లిక్కర్ స్కాం .. 11 కోట్లు ..ఎవరీ వరుణ్ పురుషోత్తం?

నగదు డంప్ గుట్టు విప్పి మద్యం స్కాం దర్యాప్తు తీరునే మార్చిన వరుణ్;

Update: 2025-07-30 14:20 GMT

ఏపీ రాజకీయాలను వేడెక్కించిన లిక్కర్ స్కాం లో నేరుగా ఇప్పుడు 11కోట్ల డంప్ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులకు దొరకడం పెను సంచలనంగా మారింది.మద్యం ముడుపులతో దాచిన డబ్బంటూ హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ఏసీబీ అధికారులు పెట్టెలలో స్వాధీనం చేసుకున్నారు.ఇంత డబ్బు అక్కడ వుందని ఏసీబీ అధికారులకు చెప్పింది వరుణ్ పురుషోత్తం.ఈ కేసు నిందితులలో నెంబర్ 40 గా వున్న వరుణ్ ,దుబాయ్ నుంచి దిగి , ఏసీబీ ముందు గుట్టు విప్పేశాడు.అదే ఇప్పుడు హైలెట్ గా మారగా అసలు ఎవరీ వరుణ్ పురుషోత్తం ,ఈ కేసులోకి ఎలా వచ్చాడు అని అందరూ ఆరా తీస్తున్నారు.

కాఫీ షాపులో చిరుద్యోగి నుంచి వందల కోట్లు దాచే దాకా..
ఏపీ మద్యం కుంభకోణంలో 40 వ నిందితునిగా వున్న వరుణ్ పురుషోత్తం ఇప్పుడు వార్తలలో వ్యక్తి అయితే , ఒకప్పుడు సికింద్రాబాద్ లో ఓ కాఫీ షాపులో చిన్న ఉద్యోగి.ఇంజనీరింగ్ చదివిన వరుణ్ , కాఫీ షాపులో 32 వేల జీతం తో పనిచేస్తుండేవాడు. ప్రవాసాంధ్రుని ద్వారా రాజ్ కసిరెడ్డి బృందానికి టచ్‌లోకి వచ్చాడు. అంతే అతడిని మద్యం కుంభకోణం ఉచ్చులోకి దింపేశారు.తమిళనాడులోని ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లను రాజ్‌ కెసిరెడ్డి బెదిరించి ,వారి అనుబంధ సంస్థ లీలా డిస్టిలరీస్‌ను రాజ్ తనగుప్పెట్లోకి తెచ్చుకున్నట్లు ఆరోపణ. లీలా డిస్టిలరీస్‌ కు ఏపీ మద్యం వ్యాపారంలో ఆథరైజేషన్‌ ఇప్పించిన, రాజ్ కసిరెడ్డి ఆ కంపెనీకి ఏపీ ఆపరేషన్స్‌ హెడ్‌గా వరుణ్ ను నియమించారు.
2020 జూన్‌ నుంచి 2024 మార్చి మధ్య 21 నెలల్లో బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఈ సంస్థ ఖాతాలో ఏకంగా రూ.459 కోట్లు జమ చేసింది. లీలా డిస్టిలరీస్‌ ఆపరేషన్స్ హెడ్ గా వరుణ్ పేరుతో బ్యాంకు ఖాతా తెరిపించి, రూ.10కోట్ల వరకు చెక్‌ పవర్‌ కల్పించారు.ఆ సొమ్మంతా వేరు వేరు డొల్ల కంపెనీల ఖాతాలలోకి చేరవేసినట్లు సీఐడీ దర్యాప్తులో గుర్తించారు.లీలా డిస్టిలరీస్‌ నుంచి లీలాస్‌ బ్రిలియెంట్‌ బ్లెండ్‌ సుపీరియర్‌ గ్రెయిన్‌ విస్కీ, బ్రిటిష్‌ ఎంపైర్‌ ప్రీమియం మెచ్యుర్డ్‌ బ్రాండ్లు ఏపీలో తయారు చేయించారు.దర్యాప్తులో దీనికి సంబంధించి పక్కా ఆధారాలు లభించడంతో సిట్‌ అధికారులు వరుణ్‌ను నిందితుడిగా చేర్చారు.అయితే ఇంతలోనే వరుణ్ విదేశాలకు పారిపోయాడు.ఇప్పుడు సీఐడి వరుణ్ పై లుకౌట్ నోటీసులు , అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. దాంతో మంగళవారం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న వరుణ్‌ను శంషాబాద్‌ విమానాశ్రయంలో సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకుని ,విచారించారు. వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఫాం హౌస్ లో ఏకంగా 11 కోట్ల రూపాయలు అట్ట పెట్టెలలో స్వాధీనం చేసుకున్నారు.ఇంకెక్కెక్కడ డబ్బు దాచారన్న విషయాన్ని వరుణ్ వెల్లడిస్తే ఇంకెంత సొమ్ము దొరుకు తుందో చూడాలి.మొత్తంమీద వరుణ్ వాగ్మూలం లిక్కర్ స్కాం నిందితులకు మరంత దడ పుట్టిస్తోంది.
Tags:    

Similar News