గ్రానైట్ క్వారీలో భారీ పేలుడు–ముగ్గురు కార్మికులు మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం జరిగింది. ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.;
శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా మెలియాపట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు మరణించారు. స్థానికంగా ఈ దుర్ఘటన కలకలం రేపింది. మరణించిన కార్మికులను తెర్లంగి రామారావు, బడబంద అప్పన్న, తమిళనాడుకు చెందిన వంగ వేణు ఆర్మగంగా గుర్తించారు. మరణించిన కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. దీంతో బాధిత కుటుంబాలకు చెందిన సభ్యులు ఈ దుర్ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరో వైపు యాజమాన్వం మాత్రం రెండు కారణాలు చెబుతోంది. క్వారీలో భారీ పేలుడు సంభవించిందని, దీంతో పాటుగా పిడుగు పడినట్లు వీఆర్టీ గ్రానైట్ క్వారీ యాజమాన్యం తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఇది సాధారణ ప్రమాదం కాదని, భారీ పేలుడు కారణంగానే కార్మికులు అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల మరణాలకు, ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ దుర్ఘటనపై మరణించిన వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి వెళ్లి విచారణను మొదలు పెట్టారు. కార్మికుల మరణించిన తీరు, మృతదేహాలు ఛిద్రమై పడి ఉన్న తీరుపైన కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో ఈ కేసు మీద ప్రత్యేక దృష్టి సారించి పోలీసులు దర్యాప్తులో కూడా వేగం పెంచారు. ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు మీద ఆసక్తి నెలకొంది.
మరో వైపు కుటుంబ సభ్యులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో క్వారీ యాజమాన్యాం వారిని సముదాయించే ప్రయత్నాలు ప్రారంభించింది. కార్మికుల కుటుంబాలు ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, వారికి అండగా ఉంటామని వీఆర్టీ గ్రానైట్ క్వారీ యాజమాన్యం బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ ప్రమాదం చోటుచేకోవడంతో క్వారీలో కార్మికుల భద్రత చర్యలు కూడా చర్చనీయాంశంగా మారింది. యాజమాన్యం ఎలాంటి భద్రత చర్యలు తీసుకున్నారనే దానిపైన చర్చించుకుంటున్నారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరక్కుండా, కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నాయో అనే దానిపైన కూడా తనిఖీలు నిర్వహించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.