చిరంజీవిపై కామినేని వ్యాఖ్యలు వెనక్కి
సినీనటులపై ఎమ్మెల్యే కామినేని చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటించారు.
By : The Federal
Update: 2025-09-27 09:18 GMT
మెగాస్టార్ చిరంజీవి, ఇతర సినీనటులపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఎట్టకేలకు వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లిన చిత్రరంగ ప్రముఖులను ఉద్దేశించి సభలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరిస్తున్నట్టు తెలిపారు. అలాగే, ఆ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కామినేని శ్రీనివాస్ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు, ఇది ఒక శ్రేయస్కరమైన పరిణామంగా అభివర్ణించారు. కామినేని వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
మరో వైపు కామినేని వ్యాఖ్యలపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవి, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలతో కొత్త వివాదం చెలరేగిన తరుణంలో, కామినేని స్వయంగా స్పందించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి ముందుకొచ్చారు.
ఈ వ్యవహారంపై జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ, ‘‘సభలో లేని వ్యక్తులపై వ్యాఖ్యలు చేయడం సరికాదు అనే నైతిక స్థాయితో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం అభినందనీయమైంది’’ అన్నారు. కామినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే రికార్డుల నుంచి తొలగించబడ్డాయని వారు తెలిపారు. ‘సభ వేదికను ప్రజల సమస్యలపై చర్చించడానికి ఉపయోగించాలి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోంది‘ అని స్పష్టం చేశారు.