నిమ్మల రామానాయుడి స్టైలే వేరు

ఆయన ఏది చేసినా ఇట్టే వైరల్‌ అయిపోతుంది. నామినేషన్‌ వేసేందుకు సైకిలెక్కినా.. ప్రచారంలో రోడ్ల పక్కన విశ్రమించినా ఆయనకే చెల్లింది.

Update: 2024-04-25 14:15 GMT

నిమ్మల రామానాయుడు స్టైలే వేరు. ఆయన ఏది చేసిన స్పెషల్‌గానే ఉంటుంది. చూడ్డానికి, వినడానికి కొంత చిత్ర విచిత్రంగానే ఉంటుంది కానీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆలోచింప చేసేదిగా ఉంటుంది. అందరి దృష్టిని అతని వైపు దృష్టి మరల్చేట్టు చేస్తుంది. స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా.. దానిపై అధికారులతో మాట్లాడాలన్నా.. ఆ అంశంపై యంత్రాంగం స్పందించేలా చేయాలన్నా ఆయనకు ఆయనే సాటి. దాని కోసం ఆయన ప్రత్యేకంగా కొంత సమయం వెచ్చించి కసరత్తు కూడా చేస్తారు. దీనిలో ఆయన ఆరితేరారు. ఆయన అంతిమ లక్ష్యం ప్రజలను ఆకట్టుకోవడం. ఇక ఎన్నికల సమయంలో ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో ఒక సారి ఆలోచించండి. చిన్న పని చేసినా సెకన్లలో ప్రజల్లోకి చేరువయ్యే విధంగానే మైండ్‌కు పని చెబుతారు. ఎన్నికల ప్రచారం అందరి కంటే భిన్నంగా చేయాలనుకున్నారు. సహజంగా ఎన్నికల ప్రచారం అంటే అనేక రకాలు చేస్తారు. కార్లు, జీప్‌లు, స్కూటర్లు, బైక్‌లు, ఆటోలు ఇలా వాహనాల్లో తిరుగుతూ ప్రసంగాలు చేస్తూ ఊరారా ప్రచారం నిర్వహిస్తారు. ఎండ పూటంటే నేతలు, కార్యకర్తలు రారు కాబట్టి ఎండ పూట కాకుండా ఉదయం పూటో.. సాయంత్రపు వేళ్లల్లోనూ వడదెబ్బకు గురి కాకుండా ప్రచారం నిర్వహిస్తారు. తిరిగి రాత్రి సమయానికి ఇంటికి చేరుకుంటారు. రేపు ఏమి చేయాలనే దానిపై ఇంటి వద్ద ముఖ్య నేతలు, కార్యకర్తలతో చర్చిస్తారు. ఇక నిద్రకు ఉపక్రమిస్తారు. తెల్లారి లేచిన తర్వాత తిరిగి ప్రచారం మొదలు పెడతారు. కానీ పాలకొల్లు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, 2024 టీడీపీ అభ్యర్థి అయిన నిమ్మల రామానాయుడు మాత్రం అందుకు భిన్నంగా సాగుతున్నారు. ఎక్కడ ప్రచారం నిర్వహిస్తే అక్కడే రాత్రిపూట నిద్రిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక టెంట్‌ వేయించుకోవడం, దాని కింద ఒక మడత మంచం వేసుకోవడం, దానిపైన దుప్పటి పరచుకోవడం, దోమలు కుట్టకుంగా దోమ తెరను కట్టుకోవడం, మధ్య రాత్రుల్లో దప్పికైతే తాగేందుకు ఒక వాటర్‌ బాటిల్‌ను పక్కన పెట్టుకోవడం, గాలి కోసం ఒక టేబుల్‌ ఫ్యాన్‌ను వేసుకోవడం పడుకోవడం, తెల్లవారు జామున నిద్ర లేవడం, రోడ్డు పక్కనే స్నానం చేయడం మళ్లీ ప్రచారానికి వెళ్లడం చేస్తున్నారు. దీంతో స్థానికులు, నేతలు, కార్యకర్తలు సైతం ఆయన పనికి ఆశ్చర్యపోతున్నారు.

ఇంతే వెరైటీగా ఇటీవల నామినేషన్‌ ప్రక్రియ కూడా చేపట్టారు. అందరూ కార్లు, పెద్ద ఊరేగింపులు, డప్పుల దరువులతో నామినేషన్‌లు వేస్తుంటే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాత్రం సింపుల్‌గా తన గురై్తన సైకిలెక్కి, తన నేతలు, కార్యకర్తలను కూడా సైకిళ్లతోనే రమ్మని చెప్పి ఊరేగింపులా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. దాని కంటే ముందు రాజకీయ పెద్దలైన హరిరామ జోగయ్య కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాదు మాజీ ఎమ్మెల్యే సిహెచ్‌ సత్యనారాయణమూర్తి(డాక్టర్‌ బాబ్జీ), మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆశీస్సులు తీసుకొన్నారు. ఇలా రామానాయుడు ఏది చేసినా వెరైటీగా చేయడం, దాంతో రామానాయుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం అతని నైజంగానే స్థానిక నేతలు చర్చించుకుంటుంటారు.
Tags:    

Similar News