ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే సమగ్రమైన నూతన ఫిల్మ్ పాలసీని తెస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం వెలగపూడి సెక్రటేరియట్ లోని రెండవ బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలతో రూపొందించిన డాక్యుమెంట్ ని నిర్మాతలు మంత్రి కందుల దుర్గేష్‌కు అందించారు. సినిమా పరిశ్రమ సమస్యలు, 24 విభాగాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి దుర్గేష్ ను నిర్మాతలు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ లు, కొత్త సినిమా విడుదల, నూతన ఫిల్మ్ పాలసీ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో సీఎం, డిప్యూటీ సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ సహకారం కావాలని కోరుకుంటున్నారు, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేసి సరైన ప్రతిపాదనలతో రావాలని దుర్గేష్ సూచించారు.
తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారం, చేస్తున్న కృషిని సినీ నిర్మాతలు అభినందించిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించామన్నారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటు అంశంలో ముందుకు వస్తే ప్రభుత్వ సహకారం అందిస్తామన్నారు. ఈ అంశంపై త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటుకు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఈ ఏడాది నంది అవార్డులు తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు. ఏ విధానంలో నంది అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తే చిత్ర పరిశ్రమకు ఉపయోగపడుతుందో ఆ తరహా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలకు సూచించారు. తదుపరి సమావేశంలో నంది అవార్డుల విషయంపై స్పష్టత వస్తుందన్నారు. ఇరు రాష్ట్రాలకు తెలుగు సినిమా ఒక్కటే అన్నారు. ఉత్తమ చిత్రం ఎక్కడైనా ఉత్తమంగానే నిలబడుతుందని అన్నారు. నంది అవార్డుల ఎంపిక ఇరు రాష్ట్రాలు కలసి చేయాలా, విడివిడిగా చేయాలనే అంశంపై నిర్మాతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిపారు. సినిమా రూపకల్పన, విధి విధానాల విషయంలో బడ్జెట్ ను ప్రాతిపదికగా తీసుకొని ఏయే సినిమాలకు ప్రభుత్వం తరఫున ఏ రకమైన సాయం అందించాలనే అంశంపై చర్చించామన్నారు. త్వరలోనే ఈ అంశంపై తగు నిర్ణయం తీసుకుంటామని నిర్మాతలకు మంత్రి దుర్గేష్ స్పష్టమైన వివరణ ఇచ్చారు.