శ్రీవారి సూర్యప్రభ వాహనం పటిష్ట పరీక్షల వెనుక కథేమిటి?

తిరుమలలో బ్రహ్మోత్సవ సన్నాహాలకు తుది మెరుగులు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-17 14:32 GMT
తిరుమలలో సూర్యప్రభ వాహనసేవ (ఫైల్)

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మెత్సవాలు ఇక వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. దీనికోసం టీటీడీ అధికారులు సన్నాహాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఉభయదేవేరులతో కలిసి మలయప్ప విహరించే వాహనాల పటిష్టత పరిశీలన ప్రారంభమైంది.

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద బుధవారం సాయంత్రం మలయప్ప విహరించే సూర్యప్రభ వాహనం పటిష్టతను పరిశీలనకు ట్రయల్ రన్ నిర్వహించారు. దాదాపు 38 మంది వాహనబేరర్లు ఈ పల్లకీని తిరుమల మాడవీధుల్లో మోసుకుంటూ వెళ్లడం కనువిందు చేసింది. తిరుమలలో ఈ నెల 23వ తేదీ నుంచి అంకురార్పణ చేస్తారు. 24వ తేదీ రాత్రి పెదశేష వాహనంతో ప్రారంభయ్యే వాహన సేవలు అక్టోబర్ రెండో తేదీ చక్రస్నానంతో పరిసమాప్తి అవుతాయి. ఇదిలా వుండగా,

శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వాహన మండపం నుంచి ఆలయం మీదుగా నాలుగు మాడ వీధుల్లో సూర్యప్రభ పల్లకీని వాహన బేరర్లు (పల్లకీ సేవకులు) మోసుకుంటూ వెళ్లారు. దీనిని ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, వాహనాల ఇన్స్పెక్టర్ పార్థసారధి తోపాటు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు, అర్చకులు పర్యవేక్షించారు.
తుది మెరుగులు..
బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు చేసిన అన్ని ఏర్పాట్లను టీటీడీ అధికారులు వారం ముందు ఒకసారి సమీక్షించుకుంటారు. దీనిని ఆనవాయితీగా పాటిస్తున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై దాదాపు నెల కిందటి నుంచే సమీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారులు, సిబ్బందిని టీటీడీ ఈఓ జే. శ్యామలరావు సంసిద్ధం చేస్తుండగానే ఆయన బదిలీ అయ్యారు. నాలుగు రోజుల కిందట బాధ్యతలు చేపట్టిన ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తిరుమలలో ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.
టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు సారధ్యంలో జరిగిన సమీక్షలు, నిర్ణయాలతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు అధికారులకు బాధ్యతలు వికేంద్రీకరించారు. వారి శాఖలకు తగినట్లు సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు. అందులో భాగంగానే..
పటిష్ఠతపై దృష్టి
తిరుమలలో వ్యవహారాలన్నీ ఎవరి పరిధిలో వారు వికేంద్రీకరణకు అనుకూలంగా బాధ్యతలు నిర్వహిస్తుంటారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి పల్లకీల పటష్టతను పరిశీలించడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. పల్లకీ కోసం పటిష్టమైన తుండ్లు, దానిపై చెక్కతో తయారు చేసిన పల్లకీని అమర్చి, బలమైన మోకులు (తాళ్లతో) కదలకుండా ఉండేరీతిలో తయారు చేస్తారు. తుండు తయారు కావాలంటే టీటీడీ అటవీశాఖ శేషాచలం అటవీప్రాంతం లేదా బెంగళూరు ప్రాంతంలో నాణ్యమైన చెట్టును ఎంపిక చేస్తారు. అంటే ఆ చెట్టుకు మొదలు నుంచి పైభాగం వరకు ఎలాంటి రంధ్రాలు, బుడిపెలు లేకుండా ఉండే చెట్టును నరికి, నున్నగా మలిచి, భుజంపైకి ఎత్తుకున్నా గుచ్చుకోని విధంగా తయారు చేస్తారు. అలా రెండు తుండ్లు వాహన సేవకు రెండు పక్కలా అమరుస్తారు. ఇదిలావుంటే,
ఈ వాహనాలే ఎందుకు
ఉభయ దేవేరులతో మలయప్పస్వామి ఆశీనులై విహరించే వాహనాల్లో సూర్యప్రభ, చంద్రప్రభ, గరుడవాహనం, కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం ప్రధానమైనవి. ఈ వాహనాల్లో సూర్యప్రభ వాహనం పటిష్టత పరీక్షించడం వెనుక కారణం ఉంది. పల్లకీ తోపాటు దానిపై అమర్చిన ఏడుగుర్రాలు, సూర్యకిరణాలు వెదజల్లె విధంగా అమర్చిన అలంకరణ వస్తువుతో కలిపి ఈ వాహనం దాదాపు రెండు టన్నల వరకు బరువు ఉంటుంది. రాగితో తయారు చేసిన సూర్యుడి ప్రతిబింబానికి బంగారు తాపడం చేశారు. వాహనసేవ జరిగే రోజు పల్లకిపై దేవతామూర్తులతో పాటు గొడుగులు, ఓ అర్చకుడు, మరో ఇద్దరు పరిచారకులతో కలిసి దాదాపు 2.5 టన్నుల వరకు బరువు ఉంటుందనేది ఓ అంచనా. గరుడవాహనం మరో టన్ను ఎక్కువ బరువే ఉంటుంది. ఈ పరిస్థితుల కారణంగా

"బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు వాహనాల పటిష్టతను పరీక్షించడానికి ప్రాధాన్యత ఇస్తాం" అని ఇన్సెక్టర్ పార్థసారథి చెప్పారు. తిరుమలలో వాహనాలు మోయడానికి సుమారు 80 మంది మోతగాళ్లు (వాహనబేరర్లు ఉన్నారు. బ్రహ్మోత్సవాల వేళ దాదాపు మరో 20 మందిని స్థానిక ఆలయాల నుంచి డిప్యూటేషన్పై తీసుకుని వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. బుధవారం వాహన పటిష్టత పరీక్షకే పల్లకీకి ముందు పక్కపక్క వరుసల్లో 16 మంది, వాహనం వెనుక మరో 16 మంది మోశారు. అంటే, అలంకరణ లేని ఈ వాహనం బరువు దాదాపు రెండు టన్నుల వరకు బరువు ఉంటుందనే విషయం అర్ధం అవుతుంది.
తిరుమలలో నిత్యం పల్లకీ సేవలకు, బ్రహ్మెత్సవం, రథసప్తమికి వాడే వాహనసేవలకు ప్రత్యేకత ఉంటుంది. తిరుమలలోని పల్లకీల పటిష్టత, నాణ్యతలో తేడా కనిపిస్తే, అదనంగా ఉంచుకునే తుండ్లు అమర్చడం ద్వారా ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా మందుస్తు చర్యలు తీసుకుంటారని ఓ వాహనబేరర్ చెప్పారు.


Tags:    

Similar News