Breaking | 'మామిడి' ప్రాణాలు తీసింది... ఏడుగురు మృతి

ఒకవైపు రైతును బాధిస్తున్న మామిడి మరొకవైపు లారీ రూపంలో కూలీలను కాటేసింది...;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-13 18:18 GMT
రైల్వేకోడూరు వద్ద బోల్తా పడిన మామిడి కాయల లోడుతో ఉన్న లారీ.

ఇది మామిడికాయల సీజన్. రైతులకు గిట్టుబాటు ధర దక్కలేదు. తోటల్లో కోతకు వెళ్లే కూలీల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలానికి సమీపంలోని చెరువు కట్టపై మామిడి లోడుతో వస్తున్న లారీ బోల్తా పడింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో దాదాపు ఏడుగురు మరణించారని చెబుతున్నారు. ఆ సంఖ్య పది మంది వరకు ఉన్నట్లు సమాచారం అందింది. పెద్ద సంఖ్యలోనే కూలీలు కూడా గాయపడ్డారని తెలుస్తోంది.

ఘటనా స్థలంలో పరిస్థితి కన్నీరుపెట్టిస్తోంది.  మామిడి కాయల కోతలకు పెద్దలు పిల్లలను కూడా వెంట తీసుకుని వెళ్లారు. పిల్లలు ఆటపాటల్లో ఉంటే పెద్దలు పనుల్లో ఉన్నారు. మామిడి కాయలు లారీకి నింపిన తరువాత ప్రమాదకర స్థితిలోనే ప్రయాణం చేశారు. 

దురదృష్టవశాత్తూ లారీ బోల్లా పడింది. ఆ ప్రమాదంలో మరణించిన వారి పిల్లలు శోకాలు పెడుతున్నారు.  భయకంపితులైన గాయపడిన తల్లిదండ్రులు తమ  పిల్లలను అక్కున చేర్చుకున్న దృశ్యాలు మాటలకు అందని పరిస్థితి కనిపించింది. 



చిత్తూరు జిల్లా తర్వాత మామిడి తోటలకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నిలయం. తోటల వద్ద కాయలు కొనుగోలు చేసే పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కోత కోసం సమీప గ్రామాల నుంచి కూలీలను లారీలను తీసుకువెళ్తారు. ఉదయం నుంచి కొంత మంది కూలీలు మామిడి తోటలో కాయలు కోస్తే, ఆ కాయలను లారీలో నింపుతారు.

మామిడికాయల లోటుతో రాజంపేట నుంచి రైల్వేకోడూరు ఓ లారీ బయలుదేరింది. ఆ లారీలో కాయలను నింపిన కూలీలు కూడా ప్రయాణిస్తున్నారు. మామిడికాయలతో నింపిన లారీకి టార్పాలిన్ పట్టే కట్టారు. ఆ లోడ్ పై కూర్చొని కూలీలు ప్రయాణిస్తున్నారు. పుల్లంపేట దాటిన తర్వాత రెడ్డి పల్లె చెరువుగట్టు పై ప్రయాణిస్తుండగా మామిడికాయ లోడుతో ఉన్న లారీ బోల్తా పడింది.

ఈ లారీ లో ప్రయాణిస్తున్న కూలీలు ఆ బరువు కింద పడి నలిగిపోయారు. ఏడుగురు కూలీలు సంఘటన స్థలంలోని ప్రాణాలు వదిలినట్లు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు 8 మందిని కాపాడినట్లుతెలుస్తోంది.

గాయపడిన కూలీలను కాపాడడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
తీవ్ర గాయాలతో ఉన్న కూలీలను అంబులెన్స్ లో అటు రాజంపేట రైల్వే కోడూరు ఆసుపత్రులకు తరలించినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి కడప జిల్లా (అన్నమయ్య జిల్లా) రైల్వే కోడూరు నియోజక వర్గం పుల్లంపేట వద్ద జరిగిన ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News