నేతల మాటలే మంత్రాలు.!
మాటల్లో గాంభీర్యం. అంతకుమించిన ధైర్యం. వైయస్సార్సీపి శ్రేణుల ధీమా. విశాఖలో ముందస్తుగా హోటల్లో గదులు రిజర్వ్.. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరిని ముంచుతుందో..
"తొడగొట్టి చెబుతున్నా. మళ్లీ ప్రభుత్వం మాదే. చంద్రబాబు నాయుడే సీఎం" 2019 మే 23: విజయవాడ పార్టీ ఆఫీసులో పోలింగ్ ముగిసిన తరువాత టిడిపి నేత బుద్దా వెంకన్న చేసిన సవాల్ ఇది.
ఎన్నికల ఫలితాల్లో టిడిపి ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు అదే కార్యాలయంలో బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. తొడగొట్టిన అంశాన్ని వివరిస్తూ.. "అవునండీ, పార్టీ శ్రేణుల్లో ధైర్యం పోకూడదు. అందుకే తొడగొట్టి చెప్పా" అని నవ్వుతూ వాస్తవాన్ని అంగీకరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 151 సీట్లు, 25 పార్లమెంటు సీట్లలో 23 పార్లమెంటు సీట్లను వైఎస్ఆర్సీపీ దక్కించుకుంది. ఈ ఫలితాలకు కారణం నవరత్న పథకాలు, డాక్టర్ వైఎస్సార్ చనిపోయిన తర్వాత వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై వేధింపులు వంటి అంశాలు సానుభూతి పవనాలుగా మారాయి.
అంతకుముందు రాష్ట్ర విభజన తర్వాత..
2014లో తర్వాత ఏర్పడిన టిడిపి ప్రభుత్వంలో ఇచ్చిన హామీల్లో "నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం. నీరు చెట్టులో అవినీతి. రాజ్యాంగేతర శక్తిగా పనిచేసిన జన్మభూమి కమిటీలు. టిడిపి మద్దతుదారులకు మినహా ఇతరులకు పథకాలు అందివ్వలేకపోవడం" వంటి అంశాలు వైఎస్ఆర్సిపికి అనుకూల అంశాలుగా కలిసొచ్చాయి.
2024: సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టీడీపీ కూటమికి సవాల్‌గా నిలిచాయి. పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకమా? ప్రతిపక్ష కూటమికి లాభదాయకమా? ఐ ప్యాక్ టీం సభ్యులతో భేటీ అయిన సందర్భంగా " ఈసారి బలంగా దెబ్బ కొట్టబోతున్నాం. 23 ఎంపీ స్థానాలు, గతం కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతున్నాం" అని సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ఆ పార్టీ శ్రేణులో ఉత్సాహం నింపడమే కాదు. మితిమీరిన లెక్కలు చెబుతున్నారు. ఏకంగా విశాఖపట్నంలో 9వ తేదీ ప్రమాణస్వీకారం కూడా చేయనున్నట్లు అన్ని శ్రేణుల నాయకులు పోటీపడి ప్రకటిస్తున్నారు.
పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపునకు దాదాపు 23 రోజుల గడువు రావడంతో, వారి అంచనాలు, లెక్కలకు అర్థాలే మారిపోతున్నాయి. మానసికంగా ధైర్యం నింపడానికి ఈ ఎత్తుగడ మాటలు చెబుతున్నారా? ఏ అంచనాలతో చెబుతున్నారనేది చర్చనీయాంశమైంది. కొందరు సెఫాలజిస్టుల విశ్లేషణ, కొన్ని జాతీయ మీడియా సంస్థల సర్వేలు అన్ని పార్టీల వారిని తికమక పెట్టిస్తుంటే, ఇవి కాస్త జోరుగా బెట్టింగ్ కాయడానికి కూడా పరీక్షంగా తోడ్పడుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా,
ఆసక్తికరమైన ట్వీట్..
టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడును ఉద్దేశించి.. వైయస్ఆర్సీపీలో నంబర్-2 స్థాయిలో ఉన్న, నెల్లూరు ఎంపీగా పోటీచేసిన విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. " 2014లో మా పార్టీ నుంచి గెలిచిన వారిలో 23 మందిని కొనుగోలు చేశావు. 2019 మే 23వ తేదీ జరిగిన కౌంటింగ్‌లో మీకు దక్కింది 23 సీట్లు. ప్రస్తుత ఎన్నికలు వచ్చేనాటికి మా పార్టీ నుంచి నలుగురిని కొనుక్కున్నావు. జూన్ నెల నాలుగో తేదీ జరిగే కౌంటింగ్ లో టిడిపికి నాలుగు సీట్లు దక్కుతాయి" అని యాదృచ్ఛికంగా కలిసొచ్చిన తేదీలను విజయసాయిరెడ్డి ఉదహరించారు. అంటే వైఎస్ఆర్సిపి మళ్లీ అధికారంలోకి వస్తోందని ఆయన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. ఆ పార్టీ శ్రేణుల్లో ఇది దిగుణీకృతమైన ధైర్యం పెంచింది. మళ్లీ అధికారంలోకి రావడానికి కలిసి వచ్చిన అంశాలు ఏంటి అనేది మాత్రం ఆయన ప్రస్తావించలేదు.
వారి ధీమా... విశ్లేషణ తీరు..
" నగదు బదిలీ పథకం. అమ్మఒడి, ఆటోలు, లాయర్లు, ఒంటరి మహిళలు, ఆసరా, విద్యా దీవెన తదితర పథకాలతో లబ్ధి పొందిన వారు మా వెంటే ఉన్నారు" అని వైయస్సార్సీపి బలంగా విశ్వసిస్తున్నది. సంక్షేమ పథకాలు తమ పార్టీకి లభిస్తాయని భావిస్తోంది.
రెండో అంశం:
బిజెపితో టిడిపి కలవడం వల్ల ముస్లిం మైనారిటీ వర్గాలు వారికి దూరమయ్యారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటర్లుగా ఉన్న దళితులు, ముస్లింల ఓటు బ్యాంకు కలిసి వచ్చింది. అని బలంగా నమ్ముతున్నారు. ఈ విషయాన్ని ఆర్ఆర్ మీడియా సెఫాలజిస్ట్ మస్తాన్ కూడా పదేపదే ఉటంకించారు.
సైలెంట్ ఓట్:
ముస్లింలు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న పార్లమెంటులో "ఎన్ఆర్సి, సిఐఏ, త్రిపుల్ తలాక్" చట్టాలుగా మారడానికి వైఎస్ఆర్సిపి ఓటు పనిచేసింది. లోక్‌సభలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్యసభలో వేనంబాకం విజయసాయిరెడ్డి మద్దతుగా మాట్లాడారు. ఈ విషయం ముస్లింలు పట్టించుకోలేదని వారు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ విషయంలో 60 ఒక్క నియోజకవర్గాల్లో శాసించే స్థాయిలో ఉన్న "ముస్లిం ఓటర్లు అధిక స్థానాల్లో క్రాస్ ఓటింగ్ వేశారు" సైలెంట్‌గా పని చేసిన వీరి వ్యవహారం విశ్లేషకులు, అధికార పార్టీ నాయకులు గమనించినట్లు లేదు అన్నట్లు కనిపిస్తోంది.
ఏకపక్షంగా సర్వీస్ ఓట్లు..?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ, పట్టణాల్లో డివిజన్ సచివాలయ సిబ్బంది 5,39,389 పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 1.50 లక్షల ఓట్లు పోల్ అయితే అందులో 50వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈసారి ఎన్నికల్లో ఉద్యోగులు ఓటుతో పోటెత్తారు. అందుకు ప్రధాన కారణాలు.. "వారిలో పిఆర్సి లో అన్యాయం. భావ ప్రకటన స్వేచ్ఛకు వీలులేని విధంగా నిరసన ప్రదర్శనను ఉక్కుపాదంతో అణిచివేయడం. గృహనిర్బంధాలు. ముందస్తు నోటీసులతో కట్టడి చేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది ఆగ్రహంతో ఉన్నది పసిగట్ట లేకపోయారు. వారి సర్వీసుల క్రమబద్దీకరణలో జరిగిన జాప్యం, పిఆర్సి అమలులో అన్యాయం" వంటి కారణాలు బలంగా పని చేశాయని భావిస్తున్నారు.
ఈ అంశంపై సిపిఎం చిత్తూరు జిల్లా నేత, సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు. "ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే వచ్చింది అని ఉద్యోగులు కసిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు" అని అభిప్రాయపడ్డారు. భావప్రకటన స్వేచ్ఛను వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేసింది. "నిరసనలకు దిగితే ఉద్యోగులు, టీచర్లను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మారువేషాల్లో వెళ్లాల్సిన దుస్థితి కల్పించారు.
అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, కాంట్రాక్టు సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారిని రోడ్డుపైకి రానివ్వలేదు. ఆ వర్గాల్లో ఏ సంఘంతో అయినా చర్చల ద్వారా సామరస్య పూర్వకంగా సమస్య పరిష్కరించిన దాఖలాలు ఉన్నాయా? " అని కందారపు మురళి ప్రశ్నించారు. " వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది ఓటింగ్ చేసిన తీరు ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు" అని మురళి విశ్లేషించారు.
ఇదే విషయంపై వైఎస్ఆర్సిపి చిత్తూరు పార్లమెంటు మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు గాయత్రీ దేవి ఏమంటున్నారంటే.. " మొదట లెక్కించే సర్వీస్ ఓట్లలో మెజారిటీ ఉండవచ్చు. ఆ తర్వాత ప్రారంభమయ్యే రెండో రౌండ్ నుంచి ఫ్యాన్ జోరు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేము" అని ధీమాగా చెబుతున్నారు. ‘‘సాధారణ, మధ్యతరగతి, విద్యావంతులు వైఎస్సార్సీపీకి అండగా ఉన్నారు అనే విషయం గ్రహించడంలో చాలామంది పప్పులో కాలు వేస్తున్నారు" అని గాయత్రిదేవి అంటున్నారు.
మాటల్లో ధైర్యం.. ఫిర్యాదులతో దైన్యం
ప్రస్తుత ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ధైర్య వచనాలు చెప్పారు. అలాగే, పార్టీలోని కీలక నాయకులు, ప్రజాప్రతినిధులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో సహా ద్వితీయశ్రేణి లోని నేతలందరూ ఒకే మాట చెబుతున్నారు. " జూన్ 9వ తేదీ విశాఖ వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు" అని ముక్తకంఠంతో అంటున్నారు. కొన్ని చోట్ల మినహా, రాష్ట్రంలో దాదాపు ప్రశాంతంగా జరిగిన పోలింగ్ ద్వారా 81 శాతం అత్యధికంగా నమోదయింది.
అయితే, సీఎం వైఎస్. జగన్ సహా ఆయన మంత్రివర్గ సహచరులు అందరు ఇంకా పదవుల్లోనే ఉన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారి అధికారాల్లో కొంత ఆంక్షలు ఉండవచ్చు. అయితే గడిచిన ఐదేళ్ల కాలంలో వారు నియమించుకున్న అధికారుల్లో వేళ్ళపై లెక్కించే స్థాయిలో బ్యూరోక్రాట్స్, వివిధ శాఖల సిబ్బంది మాత్రమే ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురయ్యారు. మిగతా వారిలో సగం వంతు విధేయులు, అభిమానులే కావడం గమనార్హం. కానీ, మళ్లీ ప్రభుత్వం మాదే వస్తుందని బలంగా చెబుతున్న ఆ నాయకులే.. "అనేకచోట్ల పోలీస్, ఇతర శాఖల అధికారులు టిడిపికి అనుకూలంగా పనిచేశారు" అని ఫిర్యాదులు చేయడం. ఆరోపణల వెనక డొల్లతనం కూడా కనిపిస్తోంది. అంటే, అధికారంలోకి వస్తుందని చెబుతున్న నేతలే.. అపనమ్మకంతో కూడిన వ్యాఖ్యలు చేయడం వెనుక అంతరార్థం ఏమిటి అనేది బోధపడని స్థితిలో చాలామంది జుట్టు పీక్కుంటున్నారు.
గదులు ఖాళీ లేవంట..
సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి జూన్ 9వ తేదీ విశాఖపట్నం వేదికగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయనున్నారని వైఎస్ఆర్సిపి నాయకులు ఘంటాపథంగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిద్దామని ఫెడరల్ ప్రతినిధి విశాఖపట్నంలోని అనేక హోటళ్లలో గదుల అందుబాటు కోసం ప్రయత్నం చేయగా, పేరెన్నిక గన్న స్టార్ హోటల్లో గదులు ఖాళీ లేవని సమాధానం వచ్చింది. స్టార్ హోటళ్లలో దాదాపు పది శాతం గదులు ఈపాటికి ముందస్తుగా బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకొన్ని హోటళ్లలో చాలావరకు గదులు ఖాళీగానే ఉన్నట్లు స్పష్టమైంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారే కాకుండా, విదేశాల్లో ఉన్న వైఎస్. జగన్ అభిమానులు విశాఖ రావడానికి ముందస్తు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో విశాఖలో హోటల్లో గదుల అద్దె పెంచడంతోపాటు ప్రైవేటు బస్సులు కూడా చార్జీలు పెంచారని సమాచారం. అంతేకాకుండా విశాఖ వెళ్లడానికి ముందస్తుగా వాహనాలను కూడా బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ ప్రధాన కారణం వైఎస్ఆర్సిపి ప్రధాన నాయకులు చేస్తున్న ప్రకటనలే అనడంలో సందేహం లేదు. దీనివల్ల వారి వ్యయప్రయాసలు వృధా అవుతాయో?! సాకారం అవుతాయో? వేచిచూడాలి. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరిని ఒడ్డుకు చేరుస్తుంది.. ఎవరి ఆశలు గల్లంతు అవుతాయనేది తేలాలంటే... జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండక తప్పదు.