టీడీపీ బలోపేతమవ్వాలంటే లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి
లోకేష్ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలన్నది ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమని మంత్రి పయ్యావు కేశవ్ అన్నారు.;
By : The Federal
Update: 2025-05-28 11:17 GMT
తెలుగుదేశం పార్టీ రాజకీయాలే కాదు.. మహానాడు సమావేశాలు కూడా మంత్రి నారా లోకేష్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ క్రమంలో లోకేష్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తెరపైకొచ్చింది. దీనిపై టీడీపీ శ్రేణుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అంశం కడపలో జరుగుతున్న మహానాడులో ప్రత్యేక చర్చగా మారింది.
ఇదే అంశంపై టీడీపీ సీనియర్ నాయకుడు మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సమర్థించారు. లోకేష్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమని పేర్కొన్నారు. ఇది సహేతుకమనై నిర్ణయమని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ మరింతగా బలపడాలంటే లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది సముచితమని అభిప్రాయపడ్డారు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కావలన్నది టీడీపీలో ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారని, నీడ్ ఆఫ్ ది అవర్ అని పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు.
తెలుగుదేశం పార్టీలో మేమంతా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామన్నా, కష్టపడగలుగుతున్నామంటే.. తెలుగుదేశం పార్టీ అంటే మాది అని ఓన్ చేసుకుంటున్నాం గనుకనే ఇది సాధ్యమవుతుంది. టీడీపీలో చంద్రబాబు ఆ మాత్రం మాకు స్వేచ్ఛనిచ్చారు. అందుకేమేము మా వాయిస్‌ను వినిపించగలుగుతున్నాం. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనే ఆశ, డిమాండ్ టీడీపీలోని అన్ని వర్గాల శ్రేణుల నుంచి ఉందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఇదే డిమాండ్‌ను పార్టీ కూడా పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం పార్టీ తీసుకుంటుందన్నారు. నారా లోకేష్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనే అంశాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని, ఆ బాధ్యత కూడా తమపై ఉందన్నారు. పార్టీ నేతలతో దీనిపై చర్చించి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
మరో వైపు లోకేష్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ.. లోకేష్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు ధూళిపాళ్ల నరేంద్ర ప్రతిపాదించారు. ఈ అంశంపై గుంటూరు మినీ మహానాడులో చర్చించి తీర్మానం చేసినట్లు ధూళిపాళ్ల నరేంద్ర సీఎం చంద్రబాబుకు తెలిపారు.