Ratha Saptami in Tirumala | తిరుమలలో మినీబ్రహ్మోత్సవ సంబురం

తిరుపతిలో తొక్కిసలాట ఘటన టీటీడీకి పాఠం నేర్పింది. దీంతో మినీ బ్రహ్మోత్సవంగా భావించే ఫిబ్రవరి 4న రథసప్తమిలో అపశృతులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-27 04:42 GMT

తిరుమలలో వైకుంఠ ద్వారదర్శనం టీటీడీకి ఓ పాఠం నేర్పింది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించారు. రద్దీ నియంత్రణలో పటిష్ట యంత్రాంగం కలిగిన ధార్మిక సంస్థలో ఆ విషాధం ఓ మాయని మచ్చగా మారింది. ఈ తరహా సంఘటనకు ఆస్కారం లేకుండా టీటీడీ అధికారులు, ప్రధానంగా పాలక మండలి శ్రద్ధ తీసుకుంటోంది.

ఏటా శుక్లపక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విశిష్ట రోజును తిరుమలలోనే కాదు. శ్రీవైష్ణవ క్షేత్రాల్లో మినీ బ్రహ్మెత్సవంగా నిర్వహిస్తారు. అంటే సూర్య జయంతి సందర్భంగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవేంకటేశ్వరస్వామివారు ఒకో రోజు ఏడు వాహనాల్లో తిరుమల మాడవీధుల్లో ఊరేగుతూ, భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
మినీ బ్రహ్మోత్సవం
సాధారణంగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో మాత్రమే ఉదయం, రాత్రి శ్రీవారి పల్లకీసేవ ఉంటుంది. రథసప్తమి రోజు మాత్రమే తిరుమలలోనే కాకుండా అనుబంధ ఆలయాలు, దేశంలోని శ్రీవైష్ణవాలయాల్లో ఉదయం సూర్యోప్రభ వాహనం నుంచి ప్రారంభమయ్యే పల్లకీ సేవలు సాయంత్రం వరకు రెండు గంటల వ్యవధిలో శ్రీవారు ఏడు వాహనసేవలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వాహనసేవలతో పాటు మధ్యలో రథోత్సవం, బంగారురథంపై విహారం, చక్రతాళ్వార్లకు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయించడం వంటి ఘట్టాలు కూడా నిర్వహిస్తారు. దీంతో రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవంగానే పరిగణిస్తారు. ఇదెలా ఉంటే..
౩1 న బోర్డు అత్యవసర సమావేశం
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీటీడీ పాలక మండలి మరింత అప్రమత్తమైంది. రథసప్తమిరోజు తిరుమల మాడవీధుల్లో పటిష్ట ఏర్పాట్లు చేయనున్నారు. దీనికోసం అనుసరించాల్సిన పద్ధతులు, కార్యక్రమాలపై సమీక్షించడానికి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలో పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా..
"భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు. సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేయనున్నారు" దీనికోసం బోర్డు మీటింగ్లో చర్చించనున్నారు. అంతేకాకుండా,
"అధికారుల మధ్య సమన్వయం కుదర్చడం ద్వారా బాధ్యతల వికేంద్రీకరణ, రద్దీ నియంత్రిణకు తీసుకోవాల్సిన చర్యలు. భద్రతా ఏర్పాట్లపై కూడా చర్చించనున్నారు" అని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
గ్యాలరీల్లో ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవమూర్తుల దర్శనానికి ఎలా వస్తారో.. రథసప్తమి రోజు కూడా యాత్రికుల సంఖ్య అంత ఎక్కువగా ఉంటుంది. ఒకే రోజు అన్ని వాహనాలపై శ్రీవారి పల్లకీ సేవను చూడడానికి భారీగా తరలిస్తారు. దీంతో తిరుమల మాడవీధుల్లో గ్యాలరీల్లో భద్రత, ఏర్పాట్లు, ఎనిమిది గేట్ల వద్ద తొక్కిసలాటకు ప్రధానంగా చక్రస్నానం, రథోత్సవం సందర్భంగా తోపులాటకు ఆస్కారం లేకుండా టీటీడీ దృష్టి సారించింది. శ్రీవారి సేవకుల తోపాలు టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్ సిబ్బందికి బాధ్యతలు వికేంద్రీకరణపై టీటీడీ బోర్డు అత్యవసర సమావేశంలో చర్చించనున్నారు.
ఆర్జిత సేవల రద్దు
రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి నాల్గవ తేదీ ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ప్రివిలేజ్ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో ఫిబ్రవరి మూడో తేదీ సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ స్పష్టం చేసింది. అయితే, మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు (ఎస్ఎస్డీ - SSD) కూడా రద్దు చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. సామాన్య యాత్రికులు యథావిధిగానే సర్వదర్శనానికి అనుమతిస్తామని ప్రకటించింది.
ఫిబ్రవరి 4న తిరుమలలో
రథసప్తమి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై మలయప్పస్వామి వారు ఊరేగుతూ, భక్తులను దర్శనం ఇవ్వనున్నారు.
వాహన సేవలు: ఉదయం 5.30 - 8 గంటల వరకు (సూర్యోదయం 6.44 AM) - సూర్య ప్రభ వాహనం
9 - 10 గంటల వరకు - చిన్న శేష వాహనం
11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు - గరుడవాహనం
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు - హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు - చక్రస్నానం
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు - చంద్రప్రభ వాహనం
ముందస్తు సమీక్ష
తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య భవన్‌లో రెండు రోజుల కిందట ఆయన అదనపు ఈఓ సిహెచ్. వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు.
"భక్తులు గ్యాలరీల్లో ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. గ్యాలరీల్లో భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయండి" అని ఈఓ ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. నాలుగు మాడ వీధుల్లో ఏర్పాట్లను కూడా టిటిడి ఈఓ శ్యామలరావు పరిశీలించారు.
Tags:    

Similar News