అది ఎప్పటికో 'మీ భూమి'.. ఇప్పటికైతే పరాయిదే!

'మీ భూమి' వెబ్‌సైట్ వెతలెన్నో... పట్టించుకునే నాధుడేడీ?

Update: 2025-10-14 07:13 GMT

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ భూముల ఆస్తి హక్కుదారులు అవస్థలు తీర్చేందుకు ప్రవేశపెట్టిన "మీ భూమి" ఇప్పుడు మరింత ఇబ్బందులు పెడుతోంది. ఆస్తి హక్కుదారులు తమ పేర్లను, స్థిరాస్తులను ఆన్ లైన్ లో "మీ భూమి" వెబ్ ల్యాండ్ లో నమోదు చేసుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో రైతుల పరిస్థితి ఎక్కేగడప, దిగే గడప అన్నట్టుగా తయారైంది. అయినా రెవెన్యూ ఉన్నతాధికారులు తాకితలవడం లేదు.

ఇదీ విషయం..

ఆంధ్రప్రదేశ్ లో "మీ భూమి" పేరిట ఆన్ లైన్ ల్యాండ్ వెబ్ సైట్ ఉంది. వ్యవసాయ భూముల హక్కుదారులు తమ భూములను రిజిస్ట్రేషన్ చేయాలన్నా, వారసత్వంగా వచ్చిన వాటిని నమోదు చేసుకోవాలన్నా ఈ వెబ్ సైట్ లో నమోదుచేసుకోవాలి. అలాగే ఇతరులకు అమ్ముకున్న లేదా కోర్టుల ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిన వ్యవసాయ భూములు అధికారిక లెక్కలోకి రావాలన్నా ఈ సైట్లోనే ఎక్కించాలి. ఎక్కడైనా కొనుక్కున్న భూముల్ని ప్రస్తుత యజమాని పేరుతో 1 బి, 10 బి అడంగల్ లో ఎక్కించాలంటే కూడా ఈ వెబ్ సైటే గతి. ప్రభుత్వ రికార్డులలో హక్కుదారుల పేర్లు మ్యుటేషన్ చేయించుకోవాలంటే కూడా ఈ వెబ్ సైట్ ను ఆశ్రయించాల్సింది.


ప్రభుత్వం చాలా సదుద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టింది. అయితే అమలులో మాత్రం అది ఏమాత్రం సహకరించడం లేదు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ కార్యాలయాలలో అన్ని ఆధారాలతో ఉన్న ఆ భూ హక్కుదారు పేర్లు ఎక్కిస్తుంటే ప్రభుత్వ వెబ్సైట్ అసలు తీసుకోవటం లేదు.

దీనిపై ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ... మీ భూమి వెబ్ సైట్ లో వ్యవసాయ భూముల యజమానులు తమ పేర్లను నమోదు చేసుకోలేక పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. "ఇందులో పేర్లు ఎక్కించుకోలేక పోవడంతో తమ భూములు అమ్ముకోలేక, ఇతరులకు, తమ వారసులకు ఇవ్వలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు జరగక ఆగిపోయాయి. రెవెన్యూ కూడా తగ్గిపోతోంది. భూ యజమానులు గత కొన్ని నెలలుగా ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా సరే స్థానిక అధికారులు ఉన్నత అధికారుల మీద నెపం నెట్టి తప్పించుకుంటున్నారు. కొంతమంది రెవిన్యూ అధికారులైతే ఇది CCLA ప్రధాన కార్యాలయం వారు చేయాల్సిన పని అంటున్నారు. అక్కడికి వెళితే అది తమది కాదు అంటున్నారు." అని చెప్పారు శ్రీధర్.

అసలు ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారో తెలియక వ్యవసాయ భూముల యజమానులు గందరగోళానికి గురవుతున్నారు. భూ యజమానులు ఎన్ని ఫిర్యాదులు చేసినా స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని గుంటూరు జిల్లా కూరపాడుకు చెందిన రఘురామయ్య వాపోయారు.

తహసిల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల భూ యజమానుల మ్యుటేషన్ అర్జీలు పరిష్కారం కావడం లేదు. ఫలితంగా అవి కట్టలు కట్టలు పేరుకుపోతున్నాయి.

చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మీ భూమి వెబ్ సైట్ ను సక్రమంగా నిర్వహించాలని అవగాహన సంస్థ అధ్యక్షుడు కె.శివరామిరెడ్డి కోరారు.


గత ప్రభుత్వంలో ఇటువంటి సమస్య ఉత్పన్నం అవ్వలేదని, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా కావాలని కొంతమంది అధికారుల అత్యుత్సాహంతో తమకి ఈ గతి పట్టించారని భూ యజమానులు వాపోతున్నారు. అందువల్ల రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, సి సి ఎల్ ఏ ఉన్నతాధికారులు తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూ యజమానులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని శ్రీధర్ ప్రభుత్వ ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News