Kuppam Nature Farming | ఆహార ఔషధ క్షేత్రంగా.. కుప్పం ప్రయోగశాల

ప్రకృతి సేద్యంలో కుప్పం దేశానికి ఆదర్శంగా నిలవాలి. వ్యవసాయమే ఫార్మసీ. ఆహారమే మందులుగా వాడే రోజులు తెస్తామని స్వర్ణ కుప్పం విజన్ ను సీఎం వెల్లడించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-08 09:39 GMT

ప్రకృతి సేద్యంలో స్వర్ణకుప్పంగా తీర్చిదిద్దే పైలట్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఐదేళ్లలో వంద శాతం ప్రకృతి సేద్యం చేయడానికి వీలైన ప్రోత్సాహకాలు అందివ్వనున్నట్లు ప్రకటించారు. దేశంలో కుప్పంను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కూడా ప్రకటించారు. ఉద్యానవన రైతుల కోసం వంద "రూ కార్ట్ కూలర్లు" (Rukart Subjee Coolier) అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఈ ఫలితాలు మదింపు చేసి, ఐదేళ్లలో రాష్ట్రానికి విస్తరిస్తామని సీఎం చంద్రబాబు కుప్పం ప్రకృతి వ్యవసాయం విజన్-2029ను ప్రకటించారు.

పైలట్ ప్రాజెక్టులు
కుప్పంలో సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన బుధవారం ముగిసింది. సోమవారం పర్యటనకు వచ్చిన ఆయన విజన్ 2029లో వినూత్న ప్రయోగాత్మక పథకాల అమలుకు కుప్పంను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అందులో కేంద్ర ప్రభుత్వం అందించే సూర్యఘర్ పథకంలో కుప్పంలో వంద శాతం సోలార్ పవర్ మొదటిది. ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేయడానికి రెండో ఆదర్శ పథకానికి శ్రీకారం చుట్టారు.
కీలక ఒప్పందాలు...

టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో రెండోసారి కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు "కీలక ఒప్పందాలకు ప్రాధాన్యం" ఇచ్చారు. రైతులు, వ్యవసాయం, యువత, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఒప్పందాలు చేశారు. వారందరి సమక్షంలోనే పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను కూడా రప్పించారు. అందులో ప్రధానంగా..
1. పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేశారు.
2. సొంత హెరిటేజ్ సంస్థను కూడా పక్కన ఉంచిన ఆయన ఎన్డీడీబీ సహకారంతో శాంతిపురం వద్ద మదర్ డెయిరీకి 41.21 ఎకరాలు కేటాయించారు.
3. రూ. 105 కోట్లతో ప్లాంట్ ఏర్పాటుకు సహకారం ద్వారా నాలుగు వేల మందికి ఉద్యోగావకాశాలకు మార్గం కల్పించారు.
4. శ్రీజ పాల ఉత్పత్తిదారుల సమాఖ్యకు కూడా మార్గం సుగుమం చేశారు. దీని ద్వారా మరో నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు పడ్డాయి.
5. అలీప్ (Association of Lady Entreoreneurs India -ALIEP) ను రంగంలోకి దించారు. ఈ సంస్థ ద్వారా మహిళలకు వివిధ రకాల ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వడానికి మార్గం సుగుమం చేశారు. దీనివల్ల మహిళల అర్థిక ప్రగతికి తోడ్పాటు ఇవ్వాలనే ప్రధాన లక్ష్యాన్ని ఎంచుకున్నారు. దీనికితోడు ఈజీమార్ట్ టీసీఎస్ వంటి సంస్థలతో ప్రజల మధ్య ఒప్పందాలు జరిగాయి.
కుప్ప నియోజకవర్గంలోని 95 పంచాయతీల్లో 1,15,055 వ్యవసాయ భూమి ఉంటే, 62,888 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. 60,031 కుటుంబాలకు సొంత వ్యవసాయ భూములు ఉండగా, వారిలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులో కావడం గమనార్హం. వారిలో ఒక్కొక్కరికి అర్ధ ఎకరా నుంచి రెండు లేదా 2.5 ఎకరాల భూములు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆర్గానిక్ కుప్పంగా తీర్చిదిద్దాలనే ప్రధాన లక్ష్యానికి ఊతం ఇచ్చిన విషయంలోకి వెళితే, కుప్పం ప్రాంతంలో పువ్వులు, ఇతర ఉద్యానపంటల సాకుకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఇక్కడ పండించే పవ్వులు, పండ్లు పొరుగునే 120 నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని చెన్నై, బెంగళూరు నగరాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా తరలించే వ్యాపారులు డాలర్ల వర్షం కురిపించుకుంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రకృతి సేద్యం వైపు మళ్లించడానికి శీగలపల్లె కేంద్రంగా సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రైతులను పర్యవేక్షించడానికి రైతు సాధికార సంస్థ పని చేస్తోందన్నారు.
రైతులకు రూకార్డ్ సబ్జీ కూలర్లు

కుప్పంలో ఎన్డీడీబీ (Netional dairy Development Board- NDDB) పండ్లు కూరగాయల యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ ద్వారా యువతకు ఉపాధి దొరుకుతుంది. పండ్లు, కూరగాయల నిలువ చేయడానికి కుప్పంలో వంద రూకార్ట్ సబ్జీ కూలర్లు తీసుకురానున్నారు.
"ఉద్యానవన పంటలు సాగు చేసే100 మంది రైతులకు ఈ కూలర్లు అందిస్తాం. ఫలితాలు పరిశీలించిన తరువాత రాష్ట్రానికి విస్తరిస్తాం" అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
వాటి ప్రయోజనం ఏమిటి?
ప్రకృతి సేద్యంతో రైతులు పండించిన పండ్లు, కూరగాయలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులే కాకుండా, రైతులు కూడా ఉత్పత్తులు నిలువ చేసుకునేందుకు రూకార్ట్ కూలర్లు ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యం. పూనేలో రూకార్ట్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో వ్యవసాయ అనుబంధ పరికరాలు, ఉత్పత్తుల తయారీ చేస్తోంది. అందులో
వ్యవసాయ, ఉద్యానవన పంటల సాకుకు అవసరమైన యంత్ర పరికరాలు ఈ సంస్థ తయారు చేస్తోంది. వాటిని ఒడిశాతో పాటు కర్నాటక, పశ్చిమ బెంగాల్, తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఈ సంస్థ నుంచి కూలర్లు కొనుగోలు చేయడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయుకూడా కుదుర్చుకుంది. వాటన్నిటినీ అధ్యయనం చేసిన తరువాతే సీఎం చంద్రబాబు కుప్పంలో అమలు చేయాలని సంకల్పించినట్లు స్పష్టం అవుతోంది.
ధర ఎంతంటే..
పుణేలో తయారు చేస్తున్న ఈ కూలర్లు 50 కిలోల సామర్థ్యం ఉంటే, రూ. 35.400 వేలు, వంద కిలోల సామర్థ్యం కలిగిన కూలర్ ధర రూ. 50 వేలుగా ఉంది. చిన్నపాటి ఔట్లెట్లు ఏర్పాటు చేసుకునే నిరుద్యోగులకు వాటిని ఉచితంగా ఇస్తారా? సబ్సిడీతో ఇస్తారా? అనేది మాత్రం స్పష్టత లేదు. ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్న ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం చిరు దుకాణదారులకు సబ్సిడీపై అందిస్తున్నట్లు సమాచారం. రూకార్ట్ సబ్జీ కూలర్లను అంతర్గతంగా ఏడు లేయర్లతో తయారు చేయడం ప్రత్యేకత. ఐదు నుంచి21 డిగ్రీల సెల్సియస్ లో చల్లదనంతో ఉండే ఈ కాలర్లలో పండ్లు, పాలు, కూరగాయలు వారం రోజుల పాటు నిలువ చేయడానికి అవకాశం ఉంటుంది.
"కుప్పంలో ప్రయోగాత్మకంగా వాటి పనితీరు. ఫలితాలు పరిశీలించిన తరువాత మరిన్ని తీసుకుని వస్తాం" అని కూడా సీఎం చంద్రబాబు వెల్లడించారు. వాటిల్లో కూరగాయలు, పండ్లు, ఫూలు వారం రోజుల పాటు తాజాగా నిలువ చేయడానికి వీలుంటుందను కూడా ఆయన వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు ఇంకా ఏమంటున్నారంటే..

"సాధారణంగా ఒకో రోగానికి ఒకో రకం మందులు కోసం తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ వ్యక్తికి ఏ తరహా ఆహారం అవసరమో ఆ పంటలు పండించే విధానం కుప్పం నుంచే ప్రారంభిస్తాం" అని సీఎం చంద్రబాబు భవిష్యత్తును ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. మన ప్రాంతంలోని వ్యవసాయ పొలాల్లోని ఉత్పత్తులే ప్రజలకు ఆహారం, ఆరోగ్యానికి శ్రీరామరక్ష కావాలని, ఆ తరహా పంటల సాగుకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో ప్రజలకు ప్రకృతి సేద్యం ఉత్పత్తులను ఆశ్రయించే పరిస్థితులు రాబోతున్నాయని ఆయన అన్నారు.
రానున్న కాలంలో.. ఆహారమే మందులుగా ఉపయోగపడాలి. వ్యవసాయమే ఓ ఫార్మసీగా మారాలని ఆయన అభిలషించారు. అందుకు చాలా దూరం లేదని కూడా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రకృతి వ్యవసాయానికి సహకారం అందించేందుకు ప్రపంచ స్థాయి సంస్థలు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రకృతి సాగు పంటలు చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగాలు చేసినప్పుడు కూడా లేని సంతోషాన్ని ప్రకృతి సాగులో చూస్తున్నామని కొందరు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో చేసే ప్రకృతి సాగు విధానం, మార్కెంటింగ్‌ కంప్యూటరైజ్డ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రైతు సాధికార సంస్థ ద్వారా ఆర్గానిక్ సర్టిఫికెట్ ఉన్న ఉత్పత్తుల విక్రయానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రకృతి పంటల పేరు చెప్పి విక్రయిస్తున్న కొందరి కారణంగా కొనుగోలుదారులు కూడా గందరగోళ పడుతున్నారన్నారు. అలాంటిది లేకుండా ఆర్గనైజేషన్ల ద్వారా సర్టిఫికేషన్ అందిస్తున్నారని వివరించారు.
Tags:    

Similar News