పచ్చని కోనసీమకు దిష్టి తగిలింది

45 రోజుల్లో సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

Update: 2025-11-26 13:04 GMT

పచ్చని కోనసీమకు దిష్టి తగిలినట్టు ఉందని, మోడుబారిన కొబ్బరి చెట్లు ఎదిగిన కొడుకుల్లా కనిపిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో అన్నారు. ఎకరం కొబ్బరి తోట రూ.2 లక్షల ఆదాయం ఇస్తుందని, ఆ ఆదాయం రైతుకు శాశ్వతంగా ఉండాలని చెప్పారు. చికిత్స కంటే నివారణ మేలన్న పెద్దల మాటను ఆచరణలో పెడతామని హామీ ఇచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో బుధవారం పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించారు. మోడుబారిన కొబ్బరి చెట్లను చూసి, డ్రెయిన్ ఆక్రమణలు, పూడిక తీత లేకపోవడం, గట్లు కుంగిపోవడం వంటి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పల్లెపండుగ కార్యక్రమంలో 13 గ్రామాల రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి బాధలు ఓపికగా విన్నారు.

కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదని, మన సంప్రదాయంలో కొబ్బరి భాగమైనందున దాన్ని పరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. కొబ్బరి చెట్టుని నమ్ముకున్న వాళ్లు రోడ్డున పడకూడదు, కొబ్బరి రైతు రోడ్డెక్కకూడదని స్పష్టం చేశారు. కోనసీమ కొబ్బరి రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 45 రోజుల్లో సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని, సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్‌తో మళ్లీ వస్తానని హామీ ఇచ్చారు. రెండు వారాల్లో అధికారులు రైతులతో మరో సమావేశం పెట్టి, శంకరగుప్తం డ్రెయిన్ సమస్యపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. డిసెంబర్ రెండో వారంలో మరో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

శంకరగుప్తం డ్రెయిన్ సమస్య 14 ఏళ్లుగా ఉందని, కానీ గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంచి పూడిక కూడా తీయలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డ్రెయిన్ వెడల్పు 50 మీటర్ల నుంచి కొన్ని చోట్ల మూడు మీటర్లకు కుచించుకుపోయిందని, ఆక్రమణలు, అడ్డుకట్టలు వేయడం వల్ల సముద్రపు నీరు పొలాల్లోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మనిషి సృష్టించిన విధ్వంసమని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంత నష్టమన్నారు. నీటిపారుదల శాఖ నిపుణులు బి.సి. రోశయ్య ఇచ్చిన రిపోర్టును అధ్యయనం చేసి, రెండు వారాల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. కోనసీమలో కోకోనట్ బోర్డు ఏర్పాటు, ఓఎన్జీసీ కార్యకలాపాల ప్రభావం వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ వేస్తామని ప్రకటించారు.

మాటలు చెప్పి మభ్యపెట్టేందుకు రాలేదు, కొబ్బరి రైతుకు అండగా ఉండేందుకే వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. లక్ష ఎకరాల్లో సాగవుతున్న కొబ్బరి తోటలపై లక్ష కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వాళ్ల సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పర్యటన సందర్భంగా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ భరోస ఇస్తుందని, ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలన్నది కూడా రాజ్యాంగ హక్కే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీష్, రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News