తప్పు చేస్తే నా తల్లి దండించేది
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీలో నారా లోకేష్ తన తల్లి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
క్రమశిక్షణ, పట్టుదల నాలో ఉంటే అందుకు కారణం నా తల్లి భువనేశ్వరి అని.. మీ తల్లి మిమ్మల్ని దండించిందో లేదో తెలియదు కానీ, నేను తప్పు చేస్తే నా తల్లి దండించేది.. ఇప్పటికీ చిన్న తప్పు మాట్లాడితే వెంటనే మెసేజ్ చేస్తుందని తన తల్లి భువనేశ్వరి గురించి మంత్రి నారా లోకేష్ చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యాంగ దినోత్సవంను పురస్కరించుకుని బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ సందర్భంగా ఆయన మాట్లాడారు. గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలా ఏడుస్తావా అంటూ మహిళలను కించపరిచే మాటలు ఎవరూ వాడొద్దని స్పష్టం చేశారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ముందుగా ఈ మాక్ అసెంబ్లీని మెయిన్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేయాలని అనుకున్నామని, కానీ రూల్స్ పర్మిట్ చేయవని స్పీకర్ చెప్పడంతో అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ రోజు భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు అని, అందుకే పిల్లలకు అర్థమయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చామని చెప్పారు. రాజ్యాంగం భారతదేశపు ఆత్మ అని, అందుకే మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి మహానుభావుల గురించి ఈ పుస్తకంలో చేర్చామని వివరించారు. పిల్లల సక్సెస్‌లో తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందని, నైతిక విలువలపై చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మాట గొప్పదని అన్నారు. చేసిన పనిని ధైర్యంగా తల్లికి చెప్పగలిగితే అందరూ మంచి పౌరులుగా మారతారని చాగంటి అన్న మాటను గుర్తుచేశారు. ఈ విషయం ముఖ్యమంత్రికి కూడా తాను చెప్పానని తెలిపారు. చాగంటి కోటేశ్వరరావుకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుగా నియమిస్తే ఒక్క రూపాయి కూడా వద్దని, ప్రభుత్వ బాధ్యతను తన డబ్బుతోనే నిర్వహిస్తానని ఆయన చెప్పారని పేర్కొన్నారు.
పిల్లల కోసమే ప్రతి ఒక్కరం కష్టపడుతున్నామని, వన్ క్లాస్ వన్ టీచర్ విధానం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నామని, చాలా వరకు సాధించామని లోకేష్ చెప్పారు. పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు.
పుస్తకాల్లో రాజ్యాంగం ఉంటే చాలదు, అమలులో ఉండాలని, 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు లైవ్‌లో చూస్తున్నారని తెలిపారు. చర్చ వాస్తవాలతో జరగాలి, గొడవలతో కాదని అన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు రాజ్యాంగం కాపీని చేతబట్టి నడిచానని, తన హక్కుల గురించి పోలీసులను అడిగితే తెలియదని, ఎస్పీని అడగమని చెప్పారని గుర్తుచేశారు. చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం తెలియాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా రాష్ట్రాన్ని, దేశాన్ని గర్వపడేలా చేయాలని విద్యార్థులకు లోకేష్ సూచించారు.