కడివెండి వారసత్వాన్ని నిలిపి నేలకొరిగిన రేణుక ఎవరు?

విప్లవం విందు భోజనం కాదని తెలిసినా పోరుబాటనే ముద్దాడింది. పేదల కోసమే ప్రాణాన్ని పణంగా పెట్టింది. తాను చదివిన చదువుకు ఎక్కడైనా గ్రేడ్ వన్ ఆఫీసర్ కాగలరు. కానీ..;

Update: 2025-04-01 06:36 GMT
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు రేణుక
విప్లవం విందు భోజనం కాదని తెలిసినా పోరుబాటనే ముద్దాడింది. పేద ప్రజల కోసమే ప్రాణాన్ని పణంగా పెట్టింది. విద్యావంతురాలు, తన చదివిన చదువుకు ఎక్కడైనా గ్రేడ్ వన్ ఆఫీసర్ కాగలరు. మిగతా అందరిలాగా ఆమె కూడా హాయిగా జీవితాన్ని నెట్టుకురాగలరు. కానీ ఆమె ఆ బాటకు బదులు అత్యంత కఠినమైన జీవితాన్ని ఎంచుకున్నారు.

55 ఏళ్ల వయసులో పోలీసుల తుపాకీ గుళ్లకు నేలకొరిగారు. ఆమే రేణుక ఎలియాస్ సరస్వతి ఎలియాస్ చైతు. తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అడుగులు వేసిన కడివెండి ఆమె స్వగ్రామం. తొలి వీరుడు దొడ్డి కొమురయ్య చిందించిన నెత్తుటి చాళ్ల నుంచి ప్రభవించిన వారిలో ఒకరు. తెలుగు నేలన అనేక ప్రాంతాల్లో మహిళా ఉద్యమ నిర్మాణంలో పని చేశారు. విప్లవోద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా పని చేస్తూ అక్కడే కన్నుమూసింది. దండకారణ్యంలో ఒకవైపు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ తన రచనల ద్వారా అమరవీరుల త్యాగాలను కీర్తిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉన్నత చదువులు చదివిన ఒక విద్యావంతురాలు. అటువంటి మరణం పట్ల విప్లవ సానుభూతిపరులు,మేధావులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.
ఇంతకీ ఆమె ఎవరు?
రేణుక (మిడ్కో) 1970 అక్టోబర్ 14న జన్మించారని ఆమె సోదరుడు, బీబీసీ జర్నలిస్టు ప్రసాద్ ఉసెండి చెబుతున్నారు. రేణుక తండ్రి సోమయ్య ఓ ఉపాధ్యాయుడు. పదవి విరమణ చేశారు. ఆమెకు ఇద్దరు సోదరులు. ఒక సోదరుడు గుమ్మడివెల్లి రాజశేఖర్ న్యాయవాదిగా పనిచేస్తూ, ఒక స్వచ్ఛంద సంస్థకు లీగల్ అడ్వైజర్ గా కొనసాగుతున్నారు. మరో సోదరుడు గుమ్మడవెల్లి వెంకట కిషన్ ప్రసాద్ ఎలియాస్ పూసండి. ప్రస్తుతం ఢిల్లీలో బిబిసి(తెలుగు)లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన కూడా మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించారని చెబుతారు. కడివెండి.. రజాకార్లకు గుండెల్లో వణుకు పుట్టించిన గ్రామం. రేణుక మరణంతో కడివెండి గ్రామం లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కడివెండి గ్రామం నుంచి వెళ్లిపోయి రేణుక తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాదులోని నాగారంలో ఉంటున్నారు. రేణుక మృతదేహాన్ని తీసుకురావడానికి వాళ్లు కుటుంబ సభ్యులతో కలిసి ఛత్తీస్‌ఘడ్ వెళ్తున్నట్టు తెలిసింది. వీళ్ళ కుటుంబం ఆదర్శ బావాలున్న కుటుంబంగా పేరుంది. వీరి మేనమామ రవి సైతం అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది.
తిరుపతిలో లా కోర్సు చేశారు. 1998-99 ప్రాంతంలో తిరుపతిలో క్రియాశీల కార్యకర్తగా పని చేశారు. నాటి పీపుల్స్ వార్ గ్రూప్ ఏపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి (మహేష్ అన్న)తో జీవితం పంచుకున్నారు. తమ విప్లవోద్యమానికి పిల్లలు ఆటంకం కాకూడదనే భావనతో పెళ్లికి ముందే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని ఉద్యమంలోకి ఉరికారు. 2000-2001 ప్రాంతంలో విశాఖ పట్నం వెళ్లి అక్కడి మహిళారంగంలో పనిచేశారు. తర్వాత ఏపీ, తెలంగాణలో పార్టీ నిర్మాణం కోసం వెనక్కి వచ్చారు. దండకారణ్యం వెళ్లి అక్కడే చివరి వరకు కొనసాగారు. అప్పట్లో ఆమెను మిడ్కో లేక రేణుకగా పిలిచేవారు. మిడ్కో పేరుతో కథలు రాశారు. అరుణ తారలో ఆమె కథలు చాలా ప్రచురితమయ్యాయి. 35 సంవత్సరాలకు పైగా నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ఉన్నారు.
ఆమె ప్రభాత్ పత్రిక కు ఎడిటర్ గా పని చేశారు. ఆమెకు దమయంతి అనే మరో పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ రీజినల్ బ్యూరో (CRB) ప్రెస్ టీం ఇన్‌చార్జ్. ఆమె తలపై రూ.45 లక్షలు రివార్డ్ (ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ. 20 లక్షలు) ఉంది.
దంతెవాడ, బీజాపూర్ సరిహద్దు ప్రాంతాలలోని నెల్గోడ, ఇకెలి, బెల్నార్ గ్రామాల మధ్య ఉన్న అటవీ కొండలలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. 01 INSAS రైఫిల్‌తో పాటు పేలుడు పదార్థాలు, ల్యాప్‌టాప్, నక్సల్ సాహిత్యం, ఇతర రోజువారీ వినియోగ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
1996లో నక్సల్స్ లో చేరిక...
1996లో నక్సల్ సంస్థలో చేరి ఆంధ్రప్రదేశ్‌లోని SZCM కృష్ణన్నతో కలిసి పనిచేసింది. 2003లో DVCM పదవికి పదోన్నతి పొందారు. 2006లో సౌత్ బస్తర్‌లో CCM దుల్లా దాదా అలియాస్ ఆనంద్‌తో కలిసి పనిచేశారు. 2013లో మాడ్ ప్రాంతానికి వచ్చి SZCM రామన్నతో కలిసి పనిచేశారు. 2020లో కరోనా కారణంగా రామన్న మరణించిన తర్వాత, DKSZCM సెంట్రల్ రీజినల్ బ్యూరో (CRB) ప్రెస్ టీం ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. నక్సల్ సంస్థ తరపున పత్రికా ప్రకటనలను జారీ చేసేది. ప్రభాత్, మహిళా మార్గం, అవామి జంగ్, పీపుల్స్ మార్చ్, పోడియారో పోల్లో, ఝంకార్, సంఘర్ష్టర్ మహిళా, పితురి, మిడంగూర్, భూమ్కల్ సందేశ్ వంటి వివిధ పత్రికలను ముద్రించి ప్రచురించేది. ఆమె సోదరుడు SZCM GVK ప్రసాద్ అలియాస్ సుఖ్‌దేవ్ అలియాస్ గుడ్సా ఉసేండి 2014లో తెలంగాణలో లొంగిపోయాడు.

2005లో సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM) శాఖమూరి అప్పారావు అలియాస్ రవితో వివాహం జరిగింది. అతను 2010 నల్లమల ఎన్ కౌంటర్ (ఆంధ్రప్రదేశ్)లో మరణించాడు.
రేణుక చాలా సున్నితత్వం గల వ్యక్తిగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇలా ఒక్కొక్కరే మిత్రులు ఒరిగిపోతుండటం చాలా కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇది ఒక వ్యక్తిని కోల్పోయిన బాధ మాత్రమే కాదు… ఇది ఒక విప్లవకారిణిని, ఒక గొప్ప రచయిత్రిని, ఒక ఉద్యమ స్ఫూర్తిని కోల్పోయిన విషాదం అని రేణుక సన్నిహితులు క్షోభ పడుతున్నారు.
Tags:    

Similar News