వెనుకా ముందు కెమేరాలతో లోకేష్ గ్రాండ్ ఎంట్రీ
కడప మహానాడులో మంత్రి నారా లోకేషే పెద్ద హైలెట్. టీడీపీ నేతలంతా ఆయన చుట్టూనే తిరిగారు.;
By : The Federal
Update: 2025-05-27 11:38 GMT
కడపలో జరుగుతున్న మహానాడు స్టేజ్‌పైకి మంత్రి నారా లోకేష్ ఎంట్రీ అదిరిపోయింది. టీటీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటే ఆయన కొడుకు, మంత్రి నారా లోకేష్ ఎంట్రీనే పెద్ద హైలైట్‌గా నిలిచింది. రెండు, మూడు కెమేరాల మధ్య ఆయన స్టేజ్‌పైకి రావడం, ఆయన రావడంతోనే అక్కడ ఆసీనులైన సీనియర్ నాయుకులు, స్టేజీ ముందున్న నాయకులు, కార్యకర్తలు ఒక్క సారిగా లేచి నిలుచొని చప్పట్లతో ఘన స్వాగతం పలికారు.
మహానాడు వేదిక వద్దకు వచ్చిన మంత్రి నారా లోకేష్‌ను టీడీపీ సీనియర్ నాయకులు, మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్‌రెడ్డిలు వేదికపైకి తీసుకొచ్చారు. ముందొకటి, వెనుకొకటి, మధ్యలో ఒకటి.. మూడు కెమేరాల మధ్య లోకేష్ వేదికపైకి ప్రవేశించారు. ముందుగానే ఆయనకు పెద్ద ఎత్తున భద్రత సిబ్బంది ఉన్నారు. వీరి నడుమ చుట్టూ కెమేరాల మధ్య లోకేష్ ఎంట్రీ ఇచ్చిన తీరు టీడీపీ శ్రేణులను మంత్రముగ్దులను చేసింది. లోకేష్ వేదికపైకి రాగానే అప్పటి వరకు వేదికపై సీట్లలో ఆసీనులైన
టీడీపీలో చంద్రబాబు సమకాలికులు, దశాబ్దాల తరబడి పార్టీలో కొనసాగుతున్న అశోక్ గజపతి రాజు, ఎన్‌ఎండీ ఫరూక్ వంటి ఎంతో మంది సీనియర్ నేతలు, వేదిక ముందు ఆసీనులైన వందలాది మంది కార్యకర్తలు ఒక్క సారిగా లేచి నిల్చుని చప్పట్లతో అభినందనలు తెలుపుతూ స్వాగతం పలికారు. అంతేకాకుండా వేదికపైకి లోకేష్ రాగానే ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఉద్దండులైన సీనియర్ నేతల సైతం కుర్చీలలో నుంచి పైకి లేచి రెండు చేతులెత్తి వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఆహ్వానం పలికారు. అప్పటి వరకు మహానాడు వేదిక మీద పాటలు, డ్యాన్సులు చేస్తున్న టీడీపీ కళాకారులంతా ఒక్క సారిగా అలెర్ట్ అయిపోయారు. వారి నృత్యాలను ఒక్క సారిగా స్టాప్ చేసి ఆయనకు వెల్‌కమ్ పలికారు. కదలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా అనే పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంటే.. వేదిక మీద ఆసీనులైన నాయకులకు ఆయన కరచాలనం చేస్తూ, ముందుకు కదులుతున్న విధానం లోకేష్ అభిమానులను మాత్రం సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.