కూటమి నేతలు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు
కరేడు రైతులకు న్యాయవాదుల బృందం మద్దతు తెలిపిందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు.;
విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కూటమి నాయకులు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. ఆదివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. నవరత్నాల్లో ఒకటైన విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ఇంత వరకు సొంత గనులు లేవన్నారు. దేశంలో సొంత గనులు లేని ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అని, సొంత గనులు లేకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని, వీటిని సాకుగా చూపి, ప్రజలను మభ్యపెట్టి ప్రైవేటు పరం చేసేందుకు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వందకి వంద శాతం అమ్ముతామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇదే నిర్ణయం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చెప్పిందని, విశాఖ స్టీల్‌ను అమ్మాలని కేంద్రం ప్రకటిస్తే.. ప్రజల చెవిలో కూటమి నేతలు పువ్వులు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు.