బస్ మంటల్లో నెల్లూరు ఇంజినీర్ కుటుంబం
నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువ ఇంజినీర్ కుటుంబం కర్నూలు వద్ద జరిగిన బస్ ప్రమాదంలో మరణించారు.
By : The Federal
Update: 2025-10-24 03:23 GMT
కర్నూలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సుమారు 20 మంది సజీవదహనం అయ్యారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉలిందకొండ సమీపంలో బైకును ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 12 మంది కిందకు దూకి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నెల్లూరు కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రమేష్ కుటుంబం ఉంది. రమేష్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం అందింది.
రమేష్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వింజమూరు మండలం గొల్లవారి పాలెంకు చెందిన గొల్ల రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది.
హైదరాబాద్ నుంచి సుమారు 44 మంది ప్రయాణికులతో కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు బెంగళూరుకు బయలుదేరింది. బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే బైకును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు అద్దాలను పగలగొట్టి కిందకు దూకేశారు. మిగతా ప్రయాణికులు మంటల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా, పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు.