ఎమ్మెల్యే కొలికపూడి మరో సంచలనం
రుణం ఇప్పించాలని అడిగిన ఒక గిరిజన మహిళను లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని తెలుగుదేశం పార్టీ పెద్దలు కాపాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు.;
ఆ ఎమ్మెల్యే వివాదాస్పదుడు. ఇప్పటికే రెండు సార్లు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరైన వ్యక్తి. ప్రస్తుతం మరో వివాదానికి తెరలేచింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ పెద్దలకు అల్టిమేటమ్ (ultimatum) ఇచ్చారు. ఒక గిరిజన మహిళను లైంగికంగా వేధించిన తిరువూరు తెలుగుదేశం పార్టీ నాయకుడిపై తాను ఫిర్యాదు చేసి పది రోజులైనా ఇంతవరకు ఎటువంటి చర్యలు తసుకోకుండా కాపాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నా ఎమ్మెల్యే పదవికి అర్థం లేదు. శుక్రవారం సాయంత్రం లోపు ఆయనపై చర్యలు తీసుకోకుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చివరి హెచ్చరిక చేశారు.
వేధించిన వ్యక్తి ఎవరు?
తిరువూరు ఏఎంసీ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకుడు అలవాల రమేశ్ రెడ్డి ఎ కొండూరుకు చెందిన ఒక గిరిజన మహిళను లైంగికంగా వేధించాడు. గిరిజన మహిళ రుణం ఇప్పించాలని రమేశ్ రెడ్డిని కోరింది. ఆమెతో రమేశ్ రెడ్డి ఫోన్ లో మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఫోన్ సంబాషణ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వద్దకు చేరింది. ఆయన ఆ సంభాషణ అంతా విన్నారు. గిరిజన మహిళకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
పార్టీ పెద్దలకు ఎమ్మెల్యే ఫిర్యాదు
రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు మంతెన సత్యనారాయణ రాజు (కృష్ణా-గుంటూరు జిల్లాల సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు) లకు ఎమ్మెల్యే కొలికపూడి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి పది రోజులైనా ఇంత వరకు ఎటువంటి చర్యలు లేవని, తనకు కనిపిస్తే చెప్పుతో కొడతానని ఆయన అనటం విశేషం.
పట్టించుకోని పార్టీ నేతలు
ఎమ్మెల్యే రమేశ్ రెడ్డిపై ఫిర్యాదు చేసి పది రోజులైనా పట్టించుకోలేదు. గిరిజన మహిళలు గురువారం తిరువూరులోని ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో ఆయన గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రమేశ్ రెడ్డి ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదన్నారు. ఆయన ప్రస్తుతం విజయవాడ ఎంపీ చిన్ని కార్యాలయంలో ఉన్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నాడని, చిన్నీకి కూడా విషయం తెలిపానన్నారు. పార్టీ పెద్దలు రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే తాను శుక్రవారం సాయంత్రం లోపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.
సంచలనం
అధికార పార్టీ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇవ్వటం సంచలమైంది. గతంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఆయనకు వ్యతిరేక వర్గం ఏర్పాటైంది. నోటి దురుసు ఉన్న వ్యక్తిగా కొలికపూడి పేరు తెచ్చుకున్నారు. గిరిజన మహిళలకు తాను అండగా ఉన్నానని, ఒక గిరిజన మహిళలను లైంగికంగా వేధించిన వ్యక్తిని కాపాడుతోందని ఆరోపించడం చర్చకు దారి తీసింది.
తనపై కక్షతోనే...
రమేశ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తనపై కక్షతోనే ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తున్నారని, తాను ఎవ్వరినీ వేధించలేదని, గిరిజన మహిళతో కావాలని ఈ విధంగా చెప్పించారని, తన వాయిస్ తో రికార్డు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.