TIRUMALA / HELMATE | హెల్మెట్ లేకుంటే తిరుమలకు నో ఎంట్రీ
తిరుపతి జిల్లా పోలీసులు కొరడా పట్టారు. హెల్మెట్ ధరించని వారి నుంచి రూ.1.10 లక్షలు జరిమానా వసూలు చేశారు.
By : SSV Bhaskar Rao
Update: 2024-12-22 09:58 GMT
ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరి. దీనిని ఎందుకు అమలు చేయడం లేదు. అని హైకోర్టు (High Court) సీరియస్ కావడంతో తిరుపతి జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. తిరుమలకు ముఖద్వారంగా ఉన్న అలిపిరి ( టోల్గేట్ వద్ద పెద్ద సంఖ్యలో బైక్ లను నిలిపివేశారు. హెల్మెట్ ధరించని 110 మందికి ఒక్కొక్కరికి ట్రాఫిక్ పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు.
రాష్ట్రంలో మోటార్ వాహనాల చట్టం సక్రమంగా అమలు చేయడం లేదంటూ ఈనెల 19వ తేదీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. "రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు" అని న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరన్ సింగ్ ఠాగూర్, జస్ట్ చీమలపాటి రవి తో కూడిన ధర్మాసనం తీవ్రంగానే స్పందించింది
"ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని ప్రజలకు సందేశం అందించాల్సిన అవసరం ఉంది" అని కూడా హైకోర్టు పోలీస్ శాఖ బాధ్యతలను గుర్తు చేసిన విషయం తెలిసిందే.
ప్రమాదాల నివారణకు రోడ్డుపై ఉన్న గుంతలను మరమ్మతు చేయడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా, వ్యవహరించే వాహనదారులు అక్కడికక్కడే జరిమానా విధించాలని కూడా హైకోర్టు పోలీసులకు చురకలు వేసింది. అప్పుడే వాహనదారులకు భయం కూడా ఉంటుందనే విషయాన్ని కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో...
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీస్ అధికారులు మరోసారి హెల్మెట్ వాడకం పై అవగాహన పెంచుతూ ర్యాలీలు నిర్వహించారు. మూడు రోజులపాటు ఈ కార్యక్రమాలు వివిధ పద్ధతుల్లో నిర్వహించారు. బైక్ పై వెళ్లేవారు హెల్మెట్ ధరించకుంటే జరీమానా తప్పదనే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కాగా,
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రానికి బస్సులు, కార్లు, జీబుల తోపాటు తిరుపతి వాసులు ఎక్కువగా ద్విచక్ర వాహనాల్లో వెళుతుంటారు. ప్రధానంగా కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా ఎక్కువమంది బైక్ రైడింగ్ చేయడానికి ఇష్టపడతారు. చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కేవలం తిరుమల, తిరుపతి స్థానికులు రోజూ 1500 ద్విచక్ర వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో
తిరుమలకు వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు తో పాటు అక్కడినుంచి తిరుపతికి రావడానికి ఉన్న రెండవ ఘాట్ రోడ్డు లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. టీటీడీ విజిలెన్స్ విభాగాన్ని సంతృప్తి చరచడానికి అన్నట్లుగా హెల్మెట్ బైక్ వెనుక తగిలించుకుని, ప్రయాణాలు సాగించడం పరిపాటిగా మారింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ..
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అలిపిరి పోలీసులతో పాటు, టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా రంగం లోకి దిగింది. హెల్మెట్ లేకుండా బైక్ రైడింగ్ కు ఆ విభాగాల పోలీసులు ఆదివారం ఉదయం నుంచి అనుమతించడం లేదు. హెల్మెట్ లేని వాహనదారులను అలిపిరి టోల్గేట్ సమీపంలో నిలిపివేశారు. తిరుమల ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ వాహనాల తనిఖీ నిర్వహించారు. అలిపిరి టోల్ గేట్ దాటగానే ట్రాఫిక్ సిబ్బంది బైక్ లో హెల్మెట్ లేకుండా వెళుతున్న వారికి కౌన్సిలింగ్ చేశారు.
"ఈ తనిఖీల్లో హెల్మెట్ ధరించాలని వివరించాం. ఒక్కొక్కరికి రూ. వెయ్యి వంతున 110 మందికి జరిమానా విధించాం" అని సీఐ హరిప్రసాద్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
"తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణ కోసం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం" అని సీఐ హరిప్రసాద్ చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారితో కఠినంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడేడి లేదు. బైక్ పై వెళ్లే వారు కూడా కుటుంబాలను దృష్టిలో ఉంచుకోవాలి" అని ఆయన సూచించారు.
2009లో కూడా ఒకసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అప్పటి టీటీడీ సీవిఎస్ఓ రమణ కుమార్ బైక్లో హెల్మెట్ రహిత ప్రయాణానికి అనుమతించకుండా ఆదేశాలు జారీ చేశారు. అలపిరి టోల్గేట్ వద్ద ద్విచక్ర వాహనాలను నిలిపివేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ పరిస్థితి షరా మామూలైంది.
దీనిపై టీటీడీ అలిపిరి ఏవీఎస్ఓ (Assistant Vigilance and Security Officer ) పి. రాజశేఖర్ మాట్లాడుతూ, " తిరుమల ట్రాఫిక్ పోలీసు సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించాం" అని చెప్పారు.
" తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు మా విభాగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అలిపిరి టోల్గేట్ లో కూడా బైక్ రైడర్స్ తోపాటు సొంత వాహనాల్లో వెళ్లే వారికి కూడా ముందు జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాం" అని ఏవఎస్ఓ రాజశేఖర్ స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణ కోసమే ఘాట్ రోడ్లో ప్రయాణానికి నిర్దిష్ట సమయం కూడా నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తిరుమల మొదటి, రెండవ ఘాట్ రోడ్లలో వేగం పరిమితిని కూడా నియంత్రించారు. ఆర్టీసీ బస్సులు కూడా తిరుపతి నుంచి తిరుమల తీరడానికి 45 నిమిషాలు సమయం పెట్టారు. మిగతా వాహనాలకు కూడా ఇదే తరహా ఆంక్షలు విధించి, ప్రమాదాల నివారణ కోసం టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేకంగా దృష్టి నిలిపింది. అయినప్పటికీ, ఘాట్రోడ్లో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఇందుకు ప్రధానంగా, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే కార్లు ప్రమాదాలకు గురైన సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి. ఘాట్ రోడ్ లో అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనేది టిటిడి అధికారుల అభిప్రాయం.
తిరుమలకు వెళ్లేటప్పుడు లేదా తిరిగి వచ్చేటప్పుడు "ప్రైవేటు వాహనాలు బ్రేక్ డౌన్ అయినా సరే. ప్రమాదాలకు గురైనా" సమాచారం అందిన నిమిషాల వ్యవధిలో రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి తగిన సిబ్బంది ఉన్నారని ఏవీఎస్ఓ రాజశేఖర్ చెప్పారు. అయితే వాహనదారులు సొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.