లూలూ మాల్... ఎవరికి మేల్...
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో గుండెకాయ లాంటి స్థలాలను లూలూ పచారీ వ్యాపారానికి ఎందుకు ప్రభుత్వం లీజుకిచ్చినట్లు?;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం, విజయవాడలలో విలువైన భూములను లూలూ గ్రూప్‌కు 99 సంవత్సరాల లీజుకు ఇవ్వడం వెనుక ఎవరున్నారు? ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కన బెట్టి, నిరసనలను సైతం లెక్క చేయకుండా ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విలువైన స్థలానికి వేలం ప్రక్రియ లేకుండా, పారదర్శకతకు పాతరేసి, ఆర్టీసీ వంటి కీలక సంస్థల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఏపీలో తీవ్ర చర్చకు దారితీసింది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ, కార్పొరేట్ సంబంధాలకు ప్రాధాన్యమిచ్చిందని చెప్పొచ్చు. ఈ కేటాయింపులు అభివృద్ధి పేరుతో ప్రజల ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే దిగజారుడు వైఖరిగా ప్రజా పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
కోట్ల విలువైన స్థలాలు 99 ఏళ్ల లీజుకు...
విశాఖపట్నంలో బీచ్ రోడ్డు వద్ద హార్బర్ పార్క్ సమీపంలో 13.74 ఎకరాల భూమిని లూలూ గ్రూప్‌కు 99 సంవత్సరాల లీజుకు ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిపై 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ నిర్మాణం జరగనుంది. ఇందులో సూపర్‌మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్, లూలూ కనెక్ట్ వంటివి ఏర్పాటు చేస్తారు. విజయవాడలో గవర్నర్‌పేట-2లోని ఆర్టీసీ డిపో వద్ద 4.15 ఎకరాల భూమిని, 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో మాల్ నిర్మాణానికి లీజుకు ఇచ్చారు. ఈ భూములను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) ద్వారా కేటాయించారు. రాష్ట్ర పర్యాటక భూమి కేటాయింపు విధానం 2024-29 ప్రకారం ధర నిర్ణయిస్తారు. మూడేళ్ల లీజు మాఫీని కూడా ప్రభుత్వం ప్రత్యేక కేటగిరీ కింద అనుమతించింది.
విశాఖపట్నం హార్బర్ వద్ద లూలూ గ్రూప్ కు ఏపీ ప్రభుత్వం కేటాయించిన స్థలం
ప్రభుత్వం వాదన
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ కేటాయింపులు రాష్ట్ర ఆర్థిక, పర్యాటక అభివృద్ధికి దోహదపడతాయని చెబుతోంది. లూలూ మాల్స్ ద్వారా వేలాది ఉద్యోగాలు, ఉన్నత స్థాయి షాపింగ్, వినోద సౌకర్యాలు స్థానికులకు అందుతాయని, విశాఖ, విజయవాడలను రిటైల్ హబ్‌లుగా మార్చవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టులు త్వరగా అమలు కావాలని, భూములపై ఉన్న కోర్టు కేసులను పరిష్కరించాలని APIICకి ఆదేశాలు జారీ అయ్యాయి.
విమర్శలు, స్థానికుల ఆందోళన
స్థానిక కార్యకర్తలు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు, ప్రతిపక్ష పార్టీలు ఈ కేటాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖలో బీచ్ ఫ్రంట్‌లోని 13.74 ఎకరాలు, విజయవాడలో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలు అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలు. ఈ స్థలాలను 99 సంవత్సరాల లీజుకు, అది కూడా మూడేళ్ల పన్ను మాఫీతో ఇవ్వడం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారు, మేధావులు ఆరోపిస్తున్నారు. 150 కోట్ల పెట్టుబడికి రూ. 3,000 కోట్ల విలువైన స్థలాలను లూలూ గ్రూప్‌కు అప్పగించారని, ఇది పారదర్శకత లేని నిర్ణయమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
ప్రజా రవాణాకు కీలక స్థలం
విజయవాడలోని ఆర్టీసీ భూమి ప్రజా రవాణా వ్యవస్థ విస్తరణకు కీలకం. ఈ భూమిని లూలూ గ్రూప్‌కు ఇవ్వడం ద్వారా ఆర్టీసీని బలహీనపరచడమే లక్ష్యంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొల్లపూడిలో ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమి కేటాయించినప్పటికీ, అది ప్రస్తుత డిపో స్థలం విలువ, సౌలభ్యానికి సమానం కాదు. లూలూ గ్రూప్‌ను బినామీ సంస్థగా భావిస్తూ, ఈ కేటాయింపుల వెనుక రాజకీయ సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాల ఆరోపణలు ఉన్నాయి. బిడ్డింగ్ ప్రక్రియ లేకుండా ఒకే సంస్థకు భూములు కేటాయించడం పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తింది.
రాజకీయ నేపథ్యం
ఈ భూముల కేటాయింపు 2014లో టీడీపీ ప్రభుత్వంలో మొదట ప్రతిపాదించబడింది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం 2019లో ఈ నిర్ణయాన్ని రద్దు చేసింది. కానీ 2024లో తిరిగి కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ లూలూ గ్రూప్‌కు భూములు కేటాయించింది. ఈ పరిణామం రాజకీయ విధేయత, కార్పొరేట్ సంబంధాలపై సందేహాలను రేకెత్తిస్తోంది. వైఎస్ఆర్‌సీపీతో పాటు కార్మిక సంఘాలు, పౌర కార్యకర్తలు ఈ కేటాయింపులను హైకోర్టులో సవాలు చేయాలని పిలుపునిచ్చాయి.
హైకోర్టులో లూలూపై వ్యాజ్యం
లూలూ సంస్థకు భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ పాకా సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విలువైన భూములు లూలూకు ఇవ్వడం ప్రజా ప్రయోజనాలను వ్యాపారికి తాకట్టు పెట్టడమేనని పిల్ లో పేర్కొన్నారు. పిల్ ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తూ విశాఖపట్నం బీచ్ లో లూలూకు కేటాయించిన స్థలంతో పాటు విజయవాడలో కేటాయించిన స్థలానికి సంబంధించి విడుదలైన జీవోను కోట్ చేస్తూ పిటీషన్ దాఖలు చేయాలని పిటీషనర్ ను ఆదేశించింది. పిటీసనర్ తరపున న్యాయవాది అశోక్ రామ్ వాదించారు. విచారణ వచ్చే వారం చేపడతామని కోర్టు వెల్లడించింది.
స్థలాల కేటాయింపుపై ఈఏఎస్ శర్మ లేఖలు
లూలూకు ప్రభుత్వ విలువైన స్థలాల కేటాయింపు సరైన పద్ధతి కాదని, వెంటనే ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఇప్పటికి మూడు సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు లేఖలు రాశారు. అయినా ప్రభుత్వం ఆయన లేఖలపై స్పందించ లేదు.
కొనసాగుతున్న ఆందోళనలు
వామపక్ష పార్టీలు, ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ స్థలాల కేటాయింపును వ్యతిరేకిస్తూ విజయవాడలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా పౌర వేదిక వారు ర్యాలీలు, ధర్నాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.
ఉద్యోగాలు ఏముంటాయంటే...
లూలూ మాల్స్ పదో తరగతి చదువుకున్న నిరుద్యోగులకు మాత్రమే ఉపయోగ పడే అవకాశం ఉంది. ఇందులో సేల్స్ మెన్, సేల్స్ ఉమెన్ ఉద్యోగాలు తప్ప మరేముంటాయో ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వ భూములను దీర్ఘకాల లీజుకు, అది కూడా పన్ను మాఫీతో ఒక ప్రైవేటు సంస్థకు ఇవ్వడం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉందనేది పలువురి వాదన. ఆర్టీసీ వంటి సంస్థలు ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ భూములు కీలకం. బిడ్డింగ్ లేకుండా ఒకే సంస్థకు భూములు కేటాయించడం, పారదర్శకత లోపించడం వల్ల ప్రభుత్వ నిర్ణయాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. లూలూ గ్రూప్ లాభసాటి ప్రాంతాల్లో తమ వ్యాపారాలను సొంతంగా స్థాపించుకోవచ్చు. కానీ విలువైన ప్రభుత్వ భూములను దాదాపు శాశ్వతంగా లీజుకు ప్రభుత్వం ఇవ్వడం అసమంజసం, ఇది తప్పకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన పనేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అభివృద్ధి, పారదర్శకత మధ్య సంఘర్షణ
లూలూ గ్రూప్‌కు భూముల కేటాయింపు ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, పారదర్శకత మధ్య సంఘర్షణను స్పష్టంగా చూపిస్తోంది. ఈ నిర్ణయం ఆర్థిక ప్రయోజనాలను తెచ్చినప్పటికీ, ప్రజల ఆస్తులైన విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం, ఆర్టీసీ వంటి సంస్థలను బలహీనపరచడం దీర్ఘకాలంలో ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. విజయవాడలోని ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం ఎటువంటి కట్టడం నిర్మించినా మునిసిపాలిటీకి శాశ్వత ఆదాయ వనరుగా ఉంటుంది. ఆర్టీసీ స్థలాన్ని ఆనుకుని పోలీస్ కంట్రోల్ రూము వరకు కాలువ పక్కన మునిసిపల్ పార్కు ఉంది. ఇది సుమారు ఎకరం స్థలంలో ఏర్పాటు చేశారు. ఆర్టీసీ స్థలాన్ని ఆనుకుని ఉన్నందున దీనిని కూడా లూలూకు ఇవ్వడానికి ఆదేశాలు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇదే జరిగితే సుమారు ఆరు ఎకరాల స్థలం పోలీస్ కంట్రోల్ రూము నుంచి చల్లపల్లి బంగళా సెంటర్ వరకు లూలూ స్వాధీనంలోకి వెళ్లిపోతుంది. ఈ స్థలం విజయవాడ నగరానికి గుండెకాయ వంటిది.