పొట్టి శ్రీరాములు పాడి మోసేందుకు నలుగురు రాకపోవడం కలిచివేసింది

పొట్టి శ్రీరాములు ఒక కులానికి కాదు.. దేశం గర్వించ దగిన గొప్ప నాయకుడని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.;

By :  Admin
Update: 2024-12-15 11:12 GMT

పొట్టి శ్రీరాములు మరణించినప్పుడు, ఆయన మృత దేహాన్ని మోసేందుకు నలుగురు రాకపోవడం తనను కలచి వేసిందని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ రోజు మనమంతా తెలుగు వాళ్లమని ఈ రోజు గర్వంగా చెబుతున్నామంటే అది పొట్టి శ్రీరాములు చేసిన త్యాగ ఫలితమే అని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్థంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ కుటుంబం కన్నా.. సమాజం ముఖ్యం అనుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. పొట్టి శ్రీరాములు గొప్పతనం గురించి మాకు సీఎం చంద్రబాబు చెప్పి స్పూర్తిని కలిగించారని అన్నారు.

తనకు ఈ పదవి వచ్చిందన్నా.. తెలుగు వాళ్లన్నా దానికి పొట్టి శ్రీరాములు త్యాగమే కారణమన్నారు. మదరాసీలు కాదు.. నేను తెలుగు వాడిని అని గర్వంగా ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. మనుషులకు మతి మరుపు సహజమని, మతి మరుపు కొనసాగితే తల్లిని కూడా మర్చి పోతామని, ఇలాంటి క్రమాలను నిర్వహించుకోవడం వల్ల మహనీయులను గుర్తు చేసుకుంటామని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పొట్టి శ్రీరాములు గొప్పతనం తనకు అర్థమైందన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వెతకాలంటే ఆర్య వైశ్య సమాజంలోనే దొరికేదని, పొట్టి శ్రీరాములు ఒక కులానికి కాదని, దేశం గర్వించే నాయకుడని అన్నారు. పార్టీని పెట్టి దానిని నడపడం ఎంత కష్టమో తనకు తెలుసని, పాలసీలు రూపొందించి అమలు చేయడం కష్టమని, కానీ చంద్రబాబు మాదిరిగా పార్టీని నడపడం, ప్రజలకు చేరువ చేయడం గొప్ప విషయమని మరో సారి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. 

Tags:    

Similar News