AlluArjun and MohanBabu|మంచును వదిలేసి పుష్ప వెంటపడిన మీడియా

నాలుగురోజులుగా మోహన్ బాబు వెంటపడిన మీడియా మొత్తం ఒక్కసారిగా అల్లు అర్జున్ వెంటపడింది.

Update: 2024-12-13 12:01 GMT

మీడియా తీరే ఇలాగుంటుంది. మీడియాకు ఎప్పుడూ సెన్షేషన్ కావాలి. ప్రతిరోజు ఏదో ఒక సంచలనం ఉండాలి, జనాలదృష్టి ఎప్పుడూ తనమీదే ఉండాలని మీడియా కోరుకుంటుంది. ఆ సంచలనం రాజకీయాలు కావచ్చు సినిమాలు ఏదైనా పర్వాలేదు. జనాల్లో బాగా పాపులారిటి ఉన్న ప్రముఖులు ఏ రంగమైనా సరే మసాలా లాంటి వార్తయితే చాలు మిగిలిన వ్యవహారాలన్నింటినీ మీడియానే చూసుకుంటుంది. మీడియా వ్యవహారం ఎప్పుడూ పెద్దగీత..చిన్నగీత లాగుంటుంది. దీనికి సజీవ ఉదాహరణ ఏమిటంటే మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu), అల్లు అర్జున్(Allu Arjun) ఉదంతమే.

నాలుగురోజుల పాటు మోహన్ బాబు, కొడుకు మనోజ్(Manchu Manoj), విష్ణు(Manchu Vishnu)ల గొడవలతో అట్టుడికిపోయింది. సమాజంలో వేరే సమస్యలు ఏమీ లేనట్లు మీడియా అటెన్షన్ మొత్తం మంచు ఫ్యామిలీ గొడవలమీదే ఉంది. తర్వాత మంచుఫ్యామిలీ గొడవలు సద్దుమణిగే సూచనలు కనబడ్డాయి. ఇంతలో ఒక జర్నలిస్టును మోహన్ బాబు కొట్టిన ఘటన బాగా సంచలనమైపోయింది. దాంతో మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదైంది. వెంటనే పెదరాయుడు ఆసుపత్రిలో చేరిపోయారు. హత్యాయత్నం కేసులో తనను అరెస్టుచేయకుండా ముందస్తుబెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ కేసు హైకోర్టులో విచారణకు రాకముందే శుక్రవారం ఉదయం అల్లుఅర్జున్ అరెస్టు జరిగింది. ఇంకేముంది నాలుగురోజులుగా మోహన్ బాబు వెంటపడిన మీడియా మొత్తం ఒక్కసారిగా అల్లు అర్జున్ వెంటపడింది. ఉదయం నుండి సాయంత్రం 5.30 గంటలవరకు మీడియాలో వార్తలు మొత్తం అల్లు అర్జున మీదనే కేంద్రీకృతమైంది.

ఇంట్లో అల్లు అర్జున్ను అరెస్టుచేయటం, తర్వాత చిక్కడపల్లి పోలీసుస్టేషన్ కు తరలించటం, వైద్యపరీక్షల నిమ్మితం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళటం, తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం, 14 రోజుల రిమాండు విధించటంతో చంచల్ గూడ్ జైలు వరకు మీడియా మొత్తం హడావుడితో సరిపోయింది. నిమిష నిమిషం కాదు క్షణ క్షణం అంటు ఎలక్ట్రానిక్ మీడియా(Electronic Media) ఒకదానితో మరోటి పోటీపడి వార్తలు మొత్తం అల్లు అర్జున్ ఎపిసోడ్ తోనే నింపేసింది. విచిత్రం ఏమిటంటే సాయంత్రం మోహన్ బాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ను హైకోర్టు కొట్టేసినా మీడియాకు అది పెద్ద వార్తగా పట్టలేదు. ఎందుకంటే మోహన్ బాబుకు మించిన మసాలా వార్త అల్లు అర్జున్ రూపంలో దొరికింది కాబట్టే. అల్లు అర్జున్ అరెస్టు, రిమాండ్ వార్త దేశంలోనే సంచలనమైపోయింది. పుష్ప-2(Pushpa) సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అవ్వటం, పెద్ద హిట్ అవ్వటంతో అల్లు అర్జున్ క్రేజ్ దేశంలో మారుమోగిపోయింది. ఆల్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ కారణంగా తన అరెస్టు కూడా అంతే స్ధాయిలో సంచలనమైపోయింది. ఇలాంటి సమయంలో ఇక మోహన్ బాబును మీడియా ఎందుకు పట్టించుకుంటుంది ? నాలుగు రోజులు అల్లుఅర్జున్ వార్తలతోనే మీడియా ఊగిపోతుంది మరో సంచలనం దొరికేంతవరకు.

Tags:    

Similar News