కోటా నటించడు..జీవిస్తాడు..అందుకే అన్ని అవార్డులు

పాత్రలకు పేరు తెచ్చే నటుడిగా కోటా శ్రీనివాసరావు పేరు తెచ్చుకున్నారు.;

Update: 2025-07-13 08:48 GMT

డైరెక్టర్‌ ఏ క్యారెక్టర్‌ చెబితే ఆ క్యారెక్టర్‌లోకి దూరి.. ఆ క్యారెక్టర్‌లో జీవించడం కోట శ్రీనివాసరావుకు వెన్నతో పెట్టిన విద్య. అది తండ్రి పాత్ర కావచ్చు, మామ కావచ్చు, భర్త పాత్ర కావచ్చు, కడుపుబ్బా నవ్వించే కమిడియన్‌ పాత్ర కావచ్చు, హీరోకి చుక్కలు చూపించే విలన్‌ పాత్రలైనా కావచ్చు.. అది ఏ క్యారెక్టర్‌ అయినా సరే ఆ పాత్రకు తగ్గట్టుగా తనను తాను ఇముడ్చుకుని ఆ పాత్ర మాత్రమే వెండితెరపై కనిపించే విధంగా నటించి మెప్పించడం కోటా ప్రత్యేకత. తన నటనతో నవ రసాలను అవలీలగా రక్తి కట్టించడంలోను నైపుణ్యం కలిగిన నేర్పరి. కథకు తగ్గట్టుగా మాడ్యులేషన్స్‌ మార్చుకుంటూ తెలంగాణ యాసతో పాటు ఏ స్లాంగ్‌లో అయిన డైలాగ్స్‌ చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోటాకున్న స్పెషాలిటీ.

అలా అనేక పాత్రలు ధరించిన కోటా అన్ని భాషల్లో కలిపి దాదాపు 750లకుపైగా సినిమాల్లో వివిధ పాత్రలు నటించారు. తన నటనా మంత్రజాలంతో ప్రేక్షకులనే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోటా మంత్ర ముగ్ధులను చేశారు. పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం కోటాను గౌరవించగా, నంది అవార్డులతో రాష్ట్ర ప్రభుత్వాలు సత్కరించాయి. 2015లో నాటి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో కోటాను సత్కరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు నంది అవార్డులతో కోటాను గౌరవించింది.
1998లో విడుదలైన ‘గణేష్‌’ సినిమాలో కోటా పోషించిన విలన్‌ పాత్రకుగాను ఉత్తమ విలన్‌ కేటగిరీలో తొలి నంది అవార్డును సొంతం చేసుకున్నారు. మెడికల్‌ మాఫియా ప్రధాన అంశాంగా, విక్టరీ వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన అప్పట్లో పెద్ద హిట్‌ సాధించింది. ఆరోగ్య శాఖ మంత్రి సాంబశివరావుగా కోటా పోషించిన ప్రతినాయకుడి పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఉత్తమ కథనాయకుడు, ఉత్తమ విలన్‌తో పాటు అనేక అవార్డులు ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో గుండు గెటప్‌లో కనిపించే కోటా ఆరోగ్య శాఖ మంత్రి సాంబశివరావు పాత్రలో రక్తి కట్టించారు.
తర్వాత 2000లో విడుదలైన ‘చిన్న’ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన కోటాకు ఉత్తమ విలన్‌గా మరో నింది అవార్డును సొంతం చేసుకున్నారు. 2002 విడుదలైన ‘పృథ్వీనారాయణ’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డు తీసుకున్న కోటా.. 2004లో విడుదలై ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ‘ఆ నలుగురు’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడు కేటగిరిలో నంది వార్డును దక్కించుకున్నారు. మధన్‌ దర్శకత్వంలో జగపతిబాబు, ప్రియమణి హీరో హీరోయిన్లుగా 2006లో విడుదలై బంపర్‌ హిట్‌ సాధించిన ‘పెళ్లైన కొత్తలో’ సినిమాకు కూడా ఉత్తమ సహాయ నటుడుగా కోటా నంది అవార్డు తీసుకున్నారు.
Tags:    

Similar News