తొమ్మిది రకాల స్కూళ్లు... దేన్లో చేర్చాలో తల్లిదండ్రుల తికమక...

కొత్త స్ట్రక్చర్ రూపొందిస్తే అది వ్యవస్థ అయిపోతుందా? తొమ్మిది రకాల స్కూళ్ల వల్ల విద్యా విధానంలో మార్పులు రావని విద్యా నిపుణుల అభిప్రాయం.;

Update: 2025-05-06 12:26 GMT

ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పులు విద్యార్థులను, తల్లిదండ్రులను కలవర పరుస్తున్నాయి. అన్ని రకాల సౌకర్యాలు ఉన్న స్కూళ్లు తక్కువగా ఉన్నాయి. సాధారణ స్కూళ్లలో టీచర్ల సంఖ్య కూడా క్లాసులకు తగినట్లుగా లేదు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను చేర్పిద్దామా వద్దా అనే సందేహంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. స్కూళ్లకు రకరకాల పేర్లు పెట్టడంతో ఏ స్కూలులో ఏ విధమైన విద్య అందుతుందో తెలియక విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలను ప్రవేశపెట్టింది. ఇది విద్యా వ్యవస్థను పునర్నిర్మించే లక్ష్యంతో రూపొందించిన ఒక సమగ్ర చొరవగా ప్రభుత్వం చెబుతోంది. ఈ సంస్కరణలు లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్నారు. ఫౌండేషనల్ అక్షరాస్యత, డిజిటల్ నైపుణ్యాలు, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు.


జీవో నెంబరు 117లో ఉన్నది ఏమిటి?

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్కరణలు, ఉపాధ్యాయుల సర్దుబాటు, పాఠశాలల విలీనం వంటి అంశాలకు సంబంధించిన జీవో 117 ను గత ప్రభుత్వం ఇచ్చింది. దీనిని రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ జీవో ద్వారా 1 కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీని వల్ల ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. పాఠశాలలు బలహీనమయ్యాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చింది. ఇది విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. ఈ జీవో ద్వారా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో అనేక అన్యాయాలు జరిగాయని, స్థానిక ఉపాధ్యాయులకు అవకాశాలు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారని ఆరోపణలు వచ్చాయి

20 లోపు విద్యార్థులున్న పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సి రావడం, బోధనేతర పనుల వల్ల ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తాయి. ఉపాధ్యాయ పోస్టులను తగ్గించడం, ఉద్యోగోన్నతులు లేకుండా చేయడం వంటి చర్యలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశాయని నాడు ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి వంటి నాయకులు విమర్శించారు. యుటిఎఫ్ వంటి సంఘాలు ఈ జీవో వల్ల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని, ప్రాథమిక పాఠశాలలు 1 నుంచి 5వ తరగతి వరకు నడిచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఒకే సిలబస్, ఒకే పరీక్షా విధానం అమలు చేయాలని, ప్రభుత్వం విచ్ఛిన్నకర సంస్కరణలకు బదులు విద్యార్థులకు ఉపయోగకరమైన చర్యలు తీసుకోవాలని కోరాయి.

ఈ జీవోను టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసి, క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ ద్వారా కొత్త విధానాలు రూపొందించాలని నిర్ణయించింది.

2024-25లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జీవో 117ను ఉపసంహరించేందుకు చర్యలు తీసుకుంది. మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ బదిలీలపై క్షేత్రస్థాయి అభిప్రాయ సేకరణ చేపట్టాలని, జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ప్రజాప్రతినిధులతో వర్క్‌షాప్ నిర్వహించాలని ఆదేశించారు. జీవో 117 రద్దు కోసం ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు చేసిన నిరసనలు, పాఠశాలల విలీనం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొన్న ఇబ్బందులు, విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం వంటి కారణాలు ప్రధానంగా ఉన్నాయి. వివాదం ప్రధానంగా అన్యాయమైన బదిలీలు, పాఠశాలల బలహీనత, విద్యా సంస్కరణల పేరుతో విచ్ఛిన్నకర చర్యల చుట్టూ తిరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త విధానాలు రూపొందిస్తోంది.


తొమ్మిది రకాల పాఠశాలలు

కొత్త వ్యవస్థ తొమ్మిది రకాల పాఠశాలలను ఏపీలో పరిచయం చేసింది, ప్రతి ఒక్కటి నిర్దిష్ట విద్యా స్థాయిలు, అవసరాలను తీర్చడానికి రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతోంది.

శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ (ప్రీ-ప్రైమరీ 1, 2): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నడపబడే ఈ పాఠశాలలు LKG, UKGను ఆటల ఆధారిత, NEP-సమన్వయ కరికులంతో అందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.

బేసిక్ ప్రైమరీ స్కూల్స్ (1 నుంచి 5 తరగతులు): ఫౌండేషనల్ అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రంపై దృష్టి సారించే సరళమైన సెటప్‌లు, తక్కువ వనరులతో పనిచేసే పాఠశాలలకు సరిపోతాయి.

మోడల్ ప్రైమరీ స్కూల్స్ (1 నుంచి 5 తరగతులు): మెరుగైన మౌలిక సదుపాయాలు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ అక్షరాస్యత, AI-ఆధారిత మూల్యాంకనాలతో అధునాతన విద్యను అందిస్తాయి.

ప్రీ-ప్రైమరీ స్కూల్స్ (LKG నుంచి 5వ తరగతి): బాల్య విద్య నుంచి ప్రాథమిక విద్యకు సునాయాసమైన పరివర్తనను అందిస్తాయి. నీడి విద్య (Supplementary Education)ను ఏకీకృతం చేస్తాయి.

అప్పర్ ప్రైమరీ స్కూల్స్ (1 నుంచి 7 తరగతులు): ప్రాథమిక, మాధ్యమిక విద్య మధ్య వారధిగా, హైస్కూల్‌కు పరివర్తనను అందజేసే విధంగా ఉంటాయి.

హైస్కూల్ (1 నుంచి 10 తరగతులు): తక్కువ విద్యార్థుల సంఖ్య ఉన్న ప్రాంతాలకు సరిపోతాయి. ప్రాథమిక నుంచి మాధ్యమిక విద్యను ఒకే చోట అందిస్తాయి.

హైస్కూల్ (6 నుంచి 10 తరగతులు): సాంప్రదాయ హైస్కూల్ మోడల్, మాధ్యమిక విద్యపై దృష్టి సారిస్తుంది.

హైస్కూల్ ప్లస్ (ఇంటర్మీడియట్‌తో): 11, 12వ తరగతులను ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా అందిస్తుంది. పాఠశాల మార్పు అవసరాన్ని తగ్గిస్తుంది.

ప్రధాన పంచాయతీలలో ఈ తొమ్మిది రకాలను స్థాపించడం ద్వారా, ప్రభుత్వం సమీప దూరంలో విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ విస్తృత ఎంపికలు తల్లిదండ్రులకు నిర్ణయాత్మక సవాళ్లను తెచ్చిపెట్టాయి.


తల్లిదండ్రుల్లో గందరగోళం

కాకినాడ వంటి పట్టణాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సరైన పాఠశాలను ఎంచుకోవడంలో గందరగోళంలో ఉన్నారు. ఉదాహరణకు బేసిక్, మోడల్ ప్రైమరీ స్కూల్స్ మధ్య తేడా స్పష్టంగా లేనప్పుడు, హైస్కూల్ రకాల మధ్య ప్రయోజనాలు అస్పష్టంగా ఉన్నప్పుడు, నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఆధునిక సాంకేతికతను అందజేస్తాయి. కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువ కాలం స్థిరత్వాన్ని అందిస్తాయి. అదేవిధంగా హైస్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ విద్యను సమగ్ర పరచడం సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఉపాధ్యాయుల కొరత గురించిన ఆందోళనలు తల్లిదండ్రులను వెనక్కి లాగుతున్నాయి.

విద్యా శాఖ అధికారులు ఈ వ్యవస్థ సౌలభ్యాన్ని అందించడానికి రూపొందించామని వివరిస్తున్నారు. ఉదాహరణకు అంగన్‌వాడీ ఆధారిత శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లో బాల్య విద్యకు అనువైనవి. అయితే మోడల్ ప్రైమరీ స్కూల్స్ అర్బన్, సబ్ అర్బన్ ప్రాంతాల్లో ఆధునిక విద్యను అందిస్తాయి. అయినప్పటికీ ఈ వివరణలు తల్లిదండ్రుల ఆందోళనలను పూర్తిగా తగ్గించలేకపోతున్నాయి. ముఖ్యంగా విద్య నాణ్యత, మౌలిక సదుపాయాలపై అనిశ్చితి ఉన్నప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంలో అర్థం ఉంది.


ఇన్ని రకాల స్కూళ్లతో ఎదురయ్యే సవాళ్లు

ఈ సంస్కరణలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, అవి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER) 2024 ప్రకారం, రాష్ట్రంలో విద్యా లోటును బహిర్గతం చేసింది. 81.1 శాతం 2వ తరగతి విద్యార్థులు తీసివేతలు చేయలేరు. 56 శాతం 8వ తరగతి విద్యార్థులు 2వ తరగతి తెలుగు టెక్స్ట్ చదవలేరు. కొత్త పాఠశాలలు ఈ లోటును పరిష్కరించగలవా? అనే సందేహాలను లేవనెత్తుతున్నాయి.

అదనంగా 2024-25లో 2.63 లక్షల విద్యార్థుల నమోదు తగ్గిందని నివేదికలు సూచిస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు గందరగోళం, అనిశ్చితి కారణంగా ప్రైవేట్ స్కూల్స్‌ను ఎంచుకుంటున్నారు. ఉపాధ్యాయుల కొరత, ముఖ్యంగా హైస్కూల్ ప్లస్‌లో మరొక ప్రధాన ఆందోళనగా ఉంది. LEAP కార్యక్రమం రెమెడియల్ క్లాస్‌లు, టెక్-ఆధారిత మూల్యాంకనాలను చెబుతున్నప్పటికీ, ఈ చర్యలు ఆచరణలో ఎంత ప్రభావవంతంగా ఉంటాయనేది చూడాల్సి ఉంది.

తల్లిదండ్రుల నిర్ణయాలు

తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలు, స్థానం, దీర్ఘకాలిక విద్యా లక్ష్యాల ఆధారంగా ఏ స్కూలులో చేర్పించాలనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఉదాహరణకు ఐదేళ్ల బాలుడికి సమీపంలోని అంగన్‌వాడీలో శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ ఆదర్శంగా ఉంటుంది. దాని సుపరిచితమైన వాతావరణం, ఆటల ఆధారిత విద్య వారిని ఆకర్షిస్తుంది. అయితే 6వ తరగతి విద్యార్థికి అప్పర్ ప్రైమరీ స్కూల్ స్థిరత్వాన్ని అందిస్తుంది. లేదా సైన్స్ బోధనలో మంచి పేరున్న హైస్కూల్ (6 నుంచి 10) మరింత ఆకర్షణీయంగా ఉండవచ్చు. హైస్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ విద్యను సమగ్రపరచడం వల్ల సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, నాణ్యతపై ఆందోళనలు నిర్ణయాత్మక అడ్డంకిగా ఉన్నాయి.

ఈ విద్యా వ్యవస్థపై నమ్మకం లేకుండా పోయింది

గతంలో ఉన్న విధానం బేసిక్ మోడల్. అసలు ఇన్ని రకాల మోడల్స్ ఎవరికి అవసరం. ఎందుకు ఈ నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందో వారికే తెలియాలని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం అన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ పాఠశాలల స్ట్రక్చర్ ను మార్చడం వల్ల విద్యా విధానంలో సంక్షోభానికి దారి తీస్తోందని వ్యాఖ్యానించారు. ఇస్టాను సారం వ్యవహరించడం వల్ల 2.63 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లు వదిలి ప్రైవేట్ స్కూళ్లలో చేరారన్నారు. ప్రైవేట్ స్కూల్స్ వారు స్కళ్ల స్ట్రక్చర్ ను మార్చారా? అంటూ ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ తీసుకునే విద్యాపరమైన నిర్ణయాలు విద్యార్థులకు హాని చేసేవిగా ఉన్నాయన్నారు. క్లాస్ కు ఒక టీచర్ తప్పనిసరిగా ఉండాలి. మంచి ప్రైమరీ స్కూల్ వ్యవస్థ హిమాచల్ ప్రదేశ్ లో ఉందన్నారు.

ప్రైమరీలో ప్రీ ప్రైమరీ ఉండొచ్చు. అది స్కూళ్లలో భాగం కావాలి. అంతే కాని ఫీడింగ్ సెంటర్స్ అయిన అంగన్ వాడీ సెంటర్స్ లో 1,2 తరగతులు, ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రస్తుతం 12 స్కూళ్లలో ఒక్క టీచరే ఉన్నారన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇన్ని రకాల స్కూల్స్ ఏర్పాటు చేయాలని లేదని, ప్రీ ప్రైమరీ పెడితే మంచిదని మాత్రమే చెప్పిందన్నారు.

విద్యను రాజకీయాలకు అనుకూలంగా మారుస్తున్నారు

నూతన విద్యా విధానం ద్వారా తమకు అనుకూల మైన రాజకీయ రంగువైపు వ్యవస్థను తీసుకుపోతున్నారని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవాధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ తో మాట్లాడుతూ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లేకుండా స్కూళ్లకు ఎన్ని పేర్లు పెట్టి ఎన్ని మార్పులు తీసుకొచ్చినా ఏ విధమైన ప్రయోజనం ఉండదని అన్నారు. ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఎక్కడికి పోయినా ఒకే విధమైన వ్యవస్థ ఉంటుందనే నమ్మకం తల్లిదండ్రుల్లో లేకుండా పాలకులు చేశారన్నారు. పాఠ్యాంశాలపై కాషాయం రంగు కనిపించేలా నూతన విద్యా విధానం ఉందని విమర్శించారు. ఎన్సీఈఆర్టీలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని, సీబీఎస్సీ సిలబస్ లో కూడా భారీ మార్పులు తీసుకొచ్చారన్నారు. అవసరం లేని మార్పులు చేయడం ద్వారా కేంద్ర పాలకులు తమకు అనుకూలంగా విద్యా వ్యవస్థను మారుస్తున్నారన్నారు. యుజీసీ పేరు మార్చడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అంగన్ వాడీలు మాతా శిశు సంక్షేమానికి తప్ప పాఠాలు బోధించేందుకు కాదని, అటువంటి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అక్కడ లేరని తెలిపారు.

Tags:    

Similar News