ఏపీ ఫైబర్‌నెట్‌కు కొత్త ఊపిరి- పునర్ వ్యవస్థీకరణకు రూ.1,900 కోట్లు!
ఆధునిక ఇంటర్నెట్ సేవల దిశగా మరొక అడుగు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం;
By : The Federal
Update: 2025-05-14 06:42 GMT
ఆంధ్రప్రదేశ్‌లో చౌక ధరకు ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ల్యాండ్ ఫోన్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఏపీ ఫైబర్‌నెట్‌కు కొత్త ఊపు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొంతకాలంగా కునారిల్లుతున్న ఏపీ ఫైబర్ నెట్ ను పూర్తి స్థాయిలో సంస్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా రూ.1,900 కోట్లతో సంస్థ పునర్ వ్యవస్థీకరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
2016లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రారంభమైన ఫైబర్‌నెట్ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు రూ.149 బేసిక్ ప్లాన్‌తో ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సేవలు అందిస్తున్నారు. వైసీపీ పాలనలో కనెక్షన్ల సంఖ్య 9 లక్షల నుంచి కేవలం 4.5 లక్షలకు పడిపోయింది. సేవల నాణ్యత దారుణంగా పడిపోయిన నేపథ్యంలో, ప్రభుత్వం 2025 నుంచి 2029 మధ్య కనెక్షన్ల సంఖ్యను 50 లక్షలకు పెంచే లక్ష్యంతో ప్రణాళికలు రచించింది.
ప్రస్తుతం ఫైబర్‌నెట్ సంస్థ సొంతంగా నిర్వహిస్తున్న నెట్‌వర్క్ నిర్వహణ పెద్ద భారం అయిపోవడంతో, ప్రైవేట్ ఏజెన్సీలకు ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్స్ట్రక్షన్) విధానంలో బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రైవేటీకరణతో త్వరితగతిన సేవలు...
కేబుల్, ఇతర సాంకేతిక భాగాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. విశాఖపట్నంలోని నెట్‌వర్క్ ఆపరేషన్ సెంటర్ (NOC) నుంచి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల స్థాయి వరకు సేవలను సమర్థంగా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతాయి.
పాఠశాలలు, పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
వెంటాడుతున్న నిధుల సమస్య..
ఫైబర్‌నెట్‌కు సంబంధించి భారత బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ (BBNL) ద్వారా 81 వేల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఇప్పటికే ప్రాజెక్టులో ఉంది. దీని నిర్వహణ ఖర్చు కేంద్ర-రాష్ట్రాల నడుమ 60:40 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంటుంది.
అయితే, కేంద్రం విడుదల చేసిన రూ.450 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందని ఆరోపణలు రావడంతో, ఇప్పుడు వాటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నిధులను తిరిగి చెల్లిస్తేనే కేంద్రం కొత్త ప్రాజెక్టుకు అనుమతి ఇస్తుందనే షరతు పెట్టింది.
ప్రస్తుతం ఫైబర్‌నెట్ సంస్థలో కేవలం 300 మంది సిబ్బందే మిగిలారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. గత రెండు వారాల్లోనే 25 వేల మంది వినియోగదారులు సేవలను రద్దు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,500 మంది కేబుల్ ఆపరేటర్ల జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉందని కేబుల్ ఆపరేటర్ల జేఏసీ హెచ్చరిస్తోంది. “ఎన్‌వోసీ నుంచి రెండు గంటలు సిగ్నల్ ఆగిపోయింది. రాష్ట్రంలోనే ప్రసారాలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించలేదు” అని జేఏసీ ఛైర్మన్ సీతారామయ్య ఆరోపించారు.
విజిలెన్స్, సీఐడీ దర్యాప్తు – గత అక్రమాలపై పరిశీలన
గత ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో జరిగిన అనేక అక్రమాలపై తాజాగా కూటమి ప్రభుత్వం విజిలెన్స్, సీఐడీ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే 908 మంది సిబ్బందిని వివిధ దశల్లో తొలగించింది.
నూతన ప్రతిపాదనల అమలుతో ఏపీ ఫైబర్‌నెట్ సేవలను తిరిగి ప్రజల వద్దకు చేరుస్తామని, అధిక సేవలతో మరింత మంది వినియోగదారులను ఆకర్షిస్తామని ప్రభుత్వం భావిస్తోంది. నిఘా, నిర్వహణ సామర్థ్యం మెరుగుపడితే ఏపీ డిజిటల్ కనెక్టివిటీ లో ఒక ప్రముఖ మోడల్‌గా నిలవవచ్చని నిపుణులు భావిస్తున్నారు.