పేస్ మేనేజ్మెంట్ (Aerospace Management) మాత్రమే నిర్దేశించిన గమనానికి అనుగుణంగా ప్రయాణం సాగుతుంది. ఇప్పటి వరకు దేశంలో చారిత్రక కట్టడాలు మినహా ప్రార్థనా మందిరాలపై నిషిద్ధ గగనతలం లేదనేది కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా మాట.
సమస్య ఎప్పటి నుంచి..
తిరుమల కొండకు సమీపంలో విమానాలు ప్రయాణించడం తరచూ చర్చకు ఆస్కారం కల్పిస్తోంది. అప్పటి నుంచి ఇది సర్వసాధారణంగా మారింది. తిరుమలకు సమీపంలో విమానాలు ఎగురుతున్నాయి అంటూ మీడియాలో కథనాలు రాగానే టీటీడీ పాలకమండలిలోని రాజకీయ ప్రతినిధులు స్పందిస్తున్నారు. 2003 ప్రాంతంలో ఈ సమస్య, చర్చ మొదలయింది. దీనిపై స్పందించిన ఆర్మీ ఒకే అని చెప్పినా, DGCA చాలా స్పష్టంగా కుదరదు అని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అప్పటి నుంచి తిరుమల గగనతలాన్ని నిషిద్ధ ప్రాంతంగా ఎందుకు ప్రకటించడం లేదనేది సమాధానం లేని ప్రశ్నేమీ కాదు.
కేంద్ర మంత్రి ఏమన్నారంటే..
తిరుమలను నో ఫ్లైజోన్ గా ప్రకటించాలి అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు నుంచి లేఖ అందుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రెండు రోజుల కిందట స్పందించారు.
"తిరుమల కొండల చుట్టూ విమానాలు ప్రయాణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో విమానాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకునే దిశగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో చర్చిస్తున్నాం" అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. "దేశంలో నో ఫ్లైజోన్ అమలుకు ఎలాంటి నిబంధనలు లేవు" అని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఒక విషయం ఆలోచిద్దాం..
నిజంగా తిరుమల కొండపై విమానాలు ప్రయాణిస్తూ ఉంటే చర్యలు తీసుకోరా? వాస్తవానికి తిరుమల కొండపై విమానాలు ఎగురుతున్నాయా? హెలికాప్టర్ చక్కర్లు కొడుతున్నాయా? ఇందులో వాస్తవికత ఎంత? అనే విషయాలు పరిశీలిద్దాం. సాధారణంగా దూరంగా ఉన్న వస్తువును చూసినప్పుడు మధ్యలో ఉన్న ఆకారం దగ్గరగా కనిపిస్తుంది. కొండపై నిలబడి చూసినప్పుడు ఆకాశంలో ఎగిరే విమానం తిరుమల ఆలయంపై వెళుతున్నట్లు భ్రమించడం సహజం అని రేణిగుంట ఏటిసి (Air traffic control Renigunta) ఇంజినీర్లు చెబుతున్నారు.
గగనతలంపై ప్రయాణిస్తున్నాయా?
రేణిగుంట విమానాశ్రయం నుంచి విమానాలు టేకాఫ్ (Take Off), ల్యాండింగ్ (Landing) సమయంలో తిరుమల గగనతలంపై విహరిస్తున్నాయా? అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. ఈ విషయాలపై రేణిగుంట ఏటిసి (Renigunta Air traffic control) డీజీఎం (deputy general Manager) టీవీఎంసీ రావు 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధికి అనేక విషయాలు వివరించారు.
"తిరుమల గగనతలం మా Atc పరిధిలో ఉందనే విషయం పరోక్షంగా చెప్పారు. విమానాలను సురక్షితంగా ల్యాండింగ్ చేయించడం. అంతే భద్రంగా టేకాఫ్ చేయించడం" మా బాధ్యత అని డీజీఎం టీవీఎంసీ. రావు చెబుతున్నారు.
"విమానంలో లోడ్ చేసిన లగేజ్, ప్రయాణికుల సంఖ్య ప్రామాణికంగా ఉన్న బరువు అంచనా వేసుకొని పైలట్ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో సురక్షితమైన నిర్ణయం తీసుకుంటారు. విమాన ప్రయాణం సాగించే దిశను కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధీనంలోని ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది" అని వివరించారు.
గగనతలం పరిధి ఎంత
సాధారణంగా భూమిపై ఉన్న దూరానికి గగనతలంలో ప్రయాణానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ విషయాలను ఒకసారి పరిశీలిద్దాం.. విమానాలు లేదా హెలికాప్టర్లు తిరుమల గగనతనంపై విహరిస్తున్నాయని చెప్పడానికి సాంకేతిక ఆధారం ఏమిటనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది.
తిరుమల కొండ 4,600 అడుగుల ఎత్తులో ఉంటుంది. రేణిగుంట (తిరుపతి) విమానాశ్రయం (Renigunta international airport) రోడ్డు మార్గంలో తిరుమలకు దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గగనతలంలో 12 అది నాటికల్ మైళ్ల దూరం. ఒక నాటికల్ మైల్ భూమిపై 1.60944 కిలోమీటర్లకు సమానం. అంటే, సాధారణంగా భూమిపై ఉండే దూరానికి ఆకాశ మార్గానికి చాలా వ్యత్యాసం ఉంటుందనేది ఈ విషయం స్పష్టం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో తిరుమల గగనతలంపై విమానాలు చక్కర్లు కొట్టడానికి ఆస్కారం ఉందా? అనే విషయం ఆలోచింప చేస్తుంది.
టేక్ ఆఫ్ ఎలా..
రేణిగుంట విమానాశ్రయం నుంచి బెంగళూరు, హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లే విమానాలు ఎలా టేకాఫ్ తీసుకుంటాయి. ఏ విధంగా ల్యాండింగ్ అవుతాయనేది పరిశీలిద్దాం.
రేణిగుంట విమానాశ్రయం నార్త్ సైడ్ లో జీరో డిగ్రీల నుంచి 2.2° కోణంలో టేకాఫ్ తర్వాత డైరెక్షన్ మార్చుకుంటాయి. విమానం గగనతలంపై ఎంత ఎత్తులో ఉంది? దిశ, గమ్యాన్ని చేరుకునే దిశగా విమానాన్ని మళ్లించడంలో పైలెట్ సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకుంటారు. దీనిని ఏటీసీ పర్యవేక్షిస్తుంది" అని ఆ విభాగం డీజీఎం టీవీఎంసీ. రావు వివరించారు. ఇందులో తిరుమల గిరులకు సమీపం లేదా గగనతలంపై నుంచి డైవర్షన్ తీసుకునే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన అలా స్పందించారు. "విమానం ప్రయాణించడానికి అవసరమైన రూట్ మ్యాప్ ఎయిట్ స్పేస్ మేనేజ్మెంట్ (Aerospace Management) నిర్ణయిస్తుంది" అని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఇది దిశ..
రేణిగుంట విమానాశ్రయం నార్త్ సైడ్ ఉంది. దీనికి చెన్నై విమానాశ్రయం సదరన్ సైడ్ లో ఉంది. సౌత్ సైడ్ లో ఉన్న తిరుమల కొండపైకి విమానం ఎలా పయనిస్తుంది అనేది సాంకేతిక అధికారుల నుంచి వినిపించిన ప్రశ్న.
ఉదాహరణకి హైదరాబాద్ నుంచి విమానం బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవాలంటే ఆ మార్గంలో తిరుమలగిరులు తటస్థ పడవు. ఒకవేళ అదే మార్గంలో ఉన్నప్పటికీ, విమానం 30 వేల అడుగులో ఎత్తులో ప్రయాణిస్తే శ్రీవారి ఆలయంపై విహరించిందని ఎలా అంచనా వేయగలం? చెప్పగలం? అనేది రేణిగుంట ఏటీసీ అధికారుల ధర్మసందేహం. ముందుగానే చెప్పినట్టు దూరంగా ఉన్న వస్తువును చూసే సమయంలో మధ్యలో ఉన్న భాగానికి దగ్గరగానే కనిపిస్తుందనే సూత్రాన్ని గుర్తు చేశారు.
ఏటిసి పరిధి ఎంత?
రేణిగుంట నుంచి తిరుమలకు గగనతనంలో 12 నాటికల మైళ్ల దూరం తోపాటు సుమారు 4,600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ విమానాశ్రయం నుంచి Flifht టేకాఫ్ తర్వాత నిమిషాల వ్యవధిలో ఆ ప్రాంతాన్ని చేరుకోగలదు. కానీ నార్త్ సైడ్ 2.2° లో టర్న్ తీసుకుని విమానం తిరుమల కొండపై ఎలా విహరిస్తుంది? అనే ప్రశ్న ఏటీసీ అధికారుల నుంచి వినిపించింది.
"విమానం బరువు, పొడవు, ప్రయాణికులు, లగేజీ.. ఇలా ఈ మొత్తం బరువును అంచనా వేసిన తర్వాత విమానాన్ని ఏ దిశలో మళ్ళించాలి అనేది పైలెట్ కంపాస్ ఆధారంగా తనకు ఇచ్చిన రూట్ మ్యాప్ మేరకు డైవర్షన్ తీసుకుంటారు" అని ఏటిసి అధికారులు వివరించారు.
రేణిగుంట ఏటిసి (Air traffic control) 25 నాటికల్ మైళ్ల వరకు ఉంటుంది. ఈ లెక్క ప్రకారం 12 నాటికల్ మైళ్ళ దూరం పరిధిలో ఉన్న తిరుమల కొండలు కూడా ఏటిసి పరిధిలోకే వస్తాయి" అని చెప్పకనే చెప్పారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ ముందు సుమారు 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తే కానీ సురక్షితంగా దిగడానికి, ఎగరడానికి అనుకూలం గా ఉండదని విశ్లేషించారు. అంతేకాకుండా
"విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో గాలి దిశ, పీడనం, వేగం, వాతావరణాన్ని మథించిన తర్వాతే పైలట్ ఓ స్థిర నిర్ణయం తీసుకుంటారు" అని ఏటీసీ అధికారులు సాంకేతిక అంశాలను వివరించారు.
మరో ధర్మ సందేహం..
తిరుమల గగనతలంపై విమానాలు వివరిస్తున్నాయి అనే విషయం పై తరచూ ఆందోళన వ్యక్తం అవుతుంది. "నిజంగా ఇలాగే జరిగి ఉంటే, 2003 నుంచి అనేక వినతులు అందుకున్న తర్వాత కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? అంటే, అదే కనుక వాస్తవమైతే ఈ పాటికి నిర్ణయం జరిగి ఉండేది" అని కూడా విమానయాన శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
"రాష్ట్రంలో కాదు కదా. దేశంలో ఎక్కడ కూడా, ఏ ఆధ్యాత్మిక క్షేత్రం గగనతలాన్ని నిషిద్ధ ప్రాంతంగా గుర్తించిన దాఖలాలు లేవు" అని ఆ అధికారులు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశ రక్షణ, భద్రతా వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అందులో రక్షణ వ్యవహారాలు. దేశ రక్షణ సంస్థల సమీపంలో మాత్రమే గగనతలంపై ఆంక్షలు ఉంటాయి. అని కూడా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా వారి మాటలను స్పష్టం చేయడం గమనార్హం. "ఏటీసీ అధికారులతో చర్చిస్తున్నాం" అని చెప్పడం ద్వారా అంతిమంగా ఆ విభాగానిదే తుది నిర్ణయం అనే మాటను ఆయన చెప్పినట్లు కనిపిస్తోంది.
పరిష్కారం ఏంటి
తిరుమల గగనతలాన్ని నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్ల వెనుక ఉన్న ఆందోళన ఎంతవరకు సబబు అనే మాట కూడా అంటున్నారు. గగనతలంలో ఉల్లంఘనలు జరిగితే కేంద్ర విమానయాన శాఖ ఉపేక్షించదని కూడా చెబుతున్నారు. తిరుమల గగనతలంపై నిర్ణయం తీసుకోకపోవడం వెనక కూడా ఇదే కారణం అయి ఉండవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.
పైలెట్ నిర్ణయమే..
విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత లేదా ల్యాండింగ్ సమయంలో పైలట్ మాత్రమే కీలక నిర్ణయం తీసుకుంటారు. ఏటిసి లేదా రూట్ మ్యాప్ ఇచ్చిన ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్ విమానం గమ్యాన్ని చేర్చడానికి సాంకేతికంగా పర్యవేక్షిస్తుంది. అని చెబుతున్నారు. ఇందులో వివాదానికి ఆస్కారమే ఎక్కడ ఉందో మాకు తెలియదు. కానీ, రూట్ మ్యాప్, కంపాస్ ఆధారంగా అక్షాంశాలు రేఖాంశాలను ప్రామాణికంగా తీసుకుని వాతావరణాన్ని అవగాహన చేసుకున్న తర్వాత పైలట్ మాత్రమే ఏ దిశలో వెళితే ప్రయాణికులకు సురక్షితం. రక్షణ అనేది ఆలోచన చేసి క్షణాల వ్యవధిలో నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. అందువల్ల "నిషిద్ధ ప్రాంతం. నిషిద్ధ గగనతలం" అనే మాటలను వారు సున్నితంగా తోసిపుచ్చుతున్నారు. ఈ పరిస్థితిలో
"తిరుమలను నిషిద్ధ గగనతలంగా ప్రకటించాలి" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు కూడా రాసిన లేఖ వల్ల ప్రయోజనం ఉంటుందా? అసలు ఈ విషయంలో కేంద్ర సౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఏమి లేదనే విషయం కూడా ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి.
2016లో టీడీపీ ప్రభుత్వ కాలంలోనే సీఎం చంద్రబాబు కూడా తిరుమల నో ఫైజోన్ కోసం అభ్యర్థించారు. దీనిని కేంద్రం తిరస్కరించింది.
తిరుమలను నో ఫ్లైజోన్ గా ప్రకటించడం సాధ్యం కాదు. రేణిగుంట విమానాశ్రయానికి యాక్సెస్బెలీటీ మరింత తగ్గిస్తుందనే విషయాన్ని అప్పటి పౌర విమానయాన శాఖా సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభలో లిఖితపూర్తక సమాధానం ఇచ్చారు.
సహాయ మంత్రి జయంత్ సిన్హా ఇంకా ఏమన్నారంటే..
రేణిగుంట (తిరుపతి) విమానాశ్రయం చుట్టూ ఉన్న భూభాగం పరిమితుల కారణంగా, తిరుమల కొండను నో ఫ్లైజోన్ లేదా మరో పరిమితి విధిస్తే, విమానరాకపోకలకు తీవ్ర అవరోధం, దేశంలోని మిగతా ప్రాంతాలతో విమానాల అనుసంధానం తగ్గించే ప్రమాదం ఉందని కూడా ప్రస్తావించారు.
డీజీసీఏ ఏమి చెబుతోందంటే..
యాత్రికులు లేదా ఆధ్యాత్మిక కేంద్రాల ప్రాశస్త్యం ఉండవచ్చు గాక. భౌగోళిక, చారిత్రక మతపరమైన కారణాల రీత్యా నిర్ణయాలు తీసుకుంటే మరిన్ని ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉందని డీజీసీఏ గుర్తు చేస్తోంది. దీనివల్ల ప్రయాణికులకు అనుగుణంగా విమానాలు నడపడం సాధ్యం కాదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిది. ఏరోనాటికల్ ఇండియా పబ్లికేషన్స్ ప్రకారం దేశంలో 280 విమానాశ్రాయాలకు పైబడే ఉన్నాయి. ఆ సంఖ్య ఇటీవల పెరిగింది. దీనివల్ల యాత్రా స్థలాలను నో ఫ్లైజోన్లుగా ప్రకటించలేం అని స్పష్టం చేసింది.
2014 నుంచి నూరి జగన్నాథ ఆలయం, కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయం నుంచి కూడా ఇదే తరహా ప్రతిపాదనలు పెండింగ్ లో ఉన్నట్లు డీజీసీఏ గుర్తు చేసింది. తిరుమలను గగనతలంపై నిర్ణయం తీసుకుంటే, మిగతా కేంద్రాలకు వర్తింపే చేయాలి. ఇలా చేస్తే విమానాలు నడపడం సాధ్యం కాదనే విషయాన్ని గుర్తు చేసింది. కాగా
అమలులో మూడు జోన్లు
దేశంలోని గగనతలంపై మూడు రకాల ఆంక్షలు అమలులో ఉన్నాయి. విమానరాకపోకలను నియంత్రించడం, నిషేధిత ప్రాంతం, డేంజర్ జోన్లు అమలు చేస్తున్నాయి. వాటి గగనతలంపై ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే విమాన రాకపోకలు అనుమతిస్తారు. నిషేధిత ప్రాంతంలో ఏమాత్రం అనుమతించరనే విషయం డీజీసీఏ స్పష్టంగా ప్రకటించింది. ప్రస్తుతం నో ఫై జోన్ పరిధిలో.. దేశ వారసత్వ సంపదగా భావించే తాజ్ మహల్, ఖజరహో పై మాత్రమే విమానాలు ఎగరనివ్వడం లేదు. అలాగే పార్లమెంట్, రాష్ట్రపతి, ప్రధాని నివాస ప్రాంతాలు కూడా. నో ఫై జోన్ పరిధిలో తమిళనాడులోని మధురై రీఫైనరీ, ముంబైలోని స్టేషన్, బాబా ఆటమిక్ రీసెర్చ్ స్టేషన్, తమిళనాడులోని కల్పాకం న్యూక్లియర్ స్టేషన్లు నో ఫ్లైజోన్ పరిధిలో ఉన్నాయి. వీటికి పది కిలోమీటర్ల దూరం వరకు విమానాలు ప్రయాణించడానికి వీలులేకుండా రూట్ మ్యాప్ అమలు చేస్తున్నారు. వాటిలో పాటు ముంబై ద టవర్ ఆప్ సైలెన్స్ కూడా నో ఫ్లైజోన్. డేంజర్ జోన్ లో శ్రీహరికోట, చీరాల మిలిటరీ కేంద్రం కూడా ఉంది. ఇదిలావుంటే రాజ్యసభ సభ్యుడిగా, స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేసిన సిఫారసులు కూడా డీజీసీఏ ఎందుకు పరిగణలోకి తీసుకోదు?
ముక్తాయింపు : ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ ఎంపీ కింజారపు ఎర్రనాయుడు కోర్టులో బంతి ఉంది. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి.
కాగా, టీడీపీ ఎంపీగా గెలిచి, కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన పూసపాటి అశోకగజపతి రాజు "నోఫైల్ జోన్ సాధ్యం కాదు" అనే విషయం విస్పష్టంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఈ సమస్యకు కేంద్ర విమానయాన శాఖ, ఏరో స్పేస్ మేనేజ్మెంట్ ఎలాంటి ముగింపు ఇస్తుందనేది వేచిచూడాల్సిందే.