మెగాసిటీ జాబితాలోకి తిరుపతి
మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-08-25 15:49 GMT
రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు.
"తిరుపతిని మెగాసిటీగా మార్చే దిశగా అభివృద్ధి పనులు చేస్తున్నాం" అని మంత్రి నారాయణ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీం ద్వారా అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (Tirupati urban development authority TUDA) కార్యాలయంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. తిరుపతి నగరపాలక సంస్థ, తుడా అధికారులతో అభివృద్ధి పనులు, ప్రజలకు కల్పించాల్సిన సదుపాయాలపై సూచనలు చేశారు.
ఆదాయం పెంచండి
"నగరాల పరిధిలో టౌన్షిప్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవాలి" అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నెల్లూరు తరహాలో తిరుపతిలో కూడా రోడ్ల శుభ్రతకు స్వీపింగ్ మిషన్ లను వినియోగించాలని మంత్రి నారాయణ సూచన చేశారు. ఈ సమావేశంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తుడా టవర్స్ , ప్లాట్స్ , దుకాణాల పై వచ్చే అదాయ, వ్యయాలపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నగరపాలక సంస్థ లో పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, కార్మికులకు కల్పించాల్సిన వసతులపై కమిషనర్ ఎన్.మౌర్య వివరించారు. రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తుడా సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు కృష్ణా రెడ్డి, శ్యాంసుందర్ పాల్గొన్నారు.
గత పాపాలు కడుగుతున్నాం..
రాష్ట్రంలో పాలనతో పాటు మున్సిపల్ వ్యవహారాలను కూడా గత వైసిపి ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని మంత్రి పొంగూరు నారాయణ వ్యాఖ్యానించారు.
"వైసిపి అధికారం కోల్పోతూ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, 85 లక్షల టన్నుల చెత్త మిగిల్చారు" అని మంత్రి నారాయణ అన్నారు. టిడిపి కూటమి ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే 73 లక్షల టన్నుల చెత్తను తొలగించడం ద్వారా ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు.
"నిధులు లేకపోయినా సరే అన్ని పథకాలను పూర్తిస్థాయిలో టిడిపి కూటమి అమలు చేస్తోంది" అని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలోనే 120 మున్సిపాలిటీలలో ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు.
అరాచకపాలనతో పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేసినందు వల్ల రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడిందని మంత్రి నారాయణ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అండ్ చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిశ్రమలను తీసుకురావడం ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచామని ఆయన చెప్పారు. తద్వారా ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని కూడా మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
టిడిఆర్ బాండ్లపై దృష్టి
అభివృద్ధి కార్యక్రమాలకు కోసం భూసేకరణ చేయడంలో వైసిపి చేసిన తప్పిదాలు అన్ని ఇన్నీ కావని మంత్రి నారాయణ అన్నారు. అందులో భాగంగా విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి నగరంలో పెండింగ్ లో ఉన్న టి డి ఆర్ బాండ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి సమస్యలను పరిష్కరించడానికి శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. భవిష్యత్తులో కూడా నగరాల్లో నిబంధనల మేరకే భవన నిర్మాణాలు చేపట్టడానికి శ్రద్ధ తీసుకోవాలని ఆయన నివాసితులను కోరారు. నిబంధనను అమలు చేయడంలో అధికారులు కూడా నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అవసరాన్ని మంత్రి నారాయణ గుర్తు చేశారు