కుప్పం: సీఎం కొత్త ఇంటిలో పాలు బాగా పొంగాయి..
సీఎం గృహప్రవేశం కుప్పంకు పండుగ తెచ్చింది. చంద్రబాబు కోడలు బ్రహ్మణి పూజలతో కార్యక్రమాలు నిర్వహించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-25 05:38 GMT
కుప్పంలో సీఎం చంద్రబాబు ఓ ఇంటి వారయ్యారు.. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం గ్రామం వద్ద సుమారు రెండు ఎకరాల్లో కొత్త ఇంటి నిర్మాణం చేశారు. ఆదివారం ఉదయం నుంచి కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీఎం నారా చంద్రబాబు, భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, ఈయన భార్య నారా బ్రాహ్మణితో కలిసి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేకువజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య శుభ ముహూర్తంలో పూజలు నిర్వహించారు.
కుప్పంలో నిర్మించిన గృహప్రవేశం కోసం సీఎం చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రహ్మణి తో కలిసి శనివారం రాత్రి విజయవాడ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారంతా రోడ్డు మార్గంలో కుప్పంకు వచ్చారు.
ఆదివారం వేకువజామున దేవతామూర్తుల చిత్రపటాలతో కొత్త ఇంటిలోకి పాదం మోపిన వారంతా, కోడలు నారా బ్రహ్మణి వంటగదిలో గ్యాస్ స్టౌపై పాలు పొంగించడం ద్వారా నూతన గృహప్రవేశ కార్యక్రమం పూర్తి చేశారు.
గృహప్రవేశానికి అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొత్త ఇంటిలో సీఎం చంద్రబాబు కోడలు, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అన్ని కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా, వారి కులదైవం వెంకటేశ్వర స్వామి వారికి పూజలతో కార్యక్రమాలు నిర్వహించారు.
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో నిర్మించిన కొత్త ఇంటిలోకి చేరడానికి ఆదివారం ఉదయం 10 గంటలకు శుభముహూర్తంగా పండితులు నిర్ణయించారు. అంతకుముందే ఇంటి ఆవరణతో పాటు లోపలకు కూడా సుందరంగా అలంకరించారు.
ఆదివారం ఉదయం సీఎం నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, వారి కొడుకు నారా లోకేష్, బ్రాహ్మణితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలు చేత పట్టుకొని మొదట ఇంటిలోకి ప్రవేశించారు. వేదమంత్రాలు ఆ ఇంటిలో ప్రతిధ్వనిస్తుండగా, ప్రత్యేక పీఠంపై ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి తో పాటు పరివార దేవతల విగ్రహాలను ఆశీనులను చేశారు. ఆ తర్వాత కొత్త ఇంటిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కి పూజలు చేస్తూ గృహప్రవేశానికి శ్రీకారం చుట్టారు. పూజలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు సాగుతుండగా భార్య నారా భువనేశ్వరి తో కలిసి సీఎం నారా చంద్రబాబు, నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో కలిసి పూజలో కూర్చున్నారు.
హిందూ సాంప్రదాయంలో నూతన గృహప్రవేశం చేశాక, గోవులను ఇంటిలో తిప్పడం అనేది శుభ సూచకంగా భావిస్తారు. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు తన భార్య భువనేశ్వరి తో కలిసి నిర్వహించారు. గో పూజ చేసిన తర్వాత కొత్త ఇంటిలో వాటిని నడిపించారు.
నూతన గృహప్రవేశం సందర్భంగా పరిమిత సంఖ్యలోనే నాయకులను లోనికి అనుమతించారు.
కుప్పంలో పార్టీ శ్రేణులను, నాయకులను సీఎం చంద్రబాబు కొత్త ఇంటికి వెలుపలే నియంత్రించారు. దీంతో కడపల్లె సమీప ప్రాంతాల్లో సందడి నెలకొన్నది.
కుప్పంలో పండుగ
సీఎం ఎన్ చంద్రబాబు నూతన గృహప్రవేశం కుప్పం ప్రాంతానికి కొత్త పండుగ తీసుకువచ్చింది. కొత్త ఇంటి వద్ద 25 వేల మందికి విందు ఏర్పాటు చేశారు. అంతకుముందు మా గృహ ప్రవేశానికి రండి అని సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల పేరు మీద నియోజవకర్గంలోని అన్ని గ్రామాల్లో ఆహ్వాన పత్రికలు అందించారు.
నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో కూడా ఇదే సందడి కనిపించింది.
"దీనికోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం" టిడిపి సీనియర్ నాయకుడు గౌనివారి శ్రీనివాసులు మీడియాకు చెప్పారు. మండల కేంద్రాలనే కాకుండా పల్లెల్లో కూడా పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించడానికి ముందుగానే కార్యక్రమాలు సిద్ధం చేసినట్లు చెప్పారు.
కుప్పం తో విడదీయలేని బంధం
సీఎం చంద్రబాబు స్వతహాగా పుట్టింది చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లె. అయినా, కుప్పం తన కేరాఫ్ అడ్రస్ గా మార్చుకున్నారు. అనడం కంటే, ఆ ప్రాంత ప్రజలలో ఒకరుగా మారారు. కుప్పం నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబును గెలిపించడం ద్వారా ఆ ప్రాంత ప్రజలు ఎంతగా అభిమానిస్తున్నారనే విషయం స్పష్టం అవుతుంది. ఈ పరిస్థితుల్లో...
కుప్పం లో కనీసం సీఎం చంద్రబాబుకు సొంత ఇల్లు కూడా లేదు అనే విమర్శలు తెరమీదకి తీసుకువచ్చింది. దీనికంటే ముందే సీఎం చంద్రబాబు శాంతిపురం మండలం కడపల్లి వద్ద మూడేళ్ల కిందటే కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైసిపి అధికారంలో ఉండగా అనుమతుల వ్యవహారంలో కొంత ఇబ్బందులు తలెత్తాయి అనేది టిడిపి నాయకులు చెబుతున్న మాట. అన్ని లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత ఎట్టకేలకు సీఎం చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు ఏర్పడింది. దీనివల్ల ఇక తమ పార్టీ అధినేతపై విమర్శలు చేసేందుకు ఆస్కారం లేకుండా చేశారు అని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.