అమృతం.. స్వాగతం.. ఇవి సినిమా పేర్లు కాదు.. మామిడి పండ్ల జాతుల పేర్లు! పేరుకు తగ్గట్టే అమృతం మామిడి పండు అమృతంలాంటి రుచిని అందిస్తుంది. సువాసనలనలు వెదజల్లుతూ ఇంటికొచ్చే వారికి స్వాగతం పలుకుతుంది స్వాగతం రకం మామిడి పండు. ఆరేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండే ఐస్ ఫ్రూట్ మామిడి పండు సహా పలు అద్భుత ఆవిష్కరణలు చేసింది, చేస్తున్నదీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కాదు.. కేవలం ఎనిమిదో తరగతి మాత్రమే చదువుకున్న విభిన్న రైతు శాస్త్రవేత్త. మ్యాంగో మాంత్రికుడు కొంగర రమేష్! విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో భిన్న జాతుల మామిడిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ శాస్త్రవేత్తలను, రాష్ట్ర, కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్రపతి వరకు సెభాష్ అనిపంచుకుంటున్నారు.
ఐస్ ఫ్రూట్ మ్యాంగోతో రైతు శాస్త్రవేత్త రమేష్
కొంగర రమేష్‌ది గుంటూరు జిల్లా కాకుమాను. తండ్రి రైతు. ఆయన విలేజి సర్పంచ్ అయ్యాక వ్యవసాయం చూసుకోవాలని చెప్పడంతో ఎనిమిదో తరగతితో చదువుకు స్వస్తి పలికి వ్యవసాయంలోకి వచ్చాడు రమేష్! తండ్రి వ్యవసాయం చేస్తున్నప్పుడు వ్యవసాయంలో కొత్త వంగడాలను పరిచయం చేసేవారు. దీంతో రమేష్‌కు బాపట్ల కాలేజి ప్రొఫెసర్లు/శాస్త్రవేత్తలతో సంబంధాలేర్పడ్డాయి. ప్రొఫెసర్లను పొలంలోకి తీసుకొచ్చి ఆధునిక వంగడాల గురించి తెలుసుకున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు విద్యార్థులకంటే రమేష్‌కు బాగా వివరించేవారు. దీంతో తొలుత పత్తిలో బ్రీడింగ్ చేశారు. మంచి ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్నాటక, నుంచి కూడా రైతులు వచ్చి ఈ విత్తనాలు తీసుకెళ్లేవారు. ఆ తర్వాత మిరప బ్రీడింగ్ ఎందుకు చేయకూడదని అదీ మొదలెట్టారు. మిరపలో పెసర, మినుములా తక్కువ వ్యవధిలో కాపుకొచ్చేలా, చెట్టుకే ఎండిపోయేలా కొత్త వంగడాన్ని రూపొందించారు. మిరపను మెడిసినల్ వాల్యూతో తయారు చేస్తున్నారు. దీనిని పేటెంట్ కోసం పంపారు.
రమేష్ పండిస్తున్న మియాజాకి తరహా మామిడి
మామిడిలో ఎన్నో అద్భుతావిష్కరణలు..
తలకు గాయమవడంతో విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచనతో రమేష్ మూడున్నర దశాబ్దాల క్రితం సొంతూరు నుంచి విశాఖ జిల్లా తర్లువాడకు వచ్చారు. అక్కడ నవయుగ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన మామిడితోటలో ఉంటున్నారు. వ్యవసాయంపై మక్కువ ఉన్న ఆయనకు మామిడి లో కొత్త రకాలను సృష్టించాలని ఆలోచన కలిగింది. ఆ ఆలోచనతో మామిడిలో స్వాగతం, అమృతం అనే రెండు అద్భుత రకాలను రూపొందించారు. ఈ స్వాగతం పండు మంచి సువాసనా భరితంగా ఉంటుంది. సీజనుకు ముందే అంటే మార్చి రెండో వారానికే ఈ పళ్లు చేతికొస్తాయి. మంచి ధరతో లాభాలను తెస్తాయి. ఇక రెండోది అమృతం.. దీనిలో ఇంకా అద్భుత లక్షణాలున్నాయి. ఏ ఇతర మామిడి పండైనా 15 డిగ్రీల వద్ద ఉంచితే చిల్ ఇంజూరీ (మచ్చ) వస్తుంది. అమృతం ఆరేళ్లు డీఫ్రిజ్‌లో –20 డిగ్రీల వద్ద ఉంచినా రుచి, రంగు, ఆకారం, నాణ్యత మారదు. దీనిని ఆరేళ్ల తర్వాత కూడా అరటిపండు వలుచుకుని తిన్నట్టు తినొచ్చు. ఐస్ ఫ్రూట్‌లా తినడానికి టెంకకు డ్రిల్ చేసి పుల్లను అమరుస్తారు. అందుకే దీనికి ఐస్ ఫ్రూట్ మ్యాంగో అని పేరు పెట్టారు. దీని తొక్క చేదుగా ఉండడం వల్ల పురుగు కూడా పట్టదు. ప్రపంచంలోనే ఈ తరహా పండును రూపొందించడం ఇదే తొలిసారి. ఇవి మూడో ఏట నుంచే కాపుకొస్తాయి. పదేళ్ల నాటికి చెట్టుకు వెయ్యి కాయలు కాస్తాయి. ఈ పండ్లను ఢిల్లీ ఎగ్జిబిషన్‌లో పెడితే అందరూ ఇతర మామిడి పండ్లను కిలో రూ.30–40కి అమ్ముతుంటే అమృతం రూ.700 ధర పెట్టినా ఎత్తుకుపోయారంటే దీనికున్న ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పదేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో అనేక ఎగ్జిబిషన్లలోనూ ఐస్ ఫ్రూట్ మ్యాంగో హంగామా చేస్తూనే ఉంది. వీటితో పాటు ఐస్ క్రీమ్‌లా స్పూన్‌తో గుజ్జును తీసుకుని తినే పెద్ద సైజు మామిడినీ రమేష్ రూపొందించారు. ఈ తోటలో 90 రకాల మామిడి చెట్లుంటే అందులో 80 రకాలకు పైగా విభిన్న మామిడి వంగడాలు రమేష్ సృష్టించినవే. వీటిలో అమృతం, స్వాగతం రకాలను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ (ఐఐహెచ్‌ఆర్)లో రిజిస్టర్ అయింది. వీటిని పేటెంట్ కోసం పంపారు.
ఫ్రీజర్‌లో ఉంచిన స్వాగతం, అమృతం రకాల మామిడి
కాయ కింద నుంచి పండేలా..
రమేష్ ఆవిష్కరణల మదిలో నుంచి మరొకటి మెదిలింది. సాధారణంగా మామిడి తొడిమ నుంచి కిందకు పండుతూ (ముదురుతూ) వస్తుంది. దానివల్ల కింద నుంచి చూస్తే రైతుకు అది ముదిరిందో లేదో తెలియక పక్వానికి ముందే కోసేస్తుంటారు. దీనివల్ల రైతుకు గిట్టుబాటు ధర రాక నష్టపోతుంటాడు. దీనిని దృష్టిలో ఉంచుకుని మామిడి కాయ కి ంది భాగం నుంచి పండేలా సరికొత్త వంగడాన్ని సృష్టించారు. దీంతో కాయ ముదిరిందో లేదో తెలుసుకుని ముదిరాక కోసుకునే వీలుంటుంది. పైగా కాయ పూర్తిగా పండే వరకు రాలకుండా చెట్టునే ఉండడంతో రైతుకు లాభాదాయకంగా ఉంటుంది.
కింద నుంచి పండుతున్న వెరైటీ మామిడి
మరెన్నో వెరైటీ మ్యాంగోలు..
రమేష్ సృష్టిస్తున్న మ్యాంగో వంగడాలను చూస్తే ఔరా? అనిపిస్తుంది. స్వాగతం, అమృతం వంటి రకాలనే కాదు.. డయాబెటిక్ ఔషధ గుణాలున్న మామిడి వంగడాన్ని కూడా రూపొందించారు. ఇతర రకాల మామిడిలో టీఎస్‌ఎస్ (టోటల్ సాల్యుబుల్ సుగర్స్) 23–25 వరకు ఉంటే ఈ డయామెటిక్ మ్యాంగోలో 12 టీఎస్‌ఎస్‌లు మాత్రమే ఉంటాయి. అంతేకాదు.. ఆకుల్లోనూ 22 రకాల ఔషధ గుణాలుండేలా మరో మామిడి వంగడాన్ని సృష్టించారు. ఈ ఆకులను ఎండబెట్టి టీ పొడిలా చేసి డికాక్షన్‌లా తాగితే మధుమేహంతో పాటు మరికొన్ని దీర్ఘకాలిక రోగాలకు విరుగుడుగా పని చేస్తుందని రమేష్ చెబుతున్నారు. దీనిని ఐఐహెచ్‌ఆర్ శాస్త్రవేత్తలు మెచ్చుకున్నారు.
మరో ఐదారు రకాల సృష్టి..
ఇంకా భిన్న ప్రత్యేకతలున్న ఐదారు రకాల మామిడిని సృష్టించారు రమేష్. ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఐఐహెచ్‌ఆర్ గుర్తింపు వచ్చాక వీటికి పేర్లు పెట్టనున్నారు. దేశానికి వివిధ ర ంగాల్లో సేవలందించిన (అబ్దుల్ కలాం, రతన్ టాటా) వంటి వారి పేర్లను వీటì కి పెట్టాలని రమేష్ భావిస్తున్నారు. పలు ఔషధ గుణాలున్న జపాన్‌కు చెందిన మియాజాకీ మామిడి పండ్ల పేరు ఇటీవల మారుమోగిపోతోంది. వీటికి మార్కెట్లో కిలో రూ.లక్ష నుంచి రెండు లక్షల ధర పలుకుతోంది. అలాంటి ఔషధ గుణాలే ఉన్న మామిడిని కూడా మన రమేష్ రూపొందించారు. ఈ మామిడిని రానున్న రోజుల్లో కిలో రూ.200–300లకే అందించవచ్చంటున్నారు రమేష్. వీటిని పరీక్ష కోసం ఐఐహెచ్‌ఆర్‌కు పంపారు.
ప్రతిభకు అవార్డుల పంట..
రమేష్ ప్రతిభకు అవార్డుల పంట పండుతూనే ఉంది. ఇప్పటికే ప్రతిష్టాత్మక ఫార్మర్ సైంటిస్ట్ అవార్డును అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ నుంచి, సృష్టి సమ్మాన్ అవార్డును రాష్ట్రపతి భవన్ నుంచి, ఎన్జీరంగా అవార్డును మాజీ సీఎం రోశయ్య నుంచి, భారతీయ కిసాన్ సంఘ్ అవార్డు (రెండుసార్లు)లతో పాటు మరెన్నో అవార్డులను అందుకున్నారాయన. అంతేకాదు.. ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, భువనేశ్వర్, బాపట్ల తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ వంటి ప్రముఖల ప్రసంశలందుకున్నారు రమేష్.
హోమియోపతి వైద్యునిగానూ..
నాణేనికి మరోవైపు అన్నట్టు.. కొంగర రమేష్ హోమియోపతి వైద్యంలోనూ పరిజ్ఞానాన్ని సంపాదించారు. హోమియోపతిపై ఉన్న మక్కువతో పుస్తకాలను అధ్యయనం చేసి పట్టు సాధించారు. దీంతో ఆయన రెండు దశాబ్దాలకు పైనుంచి ప్రతి ఆదివారం తానుంటున్న తోటలోనే హోమియోపతి వైద్యాన్ని, మందులను ఉచితంగా అందిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, ఒడిశాలక చెందిన రెండు లక్షల మందికి పైగా రోగులకు వైద్యమందించారు. ఈయన వద్ద వైద్యం పొందిన వారిలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు ఉన్నారు.
అంకురార్పణ అలా జరిగింది..
1997 ప్రాంతంలో అప్పటి భారత ప్రధాని వాజ్‌పేయికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ దేశంలో పండిన అమూల్యమైన మామిడి పండ్లను బహుమతిగా పంపారు. అలాంటి పండ్లను మనం పండించలేమా? అన్న ఆలోచన అప్పట్లో నాకు కలిగింది. అప్పటికి నేను పత్తి, మిర్చి వంగడాలపై అధ్యయనం చేస్తున్నాను. దీంతో మామిడిలో వెరైటీ వంగడాలపై దృష్టి సారించాను. కాలక్రమంలో నా కృష్టి ఫలించింది. ఒక్కొక్కటి విభిన్నంగా రూపొందించి వినూత్న ఫలితాలు సాధించాను. అలా సృష్టించినవే స్వాగతం, అమృతం వంటి రకాలు. ఆపై పలు రకాలను రూపొందిస్తున్నాను. ఏడాదంతా మార్కెట్లో మామిడి పండును అందించాలన్న సంకల్పంతో అమృతం వంగడాన్ని ఆవిష్కరించాను. నా ఆశయం నెరవేరుతోంది. ఈ తరహా మొక్కలను అవసరమైన వారికి అందించడానికి మా తోటలో నర్సరీ ఉంది. ఇప్పటికే అమృతం రకం మొక్కలను బాపట్ల, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, గజపతినగరం, చోడవరం, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు కర్నాటక రైతులు తీసుకెళ్లి పెంచుతున్నారు. ఇలా ఇప్పటివరకు 25 ఎకర్లాల్లో వేశారు. విడిగా వెయ్యికి పైగా మొక్కలను తీసుకెళ్లారు. నాకు చాలామంది బ్రీడర్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో పరిచయాలున్నాయి. వారి సలహాలు, సూచనలు, సహకారంతో పాటు నాకు ఆవిష్కరణలపై ఉన్న ఆసక్తి వెరసి నన్ను రైతు శాస్త్రవేత్తగా మారడానికి దారితీసింది’ అని రమేష్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధికి వివరించారు.