కొణిదెల నాగబాబు ఆస్తులు ఎంతంటే
అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ నుంచి అప్పులు తీసుకున్నట్లు నాగబాబు వెల్లడించారు.;
By : Admin
Update: 2025-03-09 06:10 GMT
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు తన ఆస్తులను ప్రకటించారు. రూ. 59 కోట్ల చరాస్తులు, రూ. 11 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. దీంతో పాటుగా తన అన్న మెగాస్టార్ చిరంజీవి వద్ద, తమ్ముడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వద్ద అప్పులు ఉన్నట్లు తెలిపారు. చిరంజీవి దద్ద రూ. 28లక్షలు, పవన్ కల్యాణ్ వద్ద రూ. 6లక్షలు అప్పులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన కొణిదెల నాగేంద్రబాబు తన ఆస్తుల వివరాల అఫిడవిట్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. చరాస్తులు, స్థిరాస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు.
తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో రెండు చోట్ల భూములున్నాయని, 2.39 ఎకరాల భూమి ఉందని, దీని విలువ రూ. 3.55 కోట్లు ఉందని వెల్లడించారు. అదే రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో రూ. 53.50లక్షల విలువైన 1.07 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 3.28 ఎకరాల భూమి ఉందని, దీని విలువ రూ. 32.80లక్షలు ఉందని, అదే ప్రాంతంలో మరో చోట రూ. 50లక్షల విలువైన 5 ఎకరాలు ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా హైదరాబాద్ మణికొండలో రూ. 2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల నివాస విల్లా ఉందని, ఇలా మొత్తం కలిపి రూ. 11.20 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
చరాస్తుల కింద మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, బ్యాంకులో నగదు, చేతిలో ఉన్న నగదు వివరాలను కూడా వెల్లడించారు. తనకు, తన భార్యకు కలిపి రూ. 59.12 కోట్ల చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. వాటిల్లో రూ. 55.37 కోట్ల మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, చేతిలో రూ. 21.81లక్షల లిక్విడ్ క్యాష్, బ్యాంకులో రూ. 23.53 కోట్లు నిల్వ నగదు, ఇతరులకు రూ. 1.03 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు ఉన్న వాహనాలు, వాటి విలువను, బంగారం, వెండి ఆభరణాలు, వాటి విలువను కూడా వెల్లడించారు. రూ. 67.28లక్షల విలువైన బెంజ్ కారు, రూ. 11.04లక్షల విలువైన హ్యూందాయ్ కారు ఉన్నట్లు పేర్కొన్నారు. తనవద్ద రూ. 18.10లక్షల విలువైన 226 గ్రాముల గోల్డ్, తన భార్య వద్ద రూ. 16.50లక్షల విలువైన 55 క్యారెట్ల వజ్రాలతో పాటు రూ. 57.99లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, రూ. 21.40 లక్షల విలువైన 20కేజీల వెండి ఉన్నట్లు ప్రకటించారు.
తన అన్న చిరంజీవి వద్ద రూ. 28,48,871 కోట్లు, తమ్ముడు పవన్ కల్యాణ్ నుంచి రూ. 6.90లక్షల అప్పులు తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతో పాటుగా రెండు బ్యాంకుల్లో హౌసింగ్ లోన్ కింద రూ. 56.97లక్షలు, కారు లోన్ కింద రూ. 7,54,895, వీటితో పాటు ఇతర వ్యక్తులు, ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పులన్నీ కలిపి మొత్తంగా రూ. 1.04 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. తన మీద కేసులేమీ లేవని ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లో ప్రకటించారు. ఈ నెలాఖరు నాటికి ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిల్లో ఒక స్థానం కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబును ఖరారు చేశారు. ఆ మేరకు ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.