ఏమిటీ మూన్ లైటింగ్? ఎందుకు గోస్వామిని అరెస్ట్ చేశారు?
అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి అరెస్టయ్యాడు. ఆయనపై మూన్‌లైటింగ్ (Moonlighting) ఆరోపణ వచ్చింది.
By : The Federal
Update: 2025-10-24 13:13 GMT
అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి అరెస్టయ్యాడు. ఆయనపై మూన్‌లైటింగ్ (Moonlighting) ఆరోపణ వచ్చింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ గోస్వామి తన పర్మినెంట్ ఉద్యోగ సమయం తర్వాత మరో సంస్థలో ఉద్యోగం చేస్తూ పట్టుబడి అరెస్ట్ అయ్యారు.
న్యూయార్క్ వాసి అయిన గోస్వామి (Mehul Goswami) న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్‌లో పనిచేస్తున్నాడు. ఇది ప్రాథమిక ఉద్యోగం. మాల్టాలోని గ్లోబల్ ఫౌండ్రీస్ సెమీకండక్టర్ కంపెనీలో కాంట్రాక్టర్‌గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. 2022 నుంచి అతడు ఇందులో కాంట్రాక్టర్‌గా ఉన్నాడు. ఇ- మెయిల్‌ల ఆధారంగా గోస్వామి మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర నిధుల్లోంచి దాదాపు రూ.44 లక్షలు దొంగతనం కూడా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తించాల్సిన సమయంలోనే.. ప్రైవేటు కంపెనీ కోసం పనిచేస్తుండటంతో అక్టోబరు 15న అధికారులు అతడిని అరెస్టు చేశారు.
‘నిజాయతీగా సేవ చేసేందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగిస్తారు. గోస్వామి దాన్ని ఉల్లంఘించాడు. ప్రభుత్వం కోసం పనిచేస్తున్నానని చెప్పుకుంటూ.. మరో కంపెనీ కోసం పూర్తి సమయం కేటాయించాడు. ఇది పన్ను చెల్లింపుదారుల డబ్బుతో సహా ప్రజా వనరులను దుర్వినియోగం చేయడమే’ అని ఇన్‌స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ పేర్కొన్నారు. ఇటీవల అధికారులు గోస్వామిని కోర్టులో హాజరుపరచగా.. అతడు బెయిల్ లేకుండానే విడుదలయ్యాడు. అయితే, కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇందులో నేరం రుజువైతే అతడికి 15 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది.
ఇక, గోస్వామి అరెస్టు నేపథ్యంలో మూన్‌లైటింగ్ గురించి మరోసారి చర్చ జరుగుతుంది.
అసలేమిటీ మూన్‌లైటింగ్ ?
“మూన్‌లైటింగ్” (Moonlighting) అంటే ఒక వ్యక్తి తన ప్రధాన ఉద్యోగ సమయం (office hours) చేస్తూ మరో ఉద్యోగం చేయడం లేదా
రెండో వేతనానికి మరో కంపెనీకి సేవలు అందించడం అని అర్థం.
వివరంగా చెప్పాలంటే.. ఒక ఉద్యోగి ఒక కంపెనీ లేదా ప్రభుత్వ సంస్థలో పూర్తికాల (full-time) ఉద్యోగిగా పనిచేస్తూ, అదే సమయంలో మరో కంపెనీ నుంచి కూడా జీతం తీసుకుంటూ పని చేస్తే —
దాన్ని మూన్‌లైటింగ్ అంటారు.
ఉదాహరణకు రోజంతా ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ రాత్రి ఒక ప్రైవేట్ కంపెనీ కోసం ఆన్‌లైన్ ప్రాజెక్టులు చేయడమే మూన్‌లైటింగ్.
ఎందుకు వివాదాస్పదం?
మూన్‌లైటింగ్ సాధారణంగా రెండు కారణాల వల్ల వివాదాస్పదమవుతుంది. ప్రధాన ఉద్యోగంపై ప్రభావం, రెండో ఉద్యోగం వల్ల వ్యక్తి తన అసలు పనిపై శ్రద్ధ తగ్గవచ్చు. Conflict of Interest అంటే పరస్పర విరుద్ధ ప్రయోజనం. దీనివల్ల ప్రభుత్వ లేదా సంస్థ గోప్య సమాచారం మరో సంస్థకు వెళ్లే ప్రమాదం ఉంటుంది.
ఎప్పుడు చట్టవిరుద్ధం అవుతుంది?
ఉద్యోగ ఒప్పందంలో (Employment Contract) రెండో ఉద్యోగం చేయరాదని నిబంధన ఉంటే, దాన్ని ఉల్లంఘించడం వల్ల క్రమశిక్షణా చర్యకు లేదా చట్టపరమైన చర్యకు దారితీస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు రెండో వేతనానికి మరో కంపెనీ కోసం పనిచేస్తే అది అక్రమంగా పరిగణించడం అవుతుంది. మూన్‌లైటింగ్ అంటే “తన ప్రధాన ఉద్యోగంతో పాటు మరొక ఉద్యోగం లేదా పని చేయడం.”
చాలా సందర్భాల్లో ఇది నేరం కాకపోయినా, ప్రభుత్వ ఉద్యోగుల్లో లేదా ఒప్పంద ఉల్లంఘన చోటుచేసుకున్నప్పుడు మాత్రం ఇది తీవ్రమైన తప్పు అవుతుంది.