అయ్యన్నగా కాదు సభాపతిగా గౌరవం ఇవ్వండి
గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.;
చింతకాయల అయ్యనపాత్రుడుగా కాకుండా అసెంబ్లీ స్పీకర్‌గా తనకు గౌరవం ఇవ్వాలని, ఆ బాధత్య వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీ «అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేపట్టాల్సిన కట్టుదిట్టమైన చర్యలపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరి ముఖ్యంగా ప్రశ్నోత్తరాల గురించి చర్చించారు.
ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకు సమాధానాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని తాను కోరుకుంటున్నానని, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా బయట తిరగడం మంచిది కాదని సూచించారు. తమ ప్రాంత సమస్యలు ప్రస్తావించడానికి, వాటికి సంబంధించిన పరిష్కారానికి అసెంబ్లీ సమావేశాలు అనేవి మంచి అవకాశమని అయ్యన్న పాత్రుడు అన్నారు.