కదిరి మున్సిపాలిటీ టీడీపీ హస్తగతం
దిల్షాద్ ఉన్నీసా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ ఈ ఎన్నికలను బహిష్కరించింది.;
By : The Federal
Update: 2025-05-19 07:01 GMT
శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన దిల్షాద్ ఉన్నీసాను కదిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కౌన్సిలర్లు సుధారాణి, రాజశేఖర్ ఆచారిలను వైస్ చర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జరిగిన ఈ ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పార్టీలు కదరి మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట భాణా సంచా పేలుస్తూ కూటమి పార్టీలు సంబరాలు చేసుకున్నాయి. మరో వైపు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను బహిష్కరించింది.
కదిరి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చక్రం తిప్పారు. ఛైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ల పదవులను ఏకగ్రీవం చేయడంలో ఎమ్మెల్యే కందికుంట కీలకంగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లను ఈ ఎన్నికలకు ముందు బెంగుళూర్ క్యాంప్‌కు తరలించారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఉదయం వారు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. వీటిల్లో టీడీపీకి 25 మంది కౌన్సిలర్లు ఉండగా, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బెంగుళూరు క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు రావడం, చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చకచకా జరిగి పోయాయి.