ఎక్ల్సూజివ్: తెల్లకవర్ గుట్టు విప్పిన కళ్యాణ్..
ఓ తెల్లటి ప్లాస్టిక్ బ్యాగు అలిపిరి మెట్టుపై ఉంచిన పవన్ కల్యాణ్ మోకరిల్లారు. ఊహించినట్లుగానే తిరుమలలో ఆ గుట్టు విప్పారు. తిరుపతిలో కీలక ప్రకటన చేయనున్నారా?
By : SSV Bhaskar Rao
Update: 2024-10-02 10:37 GMT
తిరుపతి నుంచి ఏ కార్యక్రమమైనా ఆరంభించడానికి రాజకీయ పార్టీలు ప్రాధన్యం ఇస్తాయి. ఆ కోవలో.. జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం (అక్టోబర్ 3న) చేయనున్న కీలక ప్రకటనపై ఆసక్తి రేకెత్తించారు. ఆయన ఏమి చెప్పబోతున్నారనే విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. "లడ్డు ప్రసాదం తయారీలో వాడిన కల్తీ నెయ్యి వల్ల అపచారం జరిగింది" అనే మాటల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్ఛిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్ష విరమణకు మూడు రోజల పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు.
పాదాల మండపం వద్ద పూజల తర్వాత తిరుమలకు బయలుదేరే ముందు "అలిపిరి మెట్లపై జిప్ వేసి ఉన్న ఓ తెల్లటి పెద్ద కవర్" ఉంచారు. ఆ మెట్టు కింద పవన్ కల్యాణ్ మోకరిల్లారు. కొన్నినిమిషాల పాటు దేవదేవుని మనసులో స్మరించుకుంటూ ప్రార్థన చేశారు. ఆ తరువాత ఆ కవర్ తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యలో ఆ కవర్ ను తన ఆత్మీయ మిత్రుడు, తొలిప్రేమ సినిమా దర్శకుడు ఆనందసాయికి అందించారు. తిరుమల వరకు ఆయనే ఆ కవర్ తీసుకుని వెళ్లారు.
శ్రీవారి చెంతకు బయలుదేరే ముందు ప్రతి భక్తుడు ఇలా పాదాలకు నమస్కరించి, మెట్లకు పూజలు చేసుకుంటూ కాలినడకన తిరుమలకు వెళతారు. అదే క్రమంలో.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యవహరించారు. అయితే, "అలిపిరి మెట్టుపై ఆయన ఉంచిన తెల్ల కవర్ ఏమిటి? అందులో ఏముంది? అనే విషయం చాలామంది గమనించలేదు. మీడియా కూడా దీనిపై దృష్టి పెట్టలేదు. 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' మాత్రమే దీనిపై ప్రత్యేక కథనం ఇచ్చింది. అందులో ఏ పత్రాలు ఉన్నాయనేది తెలియలేదు.
"డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన ఆత్మీయ మిత్రుడు, ఆర్ట్ డైరెక్టర్, తొలిప్రేమ సినిమా దర్శకుడు అనందసాయికి మాత్రమే అందులో ఏముందనేది తెలుసు" అనే విషయాన్ని ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ కథనం వెలువరించింది. "దీనిని పవన్ కల్యాణ్ మాత్రమే తిరుమలలో వెల్లడించే అవకాశం ఉంది" అనే విషయాన్ని కూడా ఆ కథనంలో ప్రస్తావించింది. కాగా,
తిరుమలలో శ్రీవారి దర్శించుకోవడానికి వెళ్లే సమయంలో పవన్ కళ్యాణ్ ఆ కవర్ ఓపెన్ చేయడం, చేతిలో ఓ పుస్తకంతో ఆలయంలోకి వెళ్లారు. ఆలయం వద్దకు రాగానే ఆయనను టీటీడీ అధికారులు సాధారంగా తోడుకొని వెళ్లారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుమార్తెలు ఆద్యా, కొలేనా అంజనా పవనోజీకి వేదపండితులు వేదాశీర్వచనాలు అందించారు. ఆ తర్వాత స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలను టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి, అధికారులు అందించారు.
గుట్టు విప్పిన కల్యాణ్
శ్రీవారి దర్శనం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలయం వెలుపలికి వచ్చారు. తన చేతిలో ఉన్న మెరూన్ కలర్ పుస్తకాన్ని గుండెలకు హత్తుకుని కనిపించారు. ఆ పుస్తకం కవర్ పేజీ పై వారాహి అమ్మవారి ఫోటో మాత్రమే ప్రధానంగా ముద్రించారు. ఇది "జనసేన వారాహియాత్ర డిక్లరేషన్" అని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇందులో ఏ అంశాలు పొందుపరిచారనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. ఆయనకు సన్నిహితంగా ఉన్న తొలిప్రేమ డైరెక్టర్ అనందసాయికి కూడా అందులోని విషయాలు ఏమిటనేది తెలిసినప్పటికీ బయటకి ఒక్కనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా మెలిగే కొందరు జనసేన పార్టీ అంతరంగిక నాయకులను కదిపినా కూడా తమకు ఏమీ తెలియదని పెదవి విరిచారు.
తిరుపతిలో వారాహియాత్రలో వెల్లడి
ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం మూడు రోజుల పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు వచ్చారు. అందులో భాగంగా తిరుపతిలో ఈ నెల మూడో తేదీ అంటే గురువారం వారాహిసభ నిర్వహించనున్నారు. ఈ సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నారు. జనసేన రాష్ట్ర నాయకురాలు ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. అందులోని విషయాలను పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడిస్తాదనేది ఆమె మాట. డిక్లరేషన్ లో ఏ విషయాలను పొందుపరిచాదనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు. ఈ విషయాలు తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఆయన ఏం ప్రకటిస్తారో వేచి చూద్దాం.