దుమారం రేపుతోన్న నాగబాబు వ్యాఖ్యలు

పవన్‌ కల్యాణ్‌ గెలుపునకు కష్టపడి పని చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ మీద నాగబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-03-16 08:01 GMT

జనసేన పార్టీ 12వ ఆవిర్భావం సందర్భంగా మార్చ 14న పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన భారీ సభలో వేడుకల సభలో ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. పిఠాపురంలో పవన్‌ గెలుపునకు సంబంధించిన నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. పవన్‌ కల్యాణ్‌ గెలుపునకు కూటమి భాగస్వాములైన జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులతో పాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం టీడీపీ నేత వర్మ, అతని అనుచరులు, శ్రేయోభిలాషుల వల్ల పవన్‌ కల్యాణ్‌ గెలవ లేదనే అర్థం వచ్చేలా నాగబాబు మాట్లాడతంతో ఇవి చర్చనీయాంశంగా మారాయి. కూటమి భాగస్వాములైన జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల శ్రేణులతో పాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మలు పని చేయకుండానే పవన్‌ కల్యాణ్‌ అంత మెజారిటీతో గెలిచి పోయారా? అనే చర్చ జరుగుతోంది. కూటమి శ్రేణులతో పాటు వర్మ అనుచరుల్లో ఆగ్రహం తెప్పించేవిగా నాగబాబు వ్యాఖ్యలు ఉన్నాయంటూ చర్చించుకుంటున్నారు. ఎందుకు నాగబాబు ఇలా వ్యాఖ్యలు ఎందు చేయాల్సి వచ్చిందనే చర్చ కూటమి వర్గాల్లో జరుగుతోంది.

చంద్రబాబు 2024 ఎన్నికల్లో పిఠాపురం టికెట్‌ మాజీ ఎమ్మెల్యే వర్మకు కేటాయించాల్సి ఉంది. పిఠాపురంలో వర్మ బలమైన నాయకుడు. అతనికి కాకుండా ఎవరికి టికెట్‌ ఇచ్చినా వర్మ సపోర్టు లేకుండా ఆ అభ్యర్థి పిఠాపురంలో గెలవడం అసాధ్యం. పిఠాపురంలో అంత పలుకుబడి వర్మ సొంతం. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలవడమే దీనికి నిదర్శనం. ఆ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులను తుంగలో తొక్కి భారీ మెజారిటీతో గెలుపొందారు. హోరా హోరాగీ జరిగిన ఆ ఎన్నికల్లో ఇండిపెండింట్‌ అభ్యర్థిగా పోటీలో దిగిన వర్మ 47 వేలకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి బరిలోకి దిగిన వర్మ పీఆర్పీ అభ్యర్థి వంగా గీత చేతిలో ఓటమి పాలయ్యారు.
తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వర్మకు టికెట్‌ను నిరాకరించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అలా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వీవీ విశ్వమ్‌కు 15,187 ఓట్లు, వైసీపీ అభ్యర్థి పెందెం దొరబాబుకు 50,431 ఓట్లు రాగా, వర్మ ఏకంగా 97,511 ఓట్లు సంపాదించి విజయం సాధించారు. తర్వాత వర్మ టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వర్మ వైసీపీ అభ్యర్థి దొరబాబు చేతిలో ఓటమిని చవిచూశారు. ఈ నేపథ్యంలో 2024లో టీడీపీ నుంచి వర్మకే టికెట్‌ వస్తుందని భావించారు. అయితే అనుకోని పరిణామాల్లో పొత్తుల్లో భాగంగా జనసేనకు పిఠాపురం సీటును కేటాయించారు. పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగారు.
ఈ క్రమంలో నామినేషన్‌ దాఖలు నాటి నుంచి ఎన్నికలు పూర్తి అయ్యి ఫలితాలు వెలువడేంత వరకు పవన్‌ కల్యాణ్‌ వర్మ చేతిని వదిలి పెట్ట లేదు. ఇద్దరు కలిసే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. తన కోసం పని చేసినట్లుగా వర్మ పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం కృషి చేశారు. ఇది పిఠాపురంలో ఎవరిని అడిగినా ఇదే చెబుతారు. ఇంత కష్టపడి పవన్‌ కల్యాణ్‌ కోసం పని చేసిన వర్మ మీద కర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే..
పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ గెలుపునకు నేనే దోహదపడ్డాను అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంతకంటే ఏమీ చేయలేం అంటూ పరోక్షంగా వర్మను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇంకా తన స్పీచ్‌ను కొనసాగిస్తూ.. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ గెలుపునకు దోహదపడింది రెండే రెండు అంశాలు. ఒకటి జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. రెండోది పిఠాపురం ప్రజలు, ఓటర్లు. ఈ రెండు కారణాల వల్లే పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో గెలిచారు. అంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి భాగస్వాములైన టీడీపీ, బీజేపీ శ్రేణులతో పాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించేవిగా మారాయి.
తన గెలుపు గురించి పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే..
అంతకు ముందుకు పిఠాపురంలో తాను గెలిచిన సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ఓ వేదిక మీద పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వర్మ చేతిలో చేయి వేసుకొని మాటలు తాజాగా వైరల్‌గా మారాయి. తన గెలుపు వర్మ చేతిలో పెట్టాను. వర్మ ఒక మాస్‌ లీడర్‌. వర్మతో తనకు నచ్చుతుంది. వర్మ ముఖ స్తుతి లేకుండా మాట్లాడుతారు. అలాంటి నాయకుడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడుతారో తనకు తెలుసు. వర్మ కొడుకు జూనియర్‌ వర్మకు కూడా తన ప్రత్యేక కృతజ్ఞతలు. వర్మకు, పిఠాపురం నియోజక వర్గం ప్రజలకు కృతజ్ఞతలు. గెలుపు చిరస్థాయిగా నిలిచిపోయేలా పని చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు అంటూ పవన్‌ కల్యాణ్‌ తన విజయానికి దోహదం చేసిన వారందరి గురించి చెబుతూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ప్రసుత్తం ఈ రెండు వ్యాఖ్యలతో కలిపిన వీడియో క్లిప్పింగ్‌లు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి.
Tags:    

Similar News