అనారోగ్యం పేరుతో అమెరికా వెళ్తారేమో
తాము అధికారంలోకి వస్తే కొడాలి నాని జైలుకెళ్లడం ఖాయమని యువగళం పాదయాత్రలో లోకేష్ మాట్లాడారు.;
By : The Federal
Update: 2025-05-23 06:08 GMT
మాజీ మంత్రి కొడాలి నానిని అరెస్టు చేసే దిశగా కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులేస్తోంది. కొడాలి నాని ప్రాణ స్నేహితుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి విజయవాడ జైల్లో పెట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొడాలి నానిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక అరెస్టే తరువాయి అనే టాక్ వినిపిస్తోంది.
అందులో భాగంగా కొడాలి నానిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. అనారోగ్యం పేరుతో అమెరికా వెళ్లిపోయేందుకు కొడాలి నాని అన్ని సిద్ధం చేసుకున్నారనే కారణంతో ఆయనపై కూటమి ప్రభుత్వం లుక్‌అవుట్ నోటీసులను జారీ చేసింది. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ కొడాలి నానిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. కొడాలి నాని మీద కూటమి ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ చేపట్టింది. విజిలెన్స్ అధికారులు నానికి సంబంధించిన వ్యవహారాలను తవ్వుతున్నారు. వీలైనంత త్వరలో ఆరోపణలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా అనారోగ్యం పేరుతో అమెరికా వెళ్లేందుకు ట్రై చేస్తున్నారని, ఈ క్రమంలో కొడాలి నాని కదలికలపై ప్రత్యేకమైన నిఘా ఉంచాలని కోరుతూ లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
కొడాలి నాని విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుతం ఆయనపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, దీనిని తప్పించుకునేందుకు కొడాలి నాని విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారని, విచారణ జరుగుతున్న క్రమంలో విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా పోలీసులను కోరింది. కొడాలి నాని పాస్ పోర్టును స్వాధీనం చేసుకోవాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే రవాణా మార్గాలైన ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు, ఇతర సరిహద్దు పాయింట్ల చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కొడాలి నానిపై నింతరం నిఘా ఉంచుతూ.. ఆయన ఎక్కడకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో కొడాలి నాని ఒకరు. ఇది వరకు జగనే ఆ మాట చెప్పారు. తనకు ప్రాణమిత్రుల్లో కొడాలి నాని కూడా ఒకరని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తీరు, సీఎం చంద్రబాబు పాలన, చేస్తున్న అప్పులు, నమోదు చేస్తున్న కేసులు, స్కామ్‌లు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వంటి పలు అంశాలపై గురువారమే వైఎస్ జగన్ మాట్లాడారు. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే కొడాలి నాని అంశం తెరపైకి రావడం గమనార్హం. మరో వైపు తాము అధికారంలోకి వస్తే..గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని అరెస్టు చేసి జైల్లో వేస్తామని లోకేష్ తన యువగళం పాదయాత్రలో వెల్లడించారు. ఆ మేరకు ఇప్పటికే వంశీని జైల్లో వేశారు. ఇప్పుడు కొడాలి నాని వంతు వచ్చింది. త్వరలో నాని కూడా అరెస్టు చేస్తారనే టాక్ వినిపిస్తోంది.