Naraa LOKESH | పండంటి రాష్ట్రానికి లోకేష్ ఆరు సూత్రాలు

కాలానుగుణంగా పార్టీలో విధానపరమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కడప మహానాడు వేదికపై మంత్రి లోకేష్ కీలకమైన ప్రతిపాదనలు చేశారు.;

Update: 2025-05-27 11:12 GMT
కడప టీడీపీ మహానాడులో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్

"కాలం మారుతోంది. ప్రజల అవసరాలు మారుతున్నాయి. వారి ఆలోచన విధానం కూడా మారుతోంది. పార్టీ మూల సిద్దాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజల అవసరాలకు అనుగుణంగా కీలక విధానపరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. దీనికోసం ఆయన "ఆరు శాసనాలను ప్రతిపాదించారు.

కడప మహానాడు వేదికపై తొలిరోజు మంగళవారం ప్రతినిధుల మహాసభలో ఈ ఆరు సూత్రాలపై చర్చకు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
"స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పది. టీడీపీ అంటే తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వం. అన్న‌దాత‌ల‌కు అండ‌గా, కార్మికుల క‌ష్టాలు తీర్చేందుకు, పేదలకు కడుపు నిండా భోజనం, కట్టుకోవడానికి బట్టలు, ఉండేందుకు పక్కా ఇల్లు ఇవ్వాలనే ధ్యేయంతో పార్టీ పెట్టారు" అని గుర్తు చేశారు.
43ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాం. మనకు అధికారం కొత్తకాదు... ప్రతిపక్షమూ కొత్తకాదు. అధికారం ఉన్నా లేకపోయినా తెలుగు వారికి కష్టం వస్తే మొదట స్పందించే పార్టీ తెలుగుదేశం. సమాజమే దేవాలయం .. ప్రజలే దేవుళ్ళు అని ఆరోజు అన్నగారు అన్నారు. మన అధినేత చంద్రబాబు గారి దగ్గర నుండి కార్యకర్తల వరకూ అందరం ఏదో ఒక రూపంలో ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాం అని లోకేష్ అన్నారు.

మార్పులు గమనించాలి..
మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ కూడా అడుగులు వెయ్యాలి. సమకాలీన సమాజంలో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు చర్చ జరిగాల్సిన అవసరాన్ని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. పార్టీని మరో 40 ఏళ్లపాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలపై ఈ మహానాడు వేదికగా చర్చించాలి. మార్పు అనేది శాశ్వతంగా ఉంటుందని నమ్మే పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశార.
ఆరుశాసనాలతో భవిష్యత్ ప్రణాళిక
అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మాభిమానం నినాదం నియంతృత్వాన్ని తరిమేసింది. చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం అనే నినాదం తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది పడింది. ఇప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తును అందించే లక్ష్యంతో సరికొత్త ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం వచ్చింది. ఇందుకోసం ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నాను.
1) తెలుగుజాతి విశ్వఖ్యాతి:
దేశం దేశంలో తెలుగుదేశం వల్లే తెలుగువారికి ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంది. ఒకనాడు అన్న ఎన్టీఆర్ ను బర్త్ రఫ్ చేస్తే డిల్లీ మెడలు వంచి మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అదీ తెలుగుజాతి పౌరుషం. తెలుగువారిని ప్రపంచ పటంలో పెట్టింది మన చంద్రన్న. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారు ప్రపంచంలో నెం. 1 స్థానంలో ఉండాలి. అన్నిరంగాల్లో మన తెలుగువారే ముందుండాలి. దీనినే అజెండాగా పెట్టుకొని మనం పనిచేయాలి.
2) యువగళం:
తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేయబోతున్నాం. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తాం, పనిచేసేవారిని ప్రోత్సహిస్తాం. గతప్రభుత్వం హెచ్ ఎస్ బిసి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అమర్ రాజా, జాకీ వంటి పరిశ్రమలను తరిమేసింది. మన ప్రభుత్వంలో టిసిఎస్, ఎల్ జి ఎలక్ట్రానిక్స్, ఎన్ టిపిసి, బిపిసిఎల్, రిలయన్స్ సిబిజి, ఆర్సెలార్ మిట్టల్ వంటి బడా కంపెనీలను తీసుకువచ్చాం. మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టులో జూన్ మాసంలో భర్తీచేస్తున్నాం. యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. మనరాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు ఇస్తే దూసుకుపోతారు. అన్నిరంగాల్లో వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే మన లక్ష్యం.
3) స్త్రీశక్తి: అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చింది మన చంద్రన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా మహిళలను అవమానించారు. సొంత తల్లిని, చెల్లిని మెడపట్టి రోడ్డుపైకి గెంటేశారు. ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ప్రవేశపెట్టింది తెలుగుదేశం. రానున్నరోజుల్లో మహిళలను మరింత బలోపతం చేసేందుకు స్త్రీ శక్తిద్వారా మనం కృషిచేయాలి. పార్టీ పదవుల దగ్గర్నుంచి అన్నిరంగాల్లో మహిళలకు సమాన బాధ్యత, భద్రత కల్పించాలి. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. చట్టాలు, శిక్షల వల్ల సమాజంలో మార్పురాదు. మార్పు మన ఇంటినుంచే మొదలు కావాలి. ఇప్పుడు కూడా కొన్ని పదాలు వాడుతున్నారు. గాజులు తొడ్డుకున్నావా, చీరకట్టుకున్నావా, ఆడపిల్లలా ఏడవొద్దు లాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. మనం ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మహిళా మంత్రి నాకు చీర, గాజులు పంపిస్తా అన్నారు. అవి పంపిస్తే నా అక్కచెల్లెమ్మలకు కానుకగా ఇచ్చి కాళ్లు మొక్కుతానని చెప్పాను.
4) పేదల సేవలో – సోషల్ రీఇంజనీరింగ్: పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలీచాలని పెన్షన్ 5రెట్లు పెంచి 200 నుంచి 1000 రూపాయలు చేసింది, వెయ్యి నుంచి 2వేలు చేసింది మన చంద్రబాబు గారు. ఇప్పుడు దేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 4వేల రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలేదు. మన నాయకుడు సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బాబు సూపర్ – 6 హామీని అమలుచేసే దిశగా ముందుకు సాగుతున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మెగా డిఎస్సీ ప్రకటించాం.
జూన్ లో తల్లికి వందనం
వచ్చేనెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తాం. ఇప్పుడు పి-4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలను బయటకు తీసుకురావడానికి చేయూతనందిస్తున్నారు మన చంద్రన్న. టిడిపి ఆవిర్భావం తర్వాత బడుగు, బలహీనవర్గాలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 33శాతం రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అందరి ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కుటుంబాలకు సామాజిక సమన్యాయం అందుకే ప్రతివారికి న్యాయం చేసేలా సోషల్ రీఇంజనీరింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
5) అన్నదాతకు అండగా: రైతు లేకపోతే సమాజమే లేదు. ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్మింది టీడీపీ మాత్రమే. ఎన్టీఆర్ మన సీఎం చంద్రబాబు వరకు రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషిచేశాం. డ్రిప్ ఇరిగేషన్ నుంచి నీటిపారుదల ప్రాజెక్టులు, సబ్సిడీలు ఇవ్వడమేగాక ఉద్యాన పంటలను ప్రోత్సహించాం. ఆక్వా, పామాయిల్, కోకోలో నెం.1, మామిడి, జీడిపంటల్లో నెం.2 స్థానాల్లో ఉన్నాం. దీనికి కారణం టీడీపీ పాలన వల్లే సాధ్యమైంది. పొగాకు, కోకో, మిర్చి ధరలు పడిపోతే మద్దతు ధర ఇచ్చి ఆదుకుంది సీఎం చంద్రబాబు. బంగారం లాంటి భూములు రాష్ట్రంలో ఉన్నాయి. చేయూత అందిస్తే రైతులు బంగారం పండిస్తారు. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని అమలుచేయాలి.
అంజిరెడ్డి తాత స్ఫూర్తి
6) కార్యకర్తే అధినేత: ఒక అంజిరెడ్డి తాత (పుంగనూరు), ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య నాకు స్పూర్తి.
పుంగనూరులో అంజిరెడ్డి తాత తొడగొట్టి మీసాలు మెలేసి నామినేషన్ వేసి చూపించారు. ప్రత్యర్థుల దాడిలో రక్తం కారుతున్న భయపడకుండా బూత్ లో నిలబడింది మన అక్క మంజుల. తోట చంద్రయ్య గురించి ఎంత చెప్పినా తక్కువ. నడివీధిలో కత్తి గొంతుపై పెట్టి ఒక్కసారి వారి నాయకుడికి జై చెప్పమంటే... జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడు చంద్రయ్య. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చాం. అటువంటి కరుడుగట్టిన కార్యకర్తలే మన బలం, బలగం.
దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా కోటిమంది కుటుంబసభ్యులు మనకి ఉన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. కార్యకర్త చెమట వల్లే ఈనాడు మేం ఇక్కడ కూర్చున్నాం. ఆనాడు మీరు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రజల్లోకి తీసుకెళ్లారు. శంఖారావం చేయాలని అంటే మీరంతా ముందుకు వచ్చారు. కార్యకర్తలు నాయకులు చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగండి, పార్టీనే మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలను ఆదుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలకు 5లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. కార్యకర్తకు కష్టమొస్తే మొదట స్పందించేది తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు అండగా నిలబడింది తెలుగుదేశం. అనంతపురంలో ఫ్యాక్షన్ లో చనిపోయిన కార్యకర్తల కుటుంబసభ్యులు అటువైపు వెళ్లకూడదని చంద్రబాబుగారు ఎన్టీఆర్ మోడల్ స్కూలు ఏర్పాటుచేశారు. వారికి తండ్రిగా నిలబడటం నా బాధ్యత అని చెప్పారు. యువగళం పాదయాత్రలో వారి కష్టాలు నేరుగా చూశాను. చంద్రబాబు సాయాన్ని ఆ పిల్లలు ఇప్పటికీ మర్చిపోవడం లేదు. అలాంటి కార్యకర్తలను ఆదుకోవడానికి, వారు సొంత కాళ్లపై నిలబడేందుకు పార్టీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఆరు శాసనాలు కీలకమైనవి. నా తెలుగు కుటుంబం సాక్షిగా ఈ మహానాడు వేదికపై ఆరుశాసనాలను ప్రతిపాదిస్తున్నాను, ఈ ఆరుశాసనాలను బలపర్చాల్సిందిగా యువనేత లోకేష్ కోరారు.

Similar News