విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కోసం ఏపీ ఎంఓయూ
తన రాజకీయ జీవితంలో గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం ఒక అనుభూతి. విశాఖపట్నంలో ఏర్పాటుకు ఒప్పందం చేసుకోవడం అపూర్వ ఘట్టం అని సీఎం చంద్రబాబు అన్నారు.
గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం జరిగింది. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిల్లీలో ఒప్పందం కుదర్చుకుంది. తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం ఇంకా పలువురు ముఖ్యులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, 2029 నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
విశాఖలో రూ.87,520 కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఒక గిగా వాట్ కెపాసిటీతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ డేటా సెంటర్ వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది. విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్ సీ-కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుంది.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ ఒప్పందాన్ని తన రాజకీయ జీవితంలో అపూర్వ ఘట్టంగా పేర్కొన్నారు. "ఇది నాకు, అందరికీ చాలా శుభప్రదమైన, సంతోషకరమైన రోజు. ముందుగా ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయనే దీన్ని సాధ్యం చేశారు. మన ఆర్థిక మంత్రి (నిర్మలా సీతారామన్) చాలా బాగా చేశారు. సమాచార శాఖ మంత్రి (అశ్వినీ వైష్ణవ్) నేను ఈ ఆలోచనను చెప్పినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు... గూగుల్ భారతదేశంలోకి రావాలని, మా రాష్ట్ర ఐటీ మంత్రి (నారా లోకేష్) కూడా మీతో కలిసి పని చేశారు" అని పేర్కొన్నారు.
గూగుల్‌పై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు, "గూగుల్‌కు నేను గొప్ప అభిమాని. మీ సృజనాత్మకత, వేగం చాలా ముఖ్యం" అని అన్నారు. తన ముఖ్యమంత్రి కాలంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను తీసుకువచ్చినట్లు, ఇప్పుడు విశాఖపట్నంకు గూగుల్‌ను తీసుకువస్తున్నామని దీనిపై సంతోషం వ్యక్తం చేశారు. "మేము ప్రేరణాత్మక కాలంలో ఉన్నాము" అని అన్నారు.
విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా, ఏఐ సిటీగా తీర్చిదిద్దుతామని, గతంలో హైదరాబాద్ హైటెక్ సిటీ అభివృద్ధి చేసినట్లే ఇక్కడ AI, డేటా సెంటర్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రణయపూర్వక వాగ్దానం చేశారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం, లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని, యువత భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.
ఈ ఒప్పందం ద్వారా విశాఖపట్నం ప్రపంచ స్థాయి టెక్ హబ్‌గా మారనుందని, భారతదేశంలోనే అతిపెద్ద 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ 2029 నాటికి పూర్తవుతుందని కార్యక్రమంలో ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని, ఇది రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తుకు మైలురాయి అని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ.. గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ ఉండబోతుందని తెలిపారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాయని పేర్కొన్నారు. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని స్పష్టం చేశారు. జెమినీ-ఏఐతో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని పేర్కొన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లల్లో 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని చెప్పారు. భారత దేశానికే కాదు.. విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీ ఇచ్చేలా విశాఖ గూగుల్ డేటా సెంటర్ వేదిక కానుందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, గూగుల్ క్లౌడ్ ఆసియా ఫసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వాలు పాల్గొన్నారు.