బలవంతపు భూసేకరణకు వ్యతికేరంగా భారీ ఉద్యమం

శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకు పాదయాత్ర చేయనున్నట్లు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.

Update: 2025-10-04 12:43 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూ సమీకరణలకు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక పోరాటానికి సిద్ధమవుతోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 8న ఉద్ధానం నుంచి ప్రారంభించనున్న పాదయాత్ర అక్టోబర్‌ 28న విజయవాడలో గొప్ప సభతో ముగుస్తుంది. రోజురోజుకీ ఏపీ రైతాంగం భూమి ప్రశ్నలతో ఆందోళనలో మునిగిపోతోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.

ఏపీలో జరుగుతున్న భూదోపిడీపై ప్రజల్లో చైతన్యం రప్పించేందుకు ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు నేతలు ప్రకటించారు. ఈ పోరాటం ద్వారా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగనున్నారు. ‘తమ భూమి ఉంటుందో, ఊడుతుందోనని రైతులు రోజూ ఆందోళన చెందుతున్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కొత్త జమీందారులను సృష్టిస్తోంది. లక్షలాది ఎకరాల భూములను నయా జమీందారులకు కట్టబెడుతున్నారు‘ అంటూ శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు.
విజయవాడలోని ఎంతో విలువైన ఆర్టీసీ స్థలం లూలు కాంప్లెక్సుకు 99 సంవత్సరాల లీజుకు ఇవ్వడం వెనుక రహస్యాలు దాగున్నాయని ఆయన నిలదీశారు. ‘రూ. 600 కోట్ల విలువైన భూమిని ఇలా అప్పగించడం వెనుక చిదంబర రహస్యం ఏమిటి? లూలు మీద నీకు ఎందుకంత ప్రేమ చంద్రబాబు? వందల కోట్ల ఖరీదైన భూములు ఎలా కట్టబెడతారు?‘ అంటూ శోభనాద్రీశ్వరరావు ప్రశ్నలు గుప్పించారు.
పాదయాత్ర వివరాలు చెప్పిన మహాదేవ్‌ మాట్లాడుతూ, ‘అక్టోబర్‌ 8న శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలోని వెన్నెలవలస, మందస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ప్రతి చోటా హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌కు ప్రజల ద్వారా పిటిషన్లు పంపిస్తాము. చివరిగా విజయవాడలో 28న బహిరంగ సభ నిర్వహిస్తాము. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక ఇస్తాము‘ అని పేర్కొన్నారు. ఈ పోరాటం రైతుల భూముల రక్షణకు మైలురాయిగా మారనుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల భూములను కాపాడుకోవడం కోసం చేపడుతున్న ఈ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి మద్దతు లభిస్తుంది, ఈ ఉద్యమానికి ప్రజల స్పందన ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News