ఆంధ్రా తీరానికి హార్బర్ మాల...
తీరంలో ప్రతి 50 కి.మీ కు ఒక హార్బర్
ఆంధ్రప్రదేశ్‌లోని 1,053 కి.మీ. పొడవైన సముద్ర తీరాన్ని ఆధారంగా చేసుకుని పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీని ఫలితంగా రాష్ట్ర తీరప్రాంతంలో ఆర్థిక పునాదులు బలోపేతం అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ సందర్భంగా శాసనసభలో మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఒక సారి పరిశీలిద్దాం.
తీరం పొడవు, పోర్టు, హార్బర్ ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్ తీరం పొడవు 1,053 కి.మీ. ఉంది. ఇది దేశంలో రెండో అత్యధిక పొడవైన తీరం. దీనిని ఆధారంగా చేసుకుని ప్రతి 50 కి.మీ కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తారు. ఈలెక్కన సుమారు 21 చోట్ల ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు పోర్టులు (విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, నిజాంపట్నం మొదలైనవి) ఆపరేషన్‌లో ఉన్నాయి. మరో నాలుగు (మచిలీపట్నం, రామయపట్నం, ములపేట, కాకినాడ్ గేట్‌వే) నిర్మాణంలో ఉన్నాయి. 2047 నాటికి అన్ని పోర్టులను పూర్తి చేసి, తీరప్రాంతాన్ని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా మల్చాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ ప్రణాళిక ద్వారా రాష్ట్రం ఈస్ట్ కోస్ట్ మెగా లాజిస్టిక్స్ గేట్‌వేగా ఎదుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర లా పొరుగు రాష్ట్రాల కార్గో కూడా ఆకర్షిస్తూ, ఆర్థిక వృద్ధికి మొగ్గు చూపుతుంది. ఇది మాత్రమే కాకుండా ఫార్మా, ఆక్వా, అగ్రి ప్రొడక్ట్స్ ఎగుమతుల్లో రాష్ట్రానికి ఆధిక్యతను మరింత పెంచుతుంది.
ఫిషింగ్ హార్బర్లు ఫేజ్-1, ఫేజ్-2
ఫిషింగ్ హార్బర్లు ఈ ప్లాన్‌లో కీలకం. కేంద్ర ప్రభుత్వం ప్రతి హార్బర్‌కు రూ.361 కోట్లు కేటాయించినప్పటికీ, స్థానిక పరిస్థితులను బట్టి ఖర్చు తగ్గించి పనులు చేపట్టారు. ఫేజ్-1లో జువ్వలదిన్నె (97%), నిజాంపట్నం (81%), మచిలీపట్నం (70%), ఉప్పాడ (83%)లో పనులు సాగుతున్నాయి. డిసెంబర్ 2026 నాటికి ఈ నాలుగు హార్బర్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఫేజ్-2లో ప్రస్తుతం ఆరు హార్బర్లు (బుడగట్లపాలెం, పుదిమడక, బియ్యపుటిప్ప, కొత్తపట్నం, ఓడరేవు వంటివి) నిర్మాణంలో ఉన్నాయి. బుడగట్లపాలెంలో రూ.186 కోట్లతో డీపీఆర్ పూర్తి అయింది. త్వరలో టెండర్లు పిలుస్తారు. మొత్తంగా ఈ ప్రాజెక్టులకు రూ.1,500 కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. ఇవి పూర్తయితే మత్స్యకారులకు భద్రత, ఆదాయం పెరిగి, తీరప్రాంత ఆర్థిక డైనమిక్‌ను మార్చేస్తాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
షిప్ బిల్డింగ్, షిప్ బ్రేకింగ్
కేంద్ర మారిటైమ్ బోర్డు పరిశీలనలో షిప్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రతిపాదన ఉంది. దుగరాజపట్నంలో రూ.29,253 కోట్లతో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 2,000 ఎకరాల్లో నాలుగు డ్రై డాక్‌లు, ఔట్‌ఫిట్టింగ్ జెట్టీలు, షిప్-లిఫ్ట్ సౌకర్యాలు ఏర్పాటవుతాయి. మొత్తం పెట్టుబడులు రూ.26,000 కోట్లకు చేరతాయని, 5,000 డైరెక్ట్ ఉద్యోగాలు, 30,000 ఇన్‌డైరెక్ట్ ఉద్యోగాలు ఏర్పడతాయని ప్రభుత్వం శాసన సభలో చెప్పింది.
విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌తో పాటు, దుగరాజపట్నం, కొత్తపట్నం వంటి ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటుకు సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. షిప్‌బ్రేకింగ్ యూనిట్లకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తున్నారు. బడ్జెట్-2025లో రూ.25,000 కోట్ల మారిటైమ్ ఫండ్, రూ.18,090 కోట్ల షిప్‌బిల్డింగ్ అసిస్టెన్స్ పాలసీ ఈ దిశగా సహాయపడతాయి.
తీరప్రాంతానికి మలుపు
ఈ చర్యలు తీరప్రాంతంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచుతాయి. మత్స్య ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లకుండా స్థానికంగా ఆదాయం పొందగలుగుతారు. షిప్‌బిల్డింగ్ క్లస్టర్లు గ్లోబల్ ప్లేయర్లను (హ్యుండాయ్, కొరియన్ షిప్‌బిల్డర్లు) ఆకర్షిస్తూ, రూ.75,000 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తాయి. 2030 నాటికి భారతదేశం గ్లోబల్ షిప్‌బిల్డింగ్‌లో 5 శాతం వాటా, 2047 నాటికి 69 శాతం భారతీయ షిప్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారు.
శాసనసభలో ఎమ్మెల్యేలు నడికుదిటి ఈశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొణతాల రామకృష్ణల ప్రశ్నలకు సమాధానంగా మంత్రి జనార్థన్ రెడ్డి సమాధాన మిచ్చారు. ఈ అంశాల్లో సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రణాళికలు స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు సరిపోతాయి. లాభదాయకతను బట్టి ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేస్తూ, తీరప్రాంతాన్ని ఆర్థిక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.