ఆ'తల్లికి' వందనం

శ్రీకాకుళం జిల్లాలో ఓ మాతృమూర్తి చేసిన పని అందరినీ ఆలోచింపజేస్తోంది.అందరికీ ఆదర్శంగా మారింది.;

Update: 2025-07-15 07:59 GMT
తల్లికివందనం డబ్బులు స్కూల్ కు విరాళంగా వెనక్కు పంపిన తల్లి

తల్లికి వందనం రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు పండగ చేసుకున్న కార్యక్రమం.తమ ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు పడ్డాయ్యా అని అందరూ చెక్ చేసుకుంటూ సంబరం చేసుకుంటున్నారు. ఏ నోట విన్నా, తల్లికి వందనం నాకు పడింది అనే సంబరమే.మరి కొందరిలో తల్లికి వందనం రాలేదు అన్న ఆవేదన.మరి కొందరి నోట మా డబ్బులు వేరొకరికి పడ్డాయన్న ఫిర్యాదులు.

ఇవన్నీ ఒక ఎత్తైతే శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామంలో ఆ తల్లి చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరచడమే కాదు, ఆలోచింపజేస్తోంది.రాష్ట్రంలో ఎక్కడా కనీవినీ ఎరుగని సంఘటన. తనకు పడిన 13వేల రూపాయలకు , మరో 2వేలు కలిపి మొత్తం 15 వేల రూపాయలు ప్రధానోపాధ్యాయుని అకౌంట్ కు డొనేట్ చేస్తూ తిప్పి పంపింది ఓ మాతృమూర్తి.ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం కే.మత్సలేశం అనే గ్రామంలో జరిగింది.శోభారాణి అనే గృహిణి తమ ఇద్దరు పిల్లలను అక్కడి ప్రభుత్వ బడిలో చదివిస్తున్నారు. ఒకరు ఎల్ కేజీ నే గనుక ఒక పిల్లాడికే తల్లికి వందనం 13000 రూపాయలు ఆ తల్లి ఖాతాలో పడింది. ఆమె ఆ సొమ్మును స్కూల్ ప్రధానోపాధ్యాయుడి ఖాతాకే తిరిగి పంపడమే కాకుండా మరో రెండు వేలు కలిపింది. విషయం తెలిసి ఆమెకు ఫోన్ చేసి, అభినందనలు తెలుపుతూ , తిరిగి రిటర్న్ చేయటానికి కారణం అడిగిన వారికి ఆమిచ్చిన సమాధానం పాలకుల్ని, ప్రజలను ఆలోచింపజేస్తోంది. ఆమె మాటల్లోనే.." పిల్లాడి చదువుకు ప్రభుత్వం బట్టలు, పుస్తకాలు, నోట్ బుక్స్ ఇవ్వడమే కాదు వాటితో పాటు భోజనం కూడా పెడుతోంది. మరి ఆ డబ్బుల అవసరం నాకేముంది? ఆ రెండవ పూట నా పిల్లల్ని చూసుకునే బాధ్యత నాదే, నా పిల్లలకు ఉపాధ్యాయులు మంచి చదువు ఇస్తే చాలు. అందుకే ఆ డబ్బు నాకు వద్దు " అని చెప్పింది.2000 రూపాయలు అదనంగా ఇవ్వటానికి కారణం అడిగితే ..'పాఠశాలలో ఖర్చులకు తన వంతుగా' అని చెప్పింది.

 

ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధీర్ కుమార్ మాట్లాడుతూ "ఆ మాతృమూర్తి శోభారాణి తమ పాఠశాలకే వెలుగు నింపింది.తల్లికి వందనం డబ్బులు తిరిగి పంపడం కాదు, పాఠశాల అభివృద్దిని ఆకాంక్షిస్తూ డొనేట్ చేశారు.పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో ఆ పదమూడు వేలతో పాటు రెండు వేలు ఇచ్చారు. ఆ తల్లిదండ్రులు తీసుకున్న ఆ ఎంతో ఉత్తమమైన నిర్ణయం. మిగిలిన పేరెంట్స్ కూ ఆమె ఆదర్శమయ్యారు. మరో పేరెంట్ రమణ మూడు కంప్యూటర్లను బహూకరించారు. మరో పేరెంట్ కూడా ముందుకు వచ్చారు"అన్నారు.తమ పాఠశాల మత్య్సకార గ్రామంలో వుందని ,పాఠశాలలో ఎల్ కేజీ నుంటి వుందని మోడల్ స్కూల్ గా నడుపుతున్నామని హెడ్మాష్టర్ తెలిపారు.ధనవంతులు కాకపోయినా ,మధ్యతరగతి తల్లిదండ్రులు ఇలా అందరికీ ఆదర్శంగా ముందుకు రావడం ఎంతో శుభపరిణామంగా తెలిపారు.ఇలాంటి వారిని ప్రభుత్వం ,విద్యాశాఖ అధికారులు గుర్తించి అభినందించితే ఇదేబాటలో మరికొందరు నడుస్తారని ,ప్రభుత్వ విద్యాలయాలు ఆదర్శంగా మారతాయన్నారు.ఈ వి,యం తెలుసుకున్న ఛైల్డ్ రైట్ సంస్థ ప్రతినిధులు కూడా మాతృమూర్తిని అభినందించి సన్మానించారన్నారు.

 

అదే ప్రాంతానికి చెందిన పొలాకి మండలం అంపలం గ్రామ ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్ఠర్ శ్రీనివాసరావు ఇదే విషయమై మాట్లాడుతూ మధ్యతరగతి గృహిణియైనా శోభారాణి తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలకు ఊతంగా మారిందన్నారు.విషయం తెలిసిన వెంటనే ఫోన్ చేసి అభినందించామని , అలాంటి స్ఫూర్తి కొందరిలో వచ్చినా ప్రభుత్వ బడులకు మహర్ధశ వస్తుందన్నారు. తమ గ్రామం లోని పాఠశాలకు పేరెంట్స్ అండగా నిలుస్తున్నారని పాఠశాల అభివృద్దికి ఎంతో తోడ్పడుతున్నారని తెలిపారు.
ఇలా కొద్దిగా స్తోమత వున్న తల్లిదండ్రులు శోభారాణి లాగా ఆలోచిస్తే .. నిజంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారతాయికదూ.. ఆ తల్లికి నిజంగా వందనం చేయాల్సిందే.
Tags:    

Similar News