శ్రీవారి ఆలయానికి గ్రహణం ఎఫెక్ట్
సెప్టెంబర్ ఏడో తేదీ సాయంత్రం నుంచి 12 గంటల వరకు టీటీడీ దర్శనాలు, ఆర్జితసేవలు TTD రద్దు చేసింది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-08-26 12:52 GMT
తిరుమల శ్రీవారి ఆలయం 12 గంటలపాటు మూతపడనుంది. చంద్రగ్రహణం ( lunar Eclipse )కారణంగా సెప్టెంబర్ ఏడో తేదీ సాయంత్రం 3.30 గంటల నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ వేకువజామున మూడు గంటల వరకు ఆలయం మూత వేస్తారు.
శ్రీవారి సర్వదర్శనాలతో పాటు, ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు. ఆ రోజు తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలను కూడా మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మధ్యాహ్నమే యాత్రికుల కోసం పులిహోరా పొట్లాలు అందించనున్నట్లు తెలిపారు.
చంద్రగ్రహణం ఎప్పుడంటే..
గ్రహణాల సందర్భంలో ఆలయాన్ని మూసివేస్తుంటారు. గ్రహణం వీడిన తరువాత సంప్రోక్షణ అనంతరం యాత్రికులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తుంటారు. సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు అంటే ఎనిమిదో తేదీ సోమవారం వేకువజామున 1.31 గంటలకు గ్రహణం పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
తోమాల సేవతో ప్రారంభం
శ్రీవారి ఆలయాన్ని సెప్టంబర్ 8న ఉదయం మూడు గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునః ప్రారంభవుతుంది.
ఆర్జితసేవలు రద్దు
చంద్రగ్రహణం కారణంగా సెప్టంబర్ 7వ తేదీ ఆదివారం ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
అన్నప్రసాద కేంద్రాల మూత
తిరుమలలో చంద్రగ్రహణం రోజు అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూతవేయనున్నారు. ఏడో తేదీ ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. తిరిగి సెప్టెబర్ 8వ తేదీ ఉదయం 8.30 గంటలకు అన్నప్రసాదాల పంపిణీ తిరిగి ప్రారంభమవుతుంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, పీఏసీ-2 లలో అన్నప్రసాదాల వితరణ ఉండదు.
ప్రత్యామ్నాయ ఏర్పాటు
భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 30 వేల పులిహోర ప్యాకెట్లను సెప్టెంబర్ ఏడో సాయంత్రం 4.30 గంటల నుంచి పంపీణి చేయనున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు, శ్రీవారి సేవా సదన్ వద్ద భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు.