రేపు శ్రీవారి గరుడోత్సవం.. సమన్వయంతో సఫలం చేద్దాం..
టీటీడీ ఉద్యోగులు, పోలీసులు, శ్రీవారి సేవకులకు తిరుపతి జేఈఓ సూచనలు
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-27 14:09 GMT
తిరుమలలో ఆదివారం రాత్రి జరిగే గరుడోత్సవంపై టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. లక్షల సంఖ్యలో వచ్చే యాత్రికులకు సేవలు అందించడానికి వీలుగా ఉద్యోగులతో పాటు పోెలీసులు, శ్రీవారి సేవకులను సన్నద్ధం చేస్తోంది.
తిరుమలలో యాత్రికులకు మెరుగైన సేవలు అందివ్వడానికి టీటీడీ ఉద్యోగులు, పోలీసులు, శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని తిరుపతి జేఈఓ వీరబ్రంహ్మం సూచనలు చేశారు.
తిరుమలలో శనివారం సాయంత్రం ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన సమన్యయ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడారు.
"శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత ప్రముఖమైన గరుడసేవకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ప్రత్యేక విధులకు వచ్చిన ఉద్యోగులు సమష్టిగా పనిచేయండి" అని బాధ్యతలు గుర్తు చేశారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో శనివారం సాయంత్రం ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో సమన్వయ సమావేశం జరిగింది.
టీటీడీ తిరుపతి జేఈవో వీరబ్రంహ్మం మాట్లాడుతూ, తిరుమల నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తుల సౌకర్యార్థం ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు సమన్వయం చేసుకుని తిరుమలలోని గ్యాలరీలలోను, జౌట్ సైడ్ క్యూలు, వీక్యూసీ -2 క్యూలైన్లు, బయట ప్రాంతాలలో ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు తదితరాలు అందేలా ముందస్తుగా నిల్వ ఉంచుకుని ప్రణాళిక బద్ధంగా పంపిణీ చేయాలని సూచించారు.
కమాండ్ కంట్రోల్ ఉంది..
తిరుమలలో ఉద్యోగులకు భారంగా మారితే వెంటనే కమాండ్ కంట్రోెల్ కేంద్రాన్ని అప్రమత్తం చేయాలని జేఈఓ వీరబ్రహ్మం సూచించారు. ప్రత్యేక విధులలో భాగంగా తిరుమలలో సేవలు అందించేందుకు వచ్చిన ప్రతి ఉద్యోగి తమకు కేటాయించిన విధులను బాధ్యాతాయుతంగా నిర్వర్తించాలని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్నప్రసాదాలు, త్రాగునీటి కొరత, భక్తులకు అనుకోకుండా ఆరోగ్య సమస్యలు, విద్యుత్ సమస్యలు తలెత్తితే తక్షణం నివారించేందుకు సంబంధిత సదరు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివారం ఉదయం నుండి గ్యాలరీలలోని భక్తులకు తాగునీరు, పాలు, అల్పాహారం అందించేంచుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
టీటీడీ సివిఎస్ఓ ( Chief Vigilance and Security Officer CVSO ) కే.వి. మురళీకృష్ణ మాట్లాడుతూ, వాహన సేవలు పూర్తయిన వెంటనే ఎలాంటి అవాంతరాలు లేకుండా భక్తులను బయటకు పంపేందుకు ప్రణాళిక బద్ధంగా ప్రతి వీధికి ఒక అధికారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను తరలించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులు కమాండ్ కంట్రోల్‌ను సంప్రదించి సమస్యను తెలియజేయాలని కోరారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ..
గ్యాలరీలలోనూ, నాలుగు మాడ వీధులలో హారతి పాయింట్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సూచించారు. గ్యాలరీలలోని ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు అందేలా ఉద్యోగులు, పోలీసులు, శ్రీవారి సేవకులు సమన్వయంతో సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో సీఈ టి.వి.సత్యనారాయణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, అన్నప్రసాదం ప్రత్యేక అధికారి జీ.ఎ.ల్ఎన్.శాస్త్రి తదితర అధికారులు, సెక్టోరల్ అధికారులు, సీనియర్ అధికారులు, ఇన్‌ఛార్జ్ అధికారులు, డిప్యుటేషన్ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.